మనం ఆదిత్యధర్ దర్శకత్వంలోని దురంధర్ వన్, టూ రెండు పార్టులూ చూసేశాంగా! అందులో వయోలెన్స్, తీసిన విధానంపై భిన్నాభిప్రాయాలున్నాయి. కాకపోతే ఒక విమర్శకుడిగా చూస్తే మాత్రం అదో ప్రాపగాండ సినిమాగానే భావించాల్సి ఉంటుంది. సరే ఆ అభిప్రాయాలన్ని కాస్సేపు పక్కనబెడితే.. సేమ్ టూ సేమ్ పాకిస్థాన్ లో దురంధర్ సినిమా వాస్తవ రూపం దాల్చింది.

గ్యాంగ్ స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడిపై దాడి జరగ్గా.. ఇప్పుడతడి పరిస్థితి విషమించింది.
పాకిస్థాన్ కరాచీలోని ల్యారీ ప్రాంతంపై ఆధిపత్యం కోసం మనం దురంధర్ లో చూసినట్టుగానే.. అక్కడి గ్యాంగ్స్ మధ్య ఆధిపత్యం నిజంగానే ఎలా ఉందో కళ్లకుగట్టే ఘటన ఒకటి పాక్ లో కలకలం రేపింది.
జూలై 30 గురువారం రోజు సాయంత్రం జరిగిన కాల్పుల్లో జుబైర్ బలోచ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్.. రద్దైన పీపుల్స్ అమన్ కమిటీ మాజీ చీఫ్ అయిన ఉజైర్ బలోచ్ సోదరుడే ఈ జుబైల్ బలోచ్.
ఉజైర్ బలోచ్ జీవితాన్ని ఆధారంగా చేసుకునే.. దురంధర్ లో డానిష్ పండోర్ పాత్రను క్రియేట్ చేశారు. 2025లో విడుదలై భిన్నాభిప్రాయాల మధ్య బ్లాక్ బస్టర్ గా నిల్చిన దురంధర్ వన్ తో పాటు… ఈ ఏడాది మార్చ్ లో విడుదలైన సెకండ్ పార్ట్ లోనూ ఆ పాత్ర కీలకం.
మరిప్పుడు ల్యారీలో ఏం జరిగింది..?
పాక్ స్థానిక మీడియా సంస్థైన డాన్ కథనం ప్రకారం.. 40 ఏళ్ల జుబైర్ బలోచ్ పైన చాకివారా మెయిర్ రోడ్డు వద్ద మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. అక్కడ్నుంచి వెళ్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆ కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడ్డ జుబైర్ తో పాటే.. మిగిలిన బాధితులనూ కరాచీ సివిల్ హాస్పిటల్ కు తరలించారు. జుబైర్ కు ఛాతీ, పొత్తి కడుపులో బుల్లెట్ల గాయాలవ్వడంతో.. అత్యవసర శస్త్రచికిత్స చేశారు. అయినా ఇప్పటికీ అతడి కండిషన్ సీరియస్ గానే ఉంది.
మరి పాక్ పోలీసులేమంటున్నారు..?
కరాచీ సౌత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సయ్యద్ అసద్ రజా చెప్పిన వివరాల ప్రకారం… జుబైర్ తన నివాసం సమీపంలోనే బయట కూర్చుని ఉండగా బైకుపై వచ్చిన దుండగులు జుబైర్ పై కాల్పులకు తెగబడ్డారు.
ఇది కచ్చితంగా వ్యక్తిగత కక్షలు, గ్యాంగ్స్ మధ్య నెలకొన్న వైరమే కారణమన్నట్టుగా ప్రచారం జరుగుతుండగా… పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జుబైర్ బలోచ్ ఎవరు..?
2012లో జుబైర్ బలోచ్ ను ఏడు క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2025 జనవరిలో అతడు విడుదలయ్యాడు. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీలో చేరిన జుబైర్ తన ఏరియాలో ఆ పార్టీ జెండాలను కూడా పెద్దఎత్తున ఏర్పాటు చేశాడు. కరాచీ ఆపరేషన్ తర్వాత దుబాయ్, ఇరాన్ కు పారిపోయిన కొందరు గ్యాంగ్ స్టర్స్ అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ల్యారీకి తిరిగి వచ్చారు. గతంలో మాదిరిగానే గ్యాంగ్ స్టర్స్ మధ్య హింస చెలరేగుతుందేమోనన్న ఆందోళన ఇప్పుడు ల్యారీలో కనిపిస్తోంది.
ఉజైర్ బలోచ్ కు బెయిల్ నిరాకరణ!
ఈ కాల్పుల ఘటనకు కొద్ది నెలల క్రితమే హత్యలు, పోలీసులపై దాడులు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్న మొత్తం ఏడు కేసుల్లో.. ఉజర్ బెలోచ్ అరెస్టై జెయిలుకెళ్లాడు. ఉజైర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం (ఏటీసీ) తిరస్కరించింది. ఆ తర్వాత 2020 ఏప్రిల్ లో సైనిక న్యాయస్థానం ఉజైర్ ను గూఢచర్యం కింద దోషిగా తేల్చి.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చట్టాలను అమలు చేసే సంస్థలపై తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడి చేసిన కేసుల్లో కూడా ఉజైర్ పై అభియోగాలున్నాయి.
మొత్తంగా ఉజైర్ బలోచ్ పాత్ర దురంధర్ లో కీలకం కాగా.. సేమ్ టూ సేమ్ దురంధర్ సినిమా తాజాగా పాకిస్థాన్ లో జరిగిన కాల్పులతో నిజం కావడం యాదృచ్ఛికమే.



