డాక్టర్ కావాలనుకుని యాక్టర్నయ్యాననే వారిని చూసి.. అదో నానుడిలా మారిపోయిన క్రమం మనకు తెలిసిందే. అలాంటిదే ప్రముఖ పిల్లనగ్రోవి వాద్యకారుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ప్రయాణం.
విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవన వేదమంటూ సిరివెన్నెల కలాన్ని, బాలు గళాన్నీ తన వేణునాద గమకాలతో గాల్లో ఓలలాడించిన ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ చౌరాసియా. మరి హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూటిస్ట్ ఎలా అయ్యాడు..?

మనసును ఆహ్లాదపర్చే, మెదడును రంజింపజేసే అద్భుతమైన గమకాలు ఆ గాలితో పాటే పోటీ పడేందుకు ముందు.. హరిప్రసాద్ చౌరాసియా ఓ తిరుగుబాటుదారుడు. అవునూ.. నిజమే. తండ్రి మాటను ధిక్కరించి వేణు వాద్యకారుడిగా ఎదిగిన చరిత్రకారుడు చౌరాసియా.
ఉత్తరప్రదేశ్ లో ఈమధ్యే కుంభమేళాతో మరోసారి వార్తల్లోకెక్కిన అలహాబాద్ కు మరో పేరైన ప్రయాగ్ రాజ్ లోని గంగా, యుమునా, సరస్వతీ త్రివేణి సంగమం చౌరాసియా జన్మస్థలం. అదిగో ఆ త్రివేణీ సంగమ చౌరస్తాలోంచి బయటకొచ్చిన ఓ వెదురుబొంగు గాలిలో శివతాండవమాడితే అదే హరిప్రసాద్ చౌరాసియా.
హరిప్రసాద్ చౌరాసియాను ఎలాగైనా మల్లయోధుడిగా తీర్చిదిద్దాలన్నది ఆయన తండ్రి కోరికట. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో మల్లయుద్ధాలు జరుగుతుండటం, మల్లయోధులకూ డిమాండ్ ఉండటం, చౌరాసియా తండ్రికీ అందులో కొడుకును నేర్పరిని చేయాలన్న ఆసక్తి రేగడంతో ఆ ఒత్తిడిని కొడుకు చౌరాసియా మీద పెట్టేవాడట ఆయన తండ్రి. కానీ, చౌరాసియాకు మాత్రం అదిష్టం లేదు. అదిగో అక్కడే తిరుగుబాటు మొదలైంది. తండ్రిని ధిక్కరించిన చౌరాసియా చూపు సంగీతం వైపు పడింది. ఒకవేళ తండ్రి ఒత్తిడికి తలొగ్గి… చౌరాసియా తిరుగుబాటు చేయకపోయుంటే ఇవాళ మనం దేశం గర్వించదగ్గ వేణు నాదకారుణ్ని చూసి ఉండేవాళ్లం కాదు.. అంతకుమించి విని ఉండేవాళ్లమంతకన్నా కాదు.
తన తండ్రికి తెలియకుండానే సంగీతం నేర్చుకోవడం మొదలెట్టాడు హరిప్రసాద్ చౌరాసియా. మొదట ఓకల్ సింగర్ గా ప్రయత్నించాడు చౌరాసియా. కానీ, పండిట్ రాజారామ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న సమయంలో తన ఓకల్ పెర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో కుదరలేదు.. పైస్థాయిలో గమకాలను పలికే క్రమంలో.. అందుకు తన గళమూ సహకరించదన్న విషయాన్ని పసిగట్టిన చౌరాసియా.. ఆయన గురువు చెప్పినట్టుగా మరో వాద్యాన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే, ఏ వీణో, సితారో అయితే.. ఇంటికి తీసుకెళ్లలేడు. ఎందుకంటే, తను సంగీతం నేర్చుుకుంటున్న విషయం తండ్రికి తెలియదు. అప్పటికే మల్లయుద్ధంలో తర్ఫీదిప్పాస్తానంటే తప్పించుకు తిరుగుతున్నందున తండ్రి మరింత గుస్సా అయ్యే అవకాశముంటుంది. కాబట్టి, అవసరమైతే ఏ బ్యాగులోనో, మంచంలోని పరుపుకిందో, ఏ పెట్టెలోనో సులభంగా దాచేలా ఉండే వాద్యాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు.. చౌరాసియాకు గుర్తొచ్చింది వేణువాద్యం. అదిగో అలా ఒక ప్రపంచ ప్రసిద్ధ వేణువాద్యకారుడు మన
భారతంలో ఉద్భవించాడు.
జస్ట్ 15 ఏళ్లకే సంగీతంలో వండర్స్ చేయడం ప్రారంభించిన చౌరాసియాపై వారణాసికి చెందిన ప్రముఖ వేణు వాద్యకారుడు పండిట్ బోలానాథ్ దృష్టి పడింది. ఆయన వద్ద 8 ఏళ్లపాటు శిక్షణ పొందాడు చౌరాసియా. దృపద్ ఘరానాలో సుశిక్షితుడైన హరిప్రసాద్ చౌరాసియా 1957లో ఒడిశా కటక్ లోని ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ తర్వాత కటక్ నుంచి 1960లో ముంబైకి బదిలీ అయ్యాడు. అక్కడ సుర్ బహార్ వాద్యకారిణి అన్నపూర్ణాదేవి దగ్గర మరింత సుశిక్షితుడైన చౌరాసియా కెరీర్ ఆ తర్వాత వివిధ మలుపులు తిరిగింది. ఆల్ ఇండియా రేడియోను వదిలేసి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన వేణునాదంతో ఉర్రూతలూగించాడు.

బాలీవుడ్ లోనూ ప్రముఖ సంతూర్ సంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మతో కలిసి అడుగుపెట్టి.. సిల్ సిలా, ఫాస్లే, విజయ్, చాందినీ, లమ్హే, పరంపర, డర్, సాహిబా వంటి సినిమాలకూ పనిచేశాడు. తెలుగులో ఆయన వాద్యంలోని సిరివెన్నెల పాటల్లో ఆ ఫ్లూట్ బిట్స్ కోసమే మళ్లీ మళ్లీ పాటలు వినాలనిపించేలా తన సంతకాన్ని తెలుగు తెరపై కూడా మర్చిపోకుండా చేశాడు చౌరాసియా. అన్నట్టు 16days in afghanistan అనే ఇంగ్లీష్ సినిమాకు కూడా పనిచేశాడు చౌరాసియా.
ఒక్కసారి విధాత తలపున వినిచూడండి… ఆ వేణునాదాన్ని మాత్రమే వింటూ చెవులు రిక్కరించండి.. ఆ చౌరాసియా ఏంటో ఓసారి అర్థమవుతుంది. లింక్ కింద ఉంది చూడొచ్చు.
1970ల నుంచి హరిప్రసాద్ చౌరాసియా కెరీర్ అత్యున్నత స్థాయిలో పయనించింది. జార్జ్ హారిసన్ వంటి సంగీత దిగ్గజాలతో పనిచేయడంతో పాటు.. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, తబాలా లెజెండ్ జాకీర్ హుస్సేన్ వంటివారితో జుగల్బందీలు వాయిస్తూ.. వివిధ రకాల ఆల్బమ్స్ ను తీసుకొచ్చారు హరిప్రసాద్. అదే సమయంలో తన వేణునాదంలో జాజ్ తో పాటు.. ప్రపంత సంగీతంలోని కొత్త రీతులను మేళవించి ఒక నూతన ఒరవడిని వేణునాదంలో తీసుకొచ్చి ఎందరో ఫ్లూటిస్టులకు ఓ రోల్ మాడల్ గా నిల్చిన వాద్యకారుడయ్యాడు.
నేర్చుకోవడం ఆపేస్తే ఇక మనమూ ఆగిపోయినట్టేనన్నది హరిప్రసాద్ చౌరాసియా నినాదం. అందుకే, ఎక్కడ ఏది కొత్తగా కనిపించినా దాన్ని ఆరా తీసి, దాని గురించి కావల్సినంత పరిశోధించి, మంచీ, చెడులను విశ్లేషించి, దాన్ని భారతీయ సంగీతానికనుగుణంగా ఎలా మల్చుకోవచ్చో నిరంతర ప్రయత్నమే చౌరాసియాను పద్మభూషణున్ని, విభూషణున్నీ చేసింది.
వెదురుబొంగుతో వాయించే బాన్సూరీలో నైపుణ్య ప్రదర్శన కంటే కూడా… దాన్ని ఓ ఆధ్యాత్మిక సాధనగానే చూస్తాడు చౌరాసియా. వేణునాద సాధన ఓ యోగాలాంటిదని.. అది వాయించే సమయంలో కల్గే ఉఛ్వాస నిఛ్వాసాలు ఇంద్రియాలను ప్రశాంత పరుస్తాయని చెబుతారాయన.
తనను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులెవరంటే మాత్రం ముంబైకి చేరుకున్నాక తనను మరింత రాటుదేల్చిన సుర్ బహార్ వాద్యకారిణి అన్నపూర్ణాదేవి, ఆమె తండ్రి అల్లావుద్దీన్ ఖాన్ సాహెబ్ పేర్లు చెబుతాడు. ఎందుకంటే వారు తమ సంగీత ప్రయాణంలో జీవితాల్నే త్యాగం చేసిన కళాకారులనేది చౌరాసియా అభిప్రాయం. వారి ప్రభావం చౌరాసియా సంగీత ప్రయాణంలోనూ.. అలాగే, ఆయన ఫిలాసఫికల్ లైఫ్ స్టైల్ లోనూ అమితంగా కనిపిస్తుంది. ఆ ప్రభావమే.. ఎంత ప్రాశ్చాత్య ధోరణులను అనుసరించినా… సంప్రదాయ మూలాలను మర్చిపోని స్వచ్ఛమైన సంగీతాన్నందించేందుకు ఆయన దారిదీపమైంది. అలా ఓ మల్లయోధుడు కావల్సిన చౌరాసియా… వేణువాద్యకారుడిగా మనందరికే కాదు.. ఇవాళ ప్రపంచ సుప్రసిద్ధ పిల్లనగ్రోవి కళాకారుడిగా మన్ననలందుకుంటున్నాడు. ఆయన అల్లుడు రాకేష్ చౌరాసియా కుడా ఇప్పుడు మామ బాటలో నడుస్తున్నారు.



