పిట్టకొంచెం, డ్యాన్స్ ఘనం: అబ్బురపర్చే బినితా బ్రిటన్ జర్నీ!

బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షోలో దుమ్మురేపింది.. న్యాయనిర్ణేతలను నివ్వెరపర్చింది!

బినితా డ్యాన్స్ జర్నీ ఇది!!

బ్రిటీష్ ట్యాలెంట్ షోలో మన భారతీయ అమ్మాయి దుమ్ముదులిపింది. ఆమె పెర్ఫార్మెన్స్ కి గాట్ ట్యాలెంట్ షో ముఖ్య అతిథులు ఫిదా అయ్యారు. లేచి నిలబడి అమేజింగ్ అంటూ స్టాండింగ్ ఒవేషన్ తెలిపారు. ఇంతకీ ఆ అమ్మాయెవరో, ఏం చేసిందో ఆ షో చూసినవారికిప్పటికే తెలిసే ఉంటుంది. మిగిలినవారి కోసమే ఈ నాల్గు ముక్కలు.

బినితా చెట్రీ నృత్యంతో మెస్మరైజ్ చేసింది. న్యాయమూర్తులు నోళ్లు వెళ్లబెట్టారు. అదీ బ్రిటన్ లో. అసలు ఆ వేదికపై ఓ మనిషి రూపం కదులుతుందా.. లేక, రోబోటిక్ స్ప్రింగ్ తో ఎవరైనా ఆడిస్తున్నారా అనే మీమాంస కల్గేలా అచ్చెరువొందించింది బినితా. మొత్తంగా ఒకే ఒక్క బ్రిటీష్ గాట్ ట్యాలెంట్ షోతో ఓవర్ నైట్ స్టార్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఐకాన్ గా అవతరించింది బినితా.

అసలు బినితా చెట్రీ ఎవరు..?

జస్ట్ 8 ఏళ్ల బాలిక. అవును అస్సాం బోకాజన్ జిల్లా అమరాజన్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక బినితా చెట్రీ.. రాజస్థాన్ లోని జైపూర్ లో చదువుకుంటోంది. తన అమాయకపు చూపులు, ముద్దుముద్దు మాటలతో న్యాయమూర్తులను ఆకట్టుకున్న బినితాను న్యాయమూర్తులు ముందు ఓ చిన్నపిల్లలానే భావించారు. కానీ, ఆమె డ్యాన్స్ మొదలెట్టాక జస్ట్ అవాక్కవ్వడమే వారి వంతైంది. ఆమె స్పీడు, కదలికలు, ఎక్కడా తొట్రుపాటు లేని భంగిమలు, ఎనర్జీ లెవెల్స్ ఇలా ఏ కోణంలో చూసినా మిస్ పర్ఫెక్ట్ అన్నట్టు అన్నట్టుగా సాగింది బినితా డ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల నృత్య ప్రదర్శనలను చూపించేందుకు మొదలైన బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షోలో ఇప్పటివరకూ వచ్చిన ఎందరో డ్యాన్సర్స్ ను మించి బినితా జడ్జెస్ తో పాటు, ఆ షోను నేరుగానూ, టీవీ సెట్లలో చూస్తున్నవారి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఇలాంటి షోస్ లో పాల్గొనాలనుకునే మరెందరికో ఓ స్ఫూర్తి కథలా ఆకట్టుకుంటోంది.

బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో న్యాయమూర్తులు సైమన్ కోవెల్, అమండా హోల్డెన్, అలేషా డిక్సన్, బ్రూన్ టోనియోలి… బినితా ప్రదర్శన చూసి కళ్లు తేలవేశారు. అసలు నువ్విక్కడికెలా వచ్చావని వారడిగిన ప్రశ్నకు.. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో తన కలల వేదిక అని సమాధానమిచ్చింది బినితా. ఆమె ఇదే షోలో తన ప్రతిభతో మరో నెక్స్ట్ రౌండ్ కు ఎంపికైంది. ఈ పోటీలో గెల్చుకుని పింక్ ప్రిన్సెస్ హౌజ్ గేమ్ కొనుక్కోవాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.

2024 ఆగస్ట్ లో జరిగిన సోలో ఆల్ స్టైల్ డ్యాన్స్ కాంప్టీషన్ లోనూ మొదటి రన్నరప్ గా నిల్చింది బినితా. ఈ కాంప్టీషన్స్ లో జాజ్, ట్యాప్, హిప్ హాప్, బ్యాలే వంటి నృత్య ప్రదర్శనల్లో సోలోగా పోటీ చేయొచ్చు. డ్యాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్ 2 లో భాగంగా చేసిన నృత్యంలోనూ దుమ్ముదులిపింది ఈ గడుగ్గాయి.

బ్రిటన్ గాట్ టాలెంట్ షోలో భారత ప్రతినిధిగా బినితా!

ఇండియాటుడేకు బినితా తండ్రి అమర్ హెట్రీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమంటారంటే.. మూడేళ్లకే బినితాలో ఒక రిథమిక్ డ్యాన్స్ మూమెంట్స్ మేం గమనించామని.. టీవీల్లో పాటలు చూస్తున్నప్పుడైనా.. ఇంకెక్కడైనా సంగీతం వినిపించినప్పుడైనా యథాలాపంగా ఆమె కదలికల్లో నృత్యరీతులుండేవంటాడు. అందుకే ఆమెకు నృత్యం నేర్పించాలని నిర్ణయించుకున్నామని.. అందుకోసం అస్సాం రాజధాని గౌహతికి పంపించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు ఓ బ్రాయిలర్ కోళ్ల ఫామ్ నడుపుకునే అమర్. ఆ తర్వాత కొద్దికాలానికి బినిత తన అత్తతో కలిసి జైపూర్ కు వెళ్లి అక్కడే చదువుకుంటూనే.. నృత్యగురువు హార్దిక్ రావత్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందింది. అక్కడే నైపుణ్యమున్న డ్యాన్సర్ గా అవతరించింది.

అయితే, బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో గురించి తమకు తెలియదని… బినితా గురువు హార్దిక్ రావత్ సూచన మేరకే మేము అక్కడికెళ్లామన్నాడు అమర్. నా బిడ్డ నాట్య సామర్థ్యాన్ని గురువు నమ్మాడు. ఆయన విశ్వాసం, ప్రోత్సాహం మేరకు మేం వెళ్లాం. దాన్నే స్టేజ్ పై చూశామంటున్నాడు బినితా తండ్రి.

తన బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షోకు సంబంధించిన వీడియోను బినితా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద నృత్య వేదికల్లో ఒకటైనచోట నేను భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని ప్రకటించడానికి సంతోషంగా ఉందంటూ ఆమె షేర్ చేసిన పోస్ట్ కు ఇప్పుడు నెటిజనం నీరాజనం పడుతున్నారు.

అంతేకాదు, ఇది మున్ముందు ఇంకా ఎన్నో సాధించేందుకు ఓ ఆరంభం మాత్రమే.. మీ అందరి మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని.. తనను ఆశీర్వదించాలంటూ ఆమె అమృతమయమైన మాటలకు జేజేలు పలుకుతుండగా… తన నృత్య ప్రయాణంలో తనకు మద్దతుగా నిల్చిన తన గురువు హార్దిక్ రావత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపింది చిన్నారి బినితా చెట్రీ.

మొత్తంగా ఇప్పుడు భారతదేశం నుంచి బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షోలో ఓ ఐకానిక్ ప్రదర్శనతో… ప్రపంచమే నివ్వెరపోయేలా చేసి ఓ చర్చగా మారింది 8 ఏళ్ల బినితా అనే చిచ్చరపిడుగు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles