ప్రేమ ఓ మూలవస్తువు మాత్రమే!సంభాషణలు, సద్భావనల కలబోత సూఫీయుం సుజాతయుం!!

సూఫీయుం సుజాతయుం (మలయాళం సినిమా)

రమాసుందరి.. ✍️ సీనియర్ పాత్రికేయురాలు

ఈ సినిమా ఎంతమందికి నచ్చుతుందో తెలియదు. ఎందుకంటే Imdb రేటింగ్ ఈ సినిమాకు చాలా తక్కువ ఉంది. ఇండియన్ వ్యూయర్స్ అభిరుచిని నేను తక్కువగా అంచనా వేయలేను కానీ, బహుశా ఈ సినిమా కాన్సెప్ట్ చాలా తక్కువమందిని తాకిందనుకొంటాను. నన్నుమాత్రం గాఢంగా తాకింది.

ముస్లిం వ్యతిరేకి వి.ఎస్ నైపాల్ కు నోబెల్ సాహితీ పురస్కార అవార్డ్ ఇచ్చినపుడు గిరీష్ కర్నాడ్ అతని రచనల మీద తీవ్రంగా ధ్వజమెత్తాడు. హిందూ మతోన్మాద విజృంభణను భారతీయ సంస్కృతి పునరుద్ధానంగా అభివర్ణించిన వి.ఎస్.నైపాల్ అస్మదీయుల దీవెనలు పొందాడు. భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్రను ‘గాయపడిన నాగరికత’ (Wounded Civilization) గా అభివర్ణిస్తూ పుస్తకం రాసిన నైపాల్, బ్రిటిష్ వలస దోపిడీ ద్వారా భారతీయులు నాగరికత నేర్చుకున్నారని చెప్పడానికి వెనకాడలేదు.

‘హిందూ ఫ్యూడల్ రాజుల ధనరాశుల కోసం జరిగిన ఫ్యూడల్ మహమ్మదీయ దండయాత్రలు భారతీయ నాగరికతను అణచివేసినట్లయితే, సర్వరంగాల్లోనూ భారత ప్రజల మూలుగలు పిప్పిచేసిన వలస దోపిడీలో భారతీయ నాగరికత ఎలా పరిఢవిల్లిందో అంతుబట్టని విషయం’ అని వి. శేఖర్ అనే ఆయన తన బ్లాగ్ లో నైపాల్ విశ్లేషణను విమర్శిస్తూ రాశాడు.

వి.ఎస్ నైపాల్ కు అవార్డు రావటం గురించి ప్రశ్నిస్తూ గిరీష్ కర్నాడ్ భారతీయ సంస్కృతి నాశనం చేశారని ముస్లిములను నిందించిన నైపాల్ భారతీయ సంగీతం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు. ‘’మీరు సంగీతాన్ని అర్ధం చేసుకోనట్లయితే, మీరు సంగీతానికి స్పందించనట్లయితే, మీరు భారతీయ చరిత్రకు స్పందించలేరు. ఎందుకంటే భారతీయ సంస్కృతి యొక్క నిజమైన అభివృద్ధి సంగీతం ద్వారానే సాధ్యం అయింది. ప్రతి భారతీయ గృహం యొక్క హృదయంలోనూ సజీవంగా ఉన్న ఇంతటి అసామాన్యమైన వారసత్వాన్ని భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అందించాయి. ఆ ఉద్యమాల ద్వారా హిందూ మరియు ముస్లిం సృజనాత్మకతలు పరస్పరం చిక్కుముడిగా అల్లుకుపోయిన వాస్తవం పట్ల ఆయనకి (నైపాల్ కి) గల జడాత్మకతను ఇది వివరిస్తుంది’ అన్నాడాయన.

ఈ విషయానికి ఈ సినిమాకు సంబంధం ఉంది కాబట్టి ఇంత రాయాల్సి వచ్చింది. సూఫీ సంగీతాన్ని, సంస్కృతినీ, నాట్యాన్ని, ఆ భక్తిభావాన్ని, అది హిందువులను కూడా పట్టి అలరించిన సంగతిని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇది మామూలు ప్రేమ కథ కాదు. చాలా ఇంటెలిజెంట్ కాన్సెప్ట్.

ప్రేమను మూల వస్తువుగా చూపించారు కానీ -ఈ కథలోని ఇతర పాత్రల సంభాషణలు, కథాస్థలం, హిందూ ముస్లిముల మధ్య ఉన్న సద్భావనలు, సంస్కృతి కలబోతలనూ అద్భుతంగా చిత్రీకరించింది ఈ సినిమా.

గొంతులోని విరుపుతో, అరబిక్ ఉచ్చారణతో వచ్చే అజా పిలుపుతో మనోహరమైన ఉదయాలు మొదలైన అనుభవం ఉన్న పసి మనసులకి ఈ సినిమాలో అజా ప్రారంభం కాగానే సౌండ్ పెంచి వినాలనిపిస్తుంది. ఆ సంగీతం హృదయపు లోతుల్లోకి చొచ్చుకొని పోయి నీ బాల్యపు జ్నాపకాలను, అనుభూతులనూ రేపుతుంది.

సాయంకాలాలు రామాలయంలో పాడిన రామభజనలు, రోడ్డు మీద పరధ్యానంగా నడుస్తూ కూడా రోజుకు ఐదుసార్లు వింటూ పోయినా అజా పిలుపులు, ప్రియనేస్తం తియ్యని నోటి గుండా ‘నడిపించు నా నావ’ అనే పాత క్రైస్తవ గీతాన్ని నేర్చుకొన్న సమయాలు -అపూర్వమైన నీ బాల్యం మళ్లీ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది. సుజాత సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు -నిర్భయంగా తిరిగిన ఊర్లు, వీధులు, సందులు; రోజంతా ఇంటికి రాకపోయినా భయపడని, మందలించని తల్లిదండ్రులు మళ్లీ నీ దగ్గరకు వచ్చి జోలపాట పాడినట్లు అనిపిస్తుంది.

పిల్ల తండ్రి వచ్చి సూఫీ గురువుతో తన కూతుర్ని మతమార్పిడి చేయబోతున్నారు అనే మాటను ‘మీరు జిహాది చేస్తున్నారు’ అంటాడు. గురువుగారు ‘నాకు అర్ధమైయ్యే భాషలో చెప్పమని’ అడుగుతాడు. అజా పిలుపులో ఉన్న సంగీతానికి నాట్యం చేసే తన కూతురి మానసిక స్థితికి ‘జిహాది’ కారణం అనుకొనే తండ్రిని చూసి ఆయన జాలిపడతాడు.

ఆదితీరావు హైదారి అమాయకమైన ప్రేమ, దాన్ని దాచుకోవాలని కూడా తెలియని ఒపెన్ నెస్ లను బాగా నటించింది. భార్య ఇంకొకర్ని మనసులో మోస్తుందని తెలిసీ ఉక్రోషపడే భర్తగా జయసూర్య చాలా బాగా నటించాడు. సూఫీగా దేవ్ మోహన్ సరిగ్గా సరిపోయాడు. యవ్వనం తాలూకు ఆశలు, ఎంచుకొన్న మార్గంలో ఉండాల్సిన చపలత్వం లేని స్థిరత్వం- వీటి మధ్య ఘర్షణ ఇతని ద్వారా బాగా రాబట్టుకొన్నాడు డైరెక్టర్ నారాణిపుళ షనావస్. ఎం. జయచంద్రన్ సంగీతం అద్భుతం. అక్కడక్కడ ఉర్దూ గజల్స్ కూడా వాడుకొన్నారు.

మలయాళం సినిమాల్లో ప్రకృతి సౌందర్యం కథలో ఎప్పుడూ ఒక పాత్రగా ఉంటుంది. ఆ పకృతి నుండి విడదీసి కథను చూస్తే మహా పేలవంగా అయిపోతుంది. లోతులేని ఏరులు దాటి, పచ్చని చెట్టూ చేమా దాటి చేసే కాలి ప్రయాణాలు ఈ సినిమా అయిపోయాక కూడా మనలో నిక్షిప్తం అయిపోయే అనుభూతులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles