మన రాంగోపాల్ వర్మ సునీల్ హీరోగా తీసిన ఓ సినిమాలో అంటాడు… ఎవడబ్బ సొత్తు కాదురా ట్యాలెంట్ అని… అక్షరాలా అది నిజమని నిరూపించి… ఖాన్లు, కపూర్ల కుటుంబాల డ్యామినేషతో నడుస్తున్న బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్న విలక్షణ నటుడు, హీరో రాజ్ కుమార్ రావ్. బాలీవుడ్ నెపోటిజం, ఫేవరేటిజాన్ని తట్టుకోలేక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి యువహీరోలు అసందర్భోచితంగా అస్తమించడం చూసిన మనకు.. వాటన్నింటినీ తట్టుకుంటూ, ఎదుర్కొంటూ ఎదిగిన రాజ్ కుమార్ రావు కూడా కనిపిస్తాడు. ఆగస్ట్ 31న ఈరోజు ఆయన బర్డ్ డే సందర్భంగా 41 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టిన రాజ్ కుమార్ రావ్ లాంటి ఓ సక్సెస్ ఫుల్ అండ్ వెర్సటైల్ నటుడి గురించి కూడా మనం కాస్త మాట్లాడుకుందాం. కైపోచే, బరేలీకి బర్ఫీ, షాదీ మే జూర్ వంటి వాణిజ్య సినిమాలతో పాటే… కొన్ని సినిమాల్లో రాజ్ కుమార్ రావ్ తన నటనతో విమర్శకులనే అబ్బురపరిచాడు.

గుర్గావ్ కు చెందిన రాజ్ కుమార్ రావు ముందుగా బోస్-డెడ్ ఆర్ అలైవ్ సీరియల్ నుంచి లైమ్ లైట్ లోకొచ్చి ఆ తర్వాత బాలీవుడ్ లో ఓవైపు ఖాన్లను, మరోవైపు కపూర్లను తట్టుకుని నిలబడ్డ యువనటుడు. రాజ్ కుమార్ రావు సినిమాల్లో లవ్ సెక్స్ అండ్ ఢోకా అనే సినిమా గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకోవాలి. అలాంటి ఓ సినిమా నుంచి అసలు రాజ్ కుమార్ రావ్ రంగప్రవేశం చేయడం కూడా ఓ సాహసమే. ఎందుకంటే అలాంటి ప్రయోగాత్మక సినిమాలను చాలామంది నటులు ఆదిలో ఎంచుకునేందుకు సిద్ధపడరు. కానీ రాజ్ కుమార్ రావు… ఓ అత్యాశపరుడిగా డబ్బు కోసం ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి ఆమెను సెక్యూరిటీ కెమెరాలతో బంధించి బ్లాక్ మెయిలింగ్ చేయాలని భావించి… ఆ తర్వాత అతని అత్యాశను మించి ఆ అమ్మాయితో చివరాఖరకు ప్రేమలో పడటం ఈ సినిమా కథ కాగా… మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు రాజ్ కుమార్ రావ్. ఆతర్వాత హన్సల్ మెహతా దర్శకత్వంలో నటించిన షాహీద్ కూడా రాజ్ కుమార్ రావ్ కెరీర్ ను మరింత నిర్మించుకునేలా చేసింది. నేషనల్ అవార్డ్ తో పాటు… ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద కూడా ఓ న్యాయవాదిగా, హక్కుల కార్యకర్తగా రాజ్ కుమార్ రావు పోషించిన పాత్రకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది షాహీద్. మళ్లీ అదే హన్సల్ మెహతాతో కలిసి రాజస్థాన్ నుంచి ముంబై వచ్చి… బతుకు కోసం బార్ డ్యాన్సర్ గా మారిన పాత్రలో వచ్చిన సిటీలైట్స్ కూడా రాజ్ కుమార్ రావ్ కెరీర్లో మరో హైలైట్ . ఈ సినిమాలో తన నిజజీవిత భాగస్వామి పట్రాలేఖతో కలిసి రాజ్ కుమార్ రావ్ స్క్రీన్ ను పంచుకోవడం విశేషం.
ఆతర్వాత వచ్చిన ట్రాప్డ్ సినిమాలో కాల్ సెంటర్ లో పనిచేసే వ్యక్తి క్యారెక్టర్ పోషించిన రాజ్ కుమార్ రావ్… ఓ అపార్ట్ మెంట్ లో మంచి ఫ్లాట్ తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకోవడం… ఆ క్రమంలో నిర్మాణం పూర్తికాని ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లి అందులో ఓ పూర్తైన ఫ్లాట్ తీసుకుని అందులోకి వెళ్లడం.. ఆ తర్వాత లీగల్ ఇష్యూస్ తో ఆ అపార్ట్ మెంట్ కు తాళం వేసి వెళ్లిపోవడంతో… అందులో కనీసం కరెంట్ లేక, ఆహారం, నీరు లేని పరిస్థితుల్లో… బయట ప్రపంచంతో సంబంధాలు కట్టైన పాత్రలో రాజ్ కుమార్ రావ్ యాక్షన్ సింప్లీ సూపర్బ్. ఆతర్వాత 2017లో వచ్చి న్యూటన్ సినిమా కూడా రాజ్ కుమార్ రావ్ కు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ కు కేరాఫైన ఓ మారుమూల పల్లె ప్రాంతానికి వెళ్లిన క్లర్క్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటన ఆసినిమాకు ప్రాణం పోసింది. గిరిజన తాండాల్లో ఇప్పటికీ ఎలక్షన్స్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చెప్పే ఒ సెటైరికల్ మూవీ న్యూటన్.
మరి బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వంశపారంపర్యంగా వస్తున్న మోనాటనీకి భిన్నంగా మెల్లిగా అడుగుపెట్టి… సవాళ్లను తట్టుకుని… ఇవాళ పలువురు హీరోలతో సరిసమానంగా వెర్సటైల్ మూవీస్ చేస్తూ నిలదొక్కుకున్నాడు. తన నటనతో విమర్శకులనూ మెప్పిస్తున్న రాజ్ కుమార్ రావ్ కు మనమూ హ్యాపీ బర్త్ డే విషెస్ తో పాటే… ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!


