ఓ కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడి రూపమెత్తడం… విజయ్ ఆంటోని హీరోగా తమిళ దర్శకుడు శశి రూపొందించిన చిత్రంలో చూశాం. కానీ, ఓ బిచ్చగాడు కోటీశ్వరుడిగా అవతరించిన రియల్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఓసారి ముంబై వెళ్లాల్సిందే మరి!
పేరుకే భిక్షగాడు.. కానీ, అతడి ఇళ్లు చూస్తే ఒకింత సంపన్నులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి భిక్షగాళ్ల కథలెన్నో ఉన్నా.. ఇదిగో కొందరే ఇలా భరత్ జైన్ లా ప్రచారంలోకొస్తున్నారు. భిక్షగాళ్లు ఓ మాఫియాలా మారి నగరాల్లో చేస్తున్న ఆగడాలు నిత్యకృత్యంగా చూసేవే. భిక్షగాళ్లంతా ధనవంతులనీ, అరాచకవాదులనీ జనరలైజ్ చేయడం ఎంత తప్పో.. ఏ పనీ దొరక్క, దొరికిన పని చేయలేని సోమరులు కూడా వివిధ రకాల వేషాలు కట్టి బిచ్చగాళ్లుగా రోడ్లపైకొస్తున్న దృశ్యాలు కొల్లలు.

అలాంటి బిచ్చగాళ్లల్లో ఇదిగో భరత్ జైన్ ఇప్పుడు టాప్ ఆఫ్ ద బాప్. ముంబైలో ఒక కోటి నలభై లక్షల రూపాయల విలువైన రెండు ప్లాట్లను కల్గి ఉన్న భరత్ జైన్.. థానే ప్రాంతంలోని ఓ వ్యాపార సముదాయాల్లో పెట్టుబడి కూడా పెట్టాడు. రెండు షాప్స్ ఈయన సొంతం కాగా.. ఆ దుకాణాలకు నెలకు 30 వేల రూపాయలు అద్దె రూపంలోనే లభిస్తోందంటే నమ్మగలరా..?
బిచ్చగాడంటే మన దృష్టిలో కనీస మౌలిక సదుపాయాల్లేనివారు.. జీవితాన్న కనాకష్టంగా ఈడ్చేవారు.. పగలనకా, రాత్రనకా ఎక్కడ పడితే అక్కడ అడుక్కుని తినేవారు.. కడు పేదరికంలో ఏ ఉపాధీ లభించక భిక్షమడుక్కుంటున్నవారు.. ఇవీ ఇప్పటివరకూ మనకున్న భావనలు. కానీ, బిచ్చగాళ్లు మారిపోయారు. మన భావనలిప్పుడు చాలామంది విషయంలో అపోహలు మాత్రమే. అందుకు నిలువెత్తు సాక్ష్యం ఈ భరత్ జైన్
భిక్షాటననే ఓ లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న భరత్ జైన్ వంటివారెందరో కనిపిస్తున్నారిప్పుడు. పోకిరి సినిమాలో బ్రహ్మానందం భిక్షమడిగితే వేయనందుకు.. బా బా బా బా అంటూ వెంటపడే బిచ్చగాళ్ల మాదిరి భిక్షకులు.. బ్లాక్ మెయిలర్స్ ఏ రోడ్డెక్కినా… ఓ గుడి ముందుకెళ్లినా తారసపడుతూనే ఉంటారు. అయితే, ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక అంచనా ప్రకారం మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా సంపన్న బిచ్చగాడిగా ఖ్యాతిగాంచడమే ఇప్పుడు ముంబైకి చెందిన భరత్ జైన్ ప్రత్యేకత.
సంపన్న బిచ్చగాళ్లపై ఓ నివేదిక ప్రకారం.. భరత్ జైన్ ప్రస్తుత వార్షిక ఆదాయం 60 వేల నుంచి 75 వేల మధ్య ఉందట. 7 కోట్ల 50 లక్షలతో.. ఉదయం లేస్తే సాయంత్రం వరకూ భిక్షాటన చేసే కోటీశ్వరుడు భరత్ జైన్. భరత్ జైన్ చదువుకోలేదు. ఇద్దరు కుమారులున్న భరత్ జైన్ పిల్లల్ని మాత్రం మంచి చదువులు చదివిపిస్తున్నాడు.
భరత్ జైన్ కుటుంబీకులు ఓ స్టేషనరీ షాప్ నడుపుతుంటే… పిల్లలు కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్నారు. పరేల్ లో నివాసముండే.. భరత్ జైన్ సంపద కోట్లలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్.. లేదా, ఆజాద్ మైదాన్ వంటి ప్రదేశాల్లో అడుక్కుంటూ తన భిక్షాటన వృత్తిని మానకపోవడం భరత్ జైన్ కు తన వృత్తి పట్ల కనిపించే నిబద్ధతకు నిదర్శనం.



