పాజిటివో, నెగటివో… దురంధర్ ఇప్పుడు ట్రెండింగ్ సినిమా. బడాస్క్రీన్ పై ఓ వీడియోగేమ్ తరహా సృష్టి. అందులోనూ, ఓ గూఢచారి సినిమా. ఇలాంటి స్పై థ్రిల్లర్స్ పై చర్చ జరుగుతున్న రోజుల్లో మనమోసారి కాస్త వెనక్కి వెళ్లి ఓ నిజమైన గూఢచారి గురించి గుర్తు చేసుకోవాలి. ఆయన మహత్తర త్యాగాన్ని తల్చుకోవాలి. దేశసేవ కోసం ఏళ్లకేళ్లు దాయాది శత్రుదేశంలో జీవితాన్ని ధారబోసి చివరకు అక్కడే అంతమైపోయిన విషాదాంతం గురించి చెప్పుకోవాలి.
రవీంద్ర కౌశిక్.. ఇదిగో ఇతనే మనం చెప్పుకోవాల్సిన నిజమైన దురంధర్.
1952 ఏప్రిల్ 11న రాజస్థాన్ శ్రీగంగానగర్ లో పాక్ రహస్యాలను భారత్ కు చేరవేసే రవీంద్ర కౌశిక్ గూఢచారి జననం జరిగింది. ఇండియా పాక్ సరిహద్దుల్లో పెరగడం.. పంజాబీ, రాజస్థానీ భాషల్లో ప్రావీణ్యముండటంతో పాటు రవీంద్ర మంచి కళాకారుడు. తన కళే తనను రా రహస్య ఏజెంట్ ను చేసింది. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన రవీంద్ర కౌశిక్ ను నేషనల్ లెవల్ కాంప్టీషన్స్ లో చూసిన RAW అధికారులకు తాము వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టైంది. అధికారుల ఒత్తిడి, దేశసేవ అనే రెండు రవీంద్ర మీద పనిచేశాయి. ఇంకేం రవీంద్ర కొత్త జీవితం RAW ఏజెంట్ గా ఆరంభమైంది.

అప్పటివరకూ జీవితం వేరు.. ఇక RAWతో బంధం ఏర్పడ్డాక బతుకుచిత్రం వేరు. కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. కొత్త గుర్తింపుతో దేశం కాని దాయాది దేశంలో జీవించడానికి ధైర్యంగా సిద్ధపడ్డాడు. 1975లో అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా కేవలం 23 ఏళ్ల వయస్సులోనే నబీ అహ్మద్ షాకీర్ గా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టాడు. పాకిస్థానే ఇక తన స్థిర నివాసమైపోయింది. కరాచీ యూనివర్సిటీలో లా పూర్తి చేసి, అక్కడ ఆర్మీలో మేజర్ స్థాయికెదిగడం రవీంద్ర అండర్ కవర్ స్పై ఏజెంట్ గా సాధించిన గొప్ప విజయం. అక్కడి సైనికుల కదలికలు, వ్యూహాత్మక యుద్ధ కేంద్రాలు, ఆయుధ సంపత్తి, వారి ఆలోచనలు ఇలా అన్నీ తన జన్మభూమి భారత్ కు సమాచారమందించేవాడు.
1979-83 మధ్య కాలంలో పాక్ సైనిక కదలికలతో పాటు.. కహూటా ప్రాంతంలో వారి వ్యూహాత్మక వైఖరి గురించి భారత్ కు రహస్య సమాచారాన్నందించాడు. రవీంద్ర సేవలను గుర్తించిన నాటి ప్రధాని ఇందిరా.. ఆయన్ను బ్లాక్ టైగర్ అనే కోడ్ నేమ్ తో సంబోధించేది.
1983లో ఒక జూనియర్ ఆపరేటివ్ పట్టుబడటంతో రవీంద్ర కౌశిక్ గూఢచర్యం బట్టబయలైపోయింది. పాక్ ఐఎస్ఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. తీవ్రంగా హింసించిందని కూడా చెబుతుంటారు. ముందు మరణ దండన విధించింది. ఆ తర్వాత ఆ శిక్షను జీవితఖైదుగా మార్చింది. దాంతో సుమారు 20 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు రవీంద్ర కౌశిక్.
జైలు నుంచి తాను ఇంటికి రాసిన లేఖల్లో.. ఇక తాను మర్చిపోయిన వ్యక్తినేనంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఆ కుటుంబీకులను కంట తడి పెట్టించింది. చివరకు 2001, నవంబర్ 21వ తేదీన మియాన్వాలి జైలులో అనారోగ్యం కారణంగా.. పాక్ జైలు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రవీంద్ర అనే గూఢచారి అసువులు బాసాడు. అతడిని ఎక్కడి పూడ్చిపెట్టారు.. ఎక్కడ సమాధి చేశారో కూడా ఆ తర్వాత తెలియరాలేదు.
రవీంద్ర కౌశిక్ వంటి గూఢచారి కథ వింటే పలు ప్రశ్నలు పుట్టుకొస్తాయి. దేశం కోసం జీవితాన్నే సర్వం త్యాగం చేస్తే రవీంద్రకు దక్కిందేంటి..? స్పై ఏజెంట్స్ ను తమవాడని చెప్పుకునే ధైర్యం లేనప్పుడు, నిబంధనలు అడ్డుపడ్డప్పుడు, అంతర్జాతీయ సమాజం ముందు అది ఇబ్బంది అవుతుందనుకున్నప్పుడు.. అలాంటివారి ప్రాణాలను త్యాగం చేయమనే హక్కు ప్రభుత్వాలకు ఎక్కడిది..? ఏళ్లకేళ్లు అయినవాళ్లందరినీ వదిలివెళ్లి, దాయాది శత్రుదేశంలో భిక్కుభిక్కుమంటూ స్థిర నివాసమేర్పర్చుకుని, కీలక సమాచారం అందించినందుకు చివరకు విషాదాంతమైన ముగింపు తప్ప.. ఇంకో సమాధానమేదీ కనిపించదు. అందుకు రవీంద్ర కౌశిక్ లైఫ్ స్టోరీనే ఓ ఉదాహరణ.
అందుకే మరోసారి, నిజమైన దురంధర్.. రవీంద్రుడి మననం!



