సినిమాల్లోనే డిష్యుం డిష్యుం.. నిజజీవితంలో మాత్రం వారిద్దరిదీ మంచి స్నేహం!
ఎత్తుకు పరాకాష్ఠలా కనిపించే హీరో అమితాబ్ కు షోలే సమయంలో విలన్ అమ్జాద్ ఖాన్ పెట్టుకున్న గమ్మత్తైన పొట్టి పేరేంటో తెలుసా..? షార్టీ అంట! ఈ విషయాల్ని కొన్నిసార్లు అమితాబే అమ్జాద్ తో తనకున్న బంధమెలాంటిదో వివరిస్తూ తన ఇంటర్వ్యూల్లో ప్రస్తావించేవారు. జో డర్ గయా.. సమ్ఝో మర్గయా … కిత్నే ఆద్మీ థే… తేరా క్యా హోగయా కాలియా వంటి భిన్నమైన డైలాగ్ డెలివరీతో విలనిజాన్ని చంబల్ లోయలోని పర్వతాలెత్తులో నిలబెట్టినవాడు అమ్జాద్. అందుకే, మిగిలినెందరు ఆర్టిస్టులున్నాషోలే అంటే అమ్జాద్.. అమ్జాదంటే షోలే అనేట్టు సినిమా ఆసాంతం డామినేట్ చేసిన ఆ విలన్ కీ.. అదే సినిమాతో భవిష్యత్ భారత హీరోగా రాణించిన అమితాబ్ కీ మధ్య స్నేహబంధమూ.. ఆ సినిమా అంత అజరామరమైందే. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకుని వెళ్లిపోయి 29 ఏళ్లైన ఆ విలన్ కీ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కు మధ్య ఏర్పడిన ఆత్మీయ స్నేహబంధమే ఈ ముచ్చట.

అది 1979వ సంవత్సరం. ది గ్రేట్ గ్యాంబ్లర్ షూటింగ్ గోవాలో నడుస్తోంది. అమ్జాద్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబై నుంచి గోవాకు కారులో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొత్తం కుటుంబమంతా స్పృహలో లేకుండా పోయారు. అమ్జాద్ ఖాన్ పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆయన భార్యా, ఇద్దరు పిల్లల్ని పాంజిమ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అమితాబ్ గ్యాంబ్లర్ షూటింగ్ కోసం గోవా చేరుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి పరిగెత్తాడు. అప్పటికే తీవ్రగాయాలతో బాధపడుతున్న అమ్జాద్ ఫ్యామిలీ మెంబర్స్ ని ముంబైకి తరలించే ప్రక్రియ మొదలైంది. మరోవైపు అమ్జాద్ ఖాన్ చాలా కష్టంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ముంబైకి తరలించే అవకాశం లేదు. సర్జరీ తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. కానీ అమ్జాద్ కు శస్త్రచికిత్స కోసం ఆసుపత్రి ఫార్మాల్టీస్ ఫిల్ చేయడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు బిగ్ బీనే షోలేలో తన పాలిట విలనైన అమ్జాద్ ఆపరేషన్ ఫార్మాల్టీస్ పూర్తి చేసి.. అమ్జాద్ ఖాన్ పునర్జన్మకు కారణమైన హీరో అయ్యాడు. అంతేకాదు అమ్జాద్ ని ముంబై తరలించేందుకు వెంటనే ఛార్టెడ్ ఫ్లైట్ నీ అరేంజ్ చేశాడు. అలా అమితాబ్, అమ్జాద్ అనే షోలేలోని హీరో, విలన్ల మైత్రీ బంధం బలపడింది.
అమ్జాద్ కోలుకున్న తర్వాత తనకు కృతజ్ఞతగా పలు ఉత్తరాలు రాశాడని.. ఇప్పటికీ అవి తన దగ్గర భద్రంగా ఉన్నాయన్న విషయాల్నీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు బిగ్ బీ. కూలీ సినిమా సెట్స్ లో ఓ ఫైటర్ కూ, హీరో అమితాబ్ కూ మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ లో అమితాబ్ తీవ్రంగా గాయపడి.. ఆర్నెల్లపాటు షూటింగ్ కు కూడా రాకపోవడంతో కూలీ సినిమా ప్రొడక్షన్ వర్క్ దగ్గరే ఆగిపోయిన విషయమూ అందరికీ తెలిసిందే. అలా ఆసుపత్రిలో బిగ్ బీ చికిత్స పొందుతున్న సమయంలో.. రెగ్యులర్ గా అమితాబ్ దగ్గరికి అమ్జాద్ వెళ్లేవాడట. అలా వెళ్లి గడిపిన సమయంలో.. వారిద్దరూ తమ ఆసుపత్రుల ఎపిసోడ్స్ గురించే చర్చలు, సరదాగా జోక్స్ వంటివి వేసుకుంటూ సమయాన్ని ఇట్టే గడిపేసేవారమని బిగ్ బీ నోట పలు మార్లు వినేపించేది.
అయితే ది గ్రేట్ గ్యాంబ్లర్ సినిమాలో అమ్జాద్ ఖాన్ కు బదులు అప్పుడు ఉత్పల్ దత్ ని తీసుకోగా.. అమితాబ్, అమ్జాద్ కలిసి షోలేతో పాటు… ముఖద్దర్ కా సికందర్, యారానా, లావారీస్, సత్తే పే సత్తా, నసీబ్, కాలియా, గంగా కీ సౌగంధ్, మిస్టర్ నట్వర్ లాల్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. అందుకే సినిమాల్లో వారిద్దరూ హీరో, విలన్లైనా.. నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులై.. ఇప్పటికీ బిగ్ బీ జ్ఞాపకాల్లో అమ్జాద్ ప్రస్తావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.



