ఊళ్లో నదిని కాపాడేందుకు నడుం బిగించిన భగీరథుడతను: సుందరం డైరీలో కొన్ని పేజీలు!

నదీతీరాల్లో, చెరువు గట్ల పొంట ఉండే ఊళ్లల్లో జీవించేవారి అనుభూతులు వేరు. బాల్యం నుంచీ ఆ సెలయేళ్లలో వారీదిన ఈత ముచ్చట్లు మధుర జ్ఞాపకాలు. అలాంటి తమ నది కాలుష్యమైపోతే ఎంతమంది సామాజిక స్పృహగా స్పందిస్తారో తెలీదుగానీ… ఒక్కడు మాత్రం స్పందించాడు. ప్రభుత్వాలనే కిందకు తీసుకొచ్చాడు. అంతకుమించి సామాజిక బాధ్యతను మర్చిన సమాజాన్నే మార్చేశాడు.

అలాంటి సైకిల్ డైరీనే… మనం చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్ వాసి, ప్రతాప్ గడ్ కు చెందిన పర్యావరణవేత్త 30 ఏళ్ల సుందరం తివారీది!

తన పేరంత సుందరంగా బాల్యమంతా ప్రతాప్ గడ్ లోనే గడిచింది సుందరంది. పెరిగి పెద్దయ్యేదాకా తన ఊళ్లోని సాయి నదిలోనే స్నేహితులతో కలిసి ఈత కొట్టేవాడు. పైచదువుల కోసం వలస వెళ్లి అవి కాస్తా పూర్తి చేసుకుని తిరిగొచ్చేసరికి ఊరు మారిపోయింది. నది మాయమైంది. చెట్లు కనిపించడంలేదు. ఒకనాడు ఉద్యానవనంలా కనిపించిన ఊరు కాంక్రీట్ జంగలైపోయింది. తన బాల్యమంతా ఆహ్లాదంగా గడిచేందుకు కారణమైన సాయి నది వ్యర్థాలతో అపరిశుభ్రంగా, అశుద్ధమైపోయి.. డ్రైనేజీ రూపాన్ని సంతరించుకుంది. నాడు సుతారంగా తడిమిన జ్ఞాపకాలు.. చేదు నిజాలై కళ్లకు కడుతున్నాయి. అలాంటి దృశ్యాలు సుందరం తివారీని కలిచివేశాయి.

చిన్నప్పుడు తాను మామిడి చెట్ల కింద ఉద్యనవనాల్లో గడిపిన స్మృతులు అలలు అలలుగా తనను తాకుతున్నాయి. 27 రకాల మామిడిపళ్లు తిన్న అలనాటి రుచులు యాదికొచ్చాయి. మధ్యాహ్నాలు ఆ చెట్లందించిన చల్లటినీడ.. పీల్చిన ఆ స్వచ్ఛమైన గాలీ తనను ఓ జ్ఞాపకంగా తాకుతుందే తప్ప… ప్రస్తుత భౌతిక ప్రపంచం అందుకు పూర్తిగా దూరమైపోయింది.

సుందరం తివారీ జీవితంలో సైకిల్ డైరీకీ ఓ ప్రాధాన్యత!

తన ఊళ్లోనే ఇలా ఉంటే ఈ స్థాయిలో పట్టణాలు, దేశం ఏమైపోతోందన్న ఒక ఆవేదన వెంటాడింది తివారీని. దాంతో 2022 ఏప్రిల్ లో సుందరం పర్యావరణ పరిరక్షణపై ప్రచారానికి నడుం బిగించాడు. అందుకు సైకిల్ యాత్రనెంచుకున్నాడు. అలా, సుందరం సైకిల్ డైరీస్.. సమాజాన్నీ, ప్రభుత్వాల్నీ కదిలించే .. ఓ జైత్రయాత్రగా మారింది.

దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన సుందరం.. ఉత్తరప్రదేశ్ లోని తన ఊరు ప్రతాప్ గఢ్ నుంచి ప్రారంభమయ్యాడు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్, లడాఖ్, గుజరాత్ తో పాటు.. తెలంగాణాలోని పలు గ్రామాల్లోనూ పర్యటించాడు.

తను సైకిల్ ఎక్కినప్పుడు రూట్ మ్యాపేం లేదు. ఓ ప్రణాళికా రచించుకోలేదు. తన తపనంతా వీలైనంత ఎక్కువ మందిని కలుసుకోవడం, చెట్ల పెంపకం, నదులు, చెరువులు, నీటి వనరులను కలుషితం చేయడం వల్ల భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే సమస్యలను ఆయా సమాజాలకు అర్థమయ్యేలా వివరించడం మాత్రమే. అలా రోజుకో మూడు, నాల్గు చోట్ల తన సమావేశాలేర్పాటు చేసుకుని తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అలా, పది లక్షల మందితో తన సైకిల్ యాత్రతో మమేకమయ్యాడు. తాను జనంలోకి లోతుగా వెళ్లేందుకు.. వెళ్లినవాటిని మరో నల్గురికి చెప్పడానికి సోషల్ మీడియానూ బలంగా ఉపయోగించుకున్నాడు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, రచ్చబండలు ఇలా కనిపించిన ప్రతీ వేదికా.. తివారీదే. ఆ క్రమంలో తనకు స్థానిక సమాజాల నుంచి మంచి మద్దతు లభించడంతో పాటు… సుందరంకు చెట్లు నాటాలని చాలామంది విరాళాలివ్వడం కూడా మొదలైంది. వారే ఆశ్రయమిచ్చి ఛాయ్, టిఫిన్స్, భోజనాలు అందించేవారు. అది కాస్తా సుందరం యాత్రకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.

తన ప్రయాణంలో లఖీంపూర్ ఘటన సుందరాన్ని కదిలించింది. అక్కడ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే క్రమంలో ఓ రిక్షా డ్రైవర్ సుందరం వద్దకు వెళ్లి 500 రూపాయలిచ్చాడు. ఆ రోజు ఆ రిక్షావాలా కొడుకు పుట్టినరోజు. ఆ డబ్బు చిన్నమొత్తమే అయినా.. ఎన్ని మొక్కలు వస్తే అన్ని నాటండంటూ ఆ రిక్షావాలా చూపిన చొరవ.. సుందరాన్ని కదలించింది. అది అతడి ఒకరోజు సంపాదనే అయి ఉండొచ్చు.. అయినా, సమాజం పట్ల ఆ రిక్షావాలాకున్న ఒక బాధ్యత నన్ను నా యాత్రకు మరింత పురిగొల్పిందంటాడు సుందరం.

సుందరం తనకు వచ్చే విరాళాలన్నీ పాఠశాలలు, కళాశాలల్లో చెట్లు నాటడానికే వినియోగించాడు. ఓ ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసినప్పుడు అక్కడి మేనేజర్ కూడా తివారీ కథ విని వచ్చి… ఏకంగా పదకొండు వందల రూపాయలు మొక్కలు నాటడం కోసం విరాళమిచ్చాడు.

అయితే, కొన్ని సవాళ్లూ తన ప్రయాణంలో ఎదుర్కోకతప్పలేదు. దొంగతనాలు చేసేవాళ్లకేం తెలుసు..? తివారీ ఎంత గొప్ప పని చేస్తున్నాడో! అయినా, దొంగలకు మంచీ, చెడు ఆలోచించి దొంగతనాలు చేస్తారా, ఏంటీ..? అందుకే, పంజాబ్ లో తివారీ పర్సు, మోబైల్ ఎత్తుకెళ్లారు దొంగలు. అడ్డుకునే క్రమంలో తనపై దాడి చేశారు. దాంతో కొన్నాళ్లు ఆసుపత్రిలోనే గడిపాడు తివారీ. కానీ, పెట్టు వీడలేదు. కోలుకున్నాక మళ్ళీ మొదలైంది తివారీ యాత్ర. రోజూ పలు సమావేశాల్లో పాల్గొనడం.. సైకిల్ పై సుదీర్క్షంగా తిరుగుతుండటంతో అప్పుడప్పుడూ ఒత్తిడినీ ఎదుర్కొన్నాడు. అయితే, తన ఒక్కడి లక్ష్యమైతే చేయడం, చేయకపోవడం తన చేతుల్లో ఉంటుంది. కానీ, సమష్ఠి బాధ్యతను తీసుకున్నప్పుడు సమాజాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. అందుకు కష్టమూ తప్పదని మళ్లీ తనను తానే భుజం తట్టుకునేవాడు. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ తో.. సమాజానికి హెల్ప్ కావాలన్న సంకల్పం తనలో కనిపించేది.

సేవ్ సాయి రివర్!

చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం అంతకుముందు సైకిల్ యాత్ర చేపట్టిన సుందరం… ఇక నీటి వనరులపై దృష్టి సారించాడు. ముందుగా తన ఊరు ప్రతాప్ గడ్ లో తన చిన్ననాట ఏడాది పొడవునా గలగలా పారే నది.. ఇప్పుడో మురికి కూపాన్ని తలపిస్తుండటం సుందరం మనసును చిందరవందర చేసింది. పూర్తిగా ఎండిపోయి, ఎక్కడ చూసినా ఆక్రమణలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన తన నదికి పునర్వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు ఈసారి తన నదీ తీరం వెంట 715 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు.

#SaveSaiRiver అనే హ్యాష్ ట్యాగ్ మూమెంట్ తో పాదయాత్ర చేపట్టిన సుందరం.. ఆ నది ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ అన్ని గ్రామాలనూ చుట్టివచ్చాడు. పోయిన ప్రతీచోటా నీటి వనరుల ఉపయోగం, వాటి సంరక్షణ, పెరిగే కాలుష్యంతో భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలు, అందుకు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర ఫోటోలు, పనికిరాని బట్టలు, ఫుడ్ వేస్టేజ్ వంటివి నీటిలో కలిపితే జరిగే పరిణామాలు ఇలా అన్నీ పూసగుచ్చినట్టు వివరించేవాడు. సుందరానికి తన ఫ్రెండ్స్ కూడా జట్టు కలిశారు. అంతా కలిసి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించడంతో పాటు.. నదుల చారిత్రక నేపథ్యం, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యతలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు.

సుందరం చేస్తున్న కార్యక్రమాలు అప్పటివరకూ పెద్దగా పట్టించుకోని మీడియా కూడా ఆ తర్వాత ఫోకస్ చేసింది. సుందరం నదీ ప్రక్షాళన ఓ సామాజిక ఉద్యమమైంది. మీడియాలోనూ విస్తృతమైన కవరేజీ సంపాదించుకుంది. దాంతో ప్రభుత్వాలూ కదిలాయి. అప్పటి జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి.. సాయి నదిని పునరుద్ధరిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. వెంటనే ప్రభుత్వం అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

మరో సుందర్ లాల్ బహుగుణలా.. సుందరం తివారీ!

ఆవో నదియోంకో జానే అనే క్యాప్షన్ తో జీవనదుల పరిరక్షణకై నదులను తెలుసుకుందాం రండంటూ మరో ఉద్యమాన్ని ప్రారంభించాడు సుందరం. ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేస్తూ సెమినార్లు నిర్వహిస్తూ, ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా అవగాహన కల్పించే పనికి శ్రీకారం చుట్టాడు. స్కూల్స్, కళాశాలల్లో విద్యార్థులకు పర్యావరణాన్ని ఎందుకు కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవచ్చనే అంశాలపై వారిలో పరివర్తన తీసుకొచ్చే ప్రసంగాలతో ముందుకెళ్లాడు.

నదులను కాపాడుకోవడంతో పాటు… మరో పెద్ద ఉద్యమంలోనూ సుందరం తివారీ కీలకపాత్రధారి. సంకల్ప్ సవా లాఖ్… పేరిట బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా లక్షా 25 వేల మొక్కలను నాటిన ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. మొక్కలను నాటేవరకే పరిమితం కాలేదు. తాను వాటిని సంరక్షించే ట్రాకింగ్ సిస్టమ్ నూ అభివృద్ధి చేశాడు. ఎవరైతే ఒక మొక్క నాటుతారో వారే అది పెరిగి పెద్దయ్యే వరకూ సంరక్షించడాన్ని ఓ సామాజిక బాధ్యతగా చైతన్యపర్చాడు. అలాగే ప్రతీ కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తైనా ఒక మొక్క నాటాలనే ఒక కండిషన్డ్ రెస్పాన్సిబిలిటీని తీసుకునే విధంగా తన ఊరు ప్రతాప్ గఢ్ లో ఇంటింటా స్ఫూర్తి నింపాడు. పచ్చదనం కోసం సుందరం తివారీ నెట్ వర్క్ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది.

ప్రతికూలతలను ఎదుర్కొంటూనే భవిష్యత్ పై ఆశతో పయనం!

సుందరం తివారీతో ఇన్స్పైరైన అభిషేక్ ద్వివేది ఏమంటారంటే.. సాయి నదిని పునరుద్ధరించడానికి సుందరం చేసిన ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా చూసి తెలుసుకుని ఆయన్ను సంప్రదించాను. మాదీ ప్రతాప్ గఢ్ కాబట్టి నాకూ ఆయన మోటో నచ్చింది. ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులన్నింటిలోనూ కలిసి పనిచేస్తున్నాను. నావంతు సామాజిక బాధ్యతనూ సుందరంతో కలిసి నిర్వర్తిస్తున్నానంటాడతను.

సుందరం బాటలో గుబాళించిన విజయాలతో పాటే, గుచ్చుకున్న ముళ్లు!

సుందరం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నవారూ కొల్లలు. తనతో విభేదించి వ్యక్తిగత బెదిరింపులకూ దిగారు. నది పరిరక్షణ పేరిట అనవసర వృథా ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా భూకబ్జాదారులు, దురాక్రమణదారుల నుంచి ఈ బెదిరింపులు సుందరంకు తప్పలేదు.

అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులంతా హాయిగా ఉద్యోగం చేసుకోక ఈ తిప్పలెందుకని నచ్చజెప్పే యత్నం చేశారు. బుజ్జగించారు. ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవాడివి మంచి ఉద్యోగం చేసుకోక ఎందుకని బతిమాలారు. కానీ, ఏ ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాని ఓ సంతృప్తి మురికికూపంలా మారిన నదికి మళ్లీ పునర్వైభవం తెచ్చినప్పుడు కనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్స్ గా మారిన ఊళ్లు మళ్లీ పచ్చదనం పర్చుకుంటే లభిస్తుందని నమ్మాడు.అందుకే, తానెక్కడా తగ్గేదిలేదన్నటే ముందుకెళ్లాడు సుందరం.

సాయినదితో పాటు, ఇతర నదుల పరిరక్షణ అనేది ఏ ఒక్క రోజులోనో అయ్యే పనేం కాదు. కానీ, మిషన్ మాత్రం ఆపేది లేదు. దేశమంతటా తాను విస్తరించి.. నదుల పునరుద్ధరణకై నడుం బిగిస్తానంటున్నాడు ఈ పర్యావరణ ఉద్యమకారుడు సుందరం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles