RAW ఏజెంట్స్ గా గూఢచారుల సినిమాలకు మార్కెట్ లో ఎప్పుడూ మంచి గీరాకీనే. తాజాగా దురంధర్ సీక్వెల్ తో అది మరోసారీ నిరూపితమైంది. కానీ, సినిమాల్లో చూపించిన విధంగా అసలు రా ఏజెంట్స్ రిక్రూట్మెంట్, పని ఉంటుందా… నిజానికి దగ్గరగా సినిమాల్లో చూపిస్తారా..?
గూఢచారి అంటే స్టైలిష్ గా ఉండటం కానే కాదు.. సైకలాజికల్ గా ఫిట్ ఉండటం, అన్ ప్రిడక్టేబుల్ గా వ్యవహరించగల్గడం, సందర్భాన్ని బట్టి స్పందిచగల్గే టైమింగ్.. ఇలా ఎన్నో రా ఏజెంట్స్ కు అవసరమైన లక్షణాలు.

RAW అంటే ఏమిటి..?
రా ఏజెంట్స్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న సమయంలో అసలు రా ఎలా పనిచేస్తుంది.. ? అక్కడెలా చేరుతారు..?
RAW అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. భారత ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో నడిచే ప్రధాన విదేశీ గూఢచార సంస్థ. విదేశీ సమాచారం సేకరణ.. ముప్పుంటే గుర్తించడం.. ప్రత్యర్థి, శత్రుదేశాల వ్యూహాత్మక సమాచారంతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుని సన్నద్ధమవ్వడం, దేశభద్రతను కాపాడేలా జియోపొల్టికల్ ఇష్యూస్ ను గమనించడం వంటివి ప్రధానంగా ఈ వింగ్ చూస్తుంది.
సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం నుంచి.. ప్రపంచ శక్తులు, కుయుక్తుల కదలికలను విశ్లేషించడం వరకు రా ఏజెంట్లది కీలక పాత్ర. అదే సమయంలో అంతే రహస్య పాత్ర. చాలామంది ఏజెంట్స్ పైన సాధారణ పౌరుల్లా కనిపిస్తూనే దేశానికి మరోవైపు సేవ చేసేవారుంటారు.
RAWలో మరి ఉద్యోగాలెలా సంపాదించడం..?
ఇతర ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇచ్చినట్టుగా RAW ఉద్యోగ ప్రకటనలివ్వదు. నోటిఫికేషన్స్, అప్లికేషన్స్ ఇవేమీ ఉండవు. RAW ఏజెంట్ల ఎంపికే చాలా గోప్యంగా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే RAWను మనం వెతకలేం. RAW ఎవ్వరినైనా వెతుకగల్గుతుంది.
RAWలో చేరడానికి మరి అర్హతలేంటి..?
RAWలో చేరడానికి మార్గమంటూ ఏముండదు.. కానీ, కొన్ని అర్హతలు మాత్రం ఇలా ఉంటాయి.
భారతీయ పౌరుడై ఉండాలి.
20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.
కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
అంతర్జాతీయ సంబంధాలు, పొల్టికల్ సైన్స్, లా, ఇంజనీరింగ్, విదేశీ భాషలు రావడం ఉపయోగపడతాయి.
మంచి ఆరోగ్యంతో పాటు, మానసిక స్థిరత్వం కూడా పరిశీలిస్తారు.
ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు.
అరబిక్, రష్యన్, చైనీస్ వంటి విదేశీభాషలు తెలిసి ఉంటే మంచి అవకాశాలుంటాయి.
విశ్లేషణా సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం అవసరం.
ఇటీవల ఈ రంగంలో RAW ఏజెంట్స్ గా మహిళలను కూడా ప్రోత్సహిస్తున్నారు.
RAWకు మనం అప్లై చేయడముండదు. వారే మనల్ని గుర్తిస్తే దక్కే జాబ్ అది. 2025లో గౌరవ్ ఠాకూర్ క్లిప్స్ ఇంటర్వ్యూలో మాజీ గూఢచారి లక్కీ బిష్ట్ ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆయన మాటల్లో అవేంటంటే…
నేను RAW ఏజెంట్ గా ఎంపికవుతానని నాకు కూడా తెలియదు. సాధారణంగా కనిపించే ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలోనే నన్ను RAW రిక్రూట్మెంట్ టీమ్ గమనించింది. ఇంటర్వ్యూ అంటే వాళ్ల ఉచ్చులో పడ్డట్టే. ఒక గదిలో ఉంచి రెండు గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు.
ఆ ప్రశ్నలెలా ఉంటాయంటే…
మీకు కోపం వస్తుందా..?
చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా.. సాధారణ అమ్మాయినా..?
ఎవరైనా మీ భార్య చేతి పట్టుకుంటే ఏం చేస్తారు..?
మీకు చపాతీ ఇష్టమా, అన్నమా..?
ఇలా అడిగే ప్రశ్నలన్నీ సాధారణంగానే పైకి కనిపించినా.. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని, జీవన విధానాన్ని పరీక్షించేందుకు వేసే ప్రశ్నలు.
ఒకవేళ మీకు కోపం రాదని చెబితే.. వెంటనే మీకు కోపం వచ్చే ప్రశ్న వేసి అక్కడికక్కడే మీకు కోపం ఎలా వస్తుందో నిరూపిస్తారు. మీ సమాధానాల్లో నిజాయితీ లేకపోయినా.. చిన్న తేడా కనిపించినా గుర్తిస్తారు. అసలు మీరెవరు అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ఆ ఇంటర్వ్యూ కొనసాగుతుంది.
RAW ఏజెంట్స్ కు కావల్సిన ముఖ్యమైన నైపణ్యాలు!
ఎక్కడి తీరు అక్కడ మెసులుకోవడం.
బిజినెస్ మ్యాన్ తో మాట్లాడగల్గాలి.
ఆటో డ్రైవర్ తో కలిసిపోవాలి.
ప్రధానితో కూడా మాట్లాడగల్గాలి.
కూలీతో కూడా సులభంగా కలిసిపోవాలి.
RAW ఏజెంట్ అంటే జస్ట్ నటన కాదు.. పూర్తిగా ఆ పాత్రలో జీవించడం. ఐడెంటిటీని మార్చడంలో కూడా లైట్ స్విచ్ ఆన్ చేసినంత సులభంగా చేయగల్గాలి.
RAW ఎప్పుడూ బలమైన వాళ్లను కోరుకోదు. నిజాయితీపరులకే ఓటేస్తుందంటాడు లక్కీ బిష్ట్. ఎందుకంటే, ఏజెంట్ నిజాయితీపరుడు కాకపోతే.. ఎప్పుడైనా దేశానికి వ్యతిరేకంగా మారవచ్చు.
ప్రాధాన్యత క్రమంలో చూస్తే RAW ఏజెంట్స్ కు నిజాయితీ, తెలివి, ధైర్యం ఇవి మూడు ముఖ్యం. శిక్షణతో ధైర్యాన్ని పెంపొందించవచ్చునేమోగానీ.. స్వభావాన్ని మార్చడం కష్టం.
RAW లో చేరాలంటే ఎలా మరి..?
సాధారణంగా RAW ఏజెంట్స్ ఈ విభాగాల నుంచే ఎంపికవుతారు.
భారతసైన్యం
పారామిలటరీ ఫోర్సెస్
మిలటరీ ఇంటలిజెన్స్
ఇంటలిజెన్స్ బ్యూరో
వీరితో పాటు, సివిల్ సర్వెంట్స్ కూడా డిప్యుటేషన్ పద్ధతిలో చేరొచ్చు. మాజీ RAW చీఫ్ విక్రమ్ సూద్ అందుకో ఉదాహరణ.
వందల ప్రశ్నల ఇంటర్వ్యూ!
ఒక ఇంటర్వ్యూలో వందల ప్రశ్నలడుగుతారు. ఎందుకంటే మీ జ్ఞానాన్ని పరీక్షించేందుకు కాదు.. మీ వ్యక్తిత్వాన్ని బయటకు తీయడానికి. గూఢచర్య వ్యవస్థలో వైఫల్యాన్ని పెద్ద ప్రమాదంగా భావించరు.. చంచలమైన, విశ్వసనీయత లేని వ్యక్తిత్వాన్నే ప్రమాదంగా భావిస్తారు.
నిజమైన గూఢచారి జీవితమంటే సిల్వర్ స్క్రీన్స్ పైన డిష్యుం డిష్యుం అంటూ మెరవడం కానే కాదు.. ఆ గ్లామర్ కు పూర్తి దూరంగా.. ప్రశ్నలు, పరిశీలన, నిశ్శబ్దం, నమ్మకం వంటి అంశాలతో పాటు.. రహస్యాన్ని మెయింటైన్ చేయడమే ఓ గూఢచారి ఉద్యోగంలో కీలకం.



