ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటున్న యూఎన్! ఎల్ నినోపై ఆ హెచ్చరిక ఏంటి..?

ఈ వానాకాలం సీజన్ లో మనం ఎక్కువ మాట్లాడుకుంటున్న ఓ విషయం ఎల్ నినో. రాబోయే రోజుల్లో ఎల్ నినో ముప్పు మరింత ముంచుకొస్తుందా..? ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు దేనికి సూచిక..?

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్… శంకర్ దాదా ఎంబీబీఎంస్ లో చిరంజీవి డైలాగ్. ఇప్పుడిది నిజం కాబోతోందన్నది ఐక్యరాజ్యసమతి హెచ్చరిక.

రాబోయే కొన్ని నెలల్లో ఎల్ నినో మరింత బలపడే అవకాశాలున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ చేస్తున్న హెచ్చరిక. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమూనాల్లో గణనీయమైన మార్పులు.. ఊహించలేని క్లైమేట్ ఛేంజ్ కనిపించబోతోందన్నదే ఆ హెచ్చరిక సారాంశం.

వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఒక గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ ను విడుదల చేసింది. 2026 ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఎల్ నినో బలమైన దశలోకి ప్రవేశించే అవకాశముందన్నది ఆ అప్డేట్ సారాంశం.

ఇప్పటికే సముద్ర జలాలా అసాధారణ వేడిగా మారుతున్న పరిస్థితుల్లో.. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేయబోతోంది.

అందువల్ల ప్రభుత్వాలు, సామాజిక సంస్థలతో పాటు.. వాతావరణ పరిస్థితులపై ఆధారపడే వ్యవసాయ, ఆరోగ్య, ఇతర ప్రమాదానికి గురయ్యే రంగాలన్నీఅప్రమత్తం కావాలని.. వాతావరణ సమాచారాన్ని ఉపయోగించుకుని సంభవించబోయే ప్రభావాలకు ముందస్తుగానే సిద్ధం కావాలన్నది wmo చేస్తున్న హెచ్చరిక.

ఎల్ నినో గురించి ఎందుకంత ఆందోళన…?

ఎల్ నినో అనేది సహజంగా ఏర్పడే వాతావరణ చక్రమే. భూమధ్యరేఖ సమీపంలోని మధ్య, తూర్పు పసిఫిక్ మహాసంద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎల్ నినో ఏర్పడుతుందన్నదీ చాలామంది తెలుసుకున్నదే. అయితే, పసిఫిక్ మహాసంద్రంలో ఆరంభమైనప్పటికీ.. దీని తీవ్రత మాత్రం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ప్రభావం చూపడమే ఆందోళన కల్గించే అంశం.

ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాతో పాటు.. ప్రపంచంలోని ఇతర ప్రముఖ వాతావరణ కేంద్రాల అసెస్మెంట్ మేరకు.. ఆగస్ట్ – అక్టోబర్ ఎల్ నినో సంక్షోభం తీవ్రంగా ఉండబోతోంది. సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఈ ముప్పు ముంచుకొస్తోంది. సగట ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ నమోదవ్వడం బలమైన ఎల్ నినోకు సంకేతాలుగా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇదే సమయంలో పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.

ఈ పరిస్థితిలో పశ్చిమ హిందూ మహాసముద్రం సాధారణం కంటే ఎక్కువ వేడిగా.. తూర్పు హిందూ మహాసముద్రం అందుకు భిన్నంగా చల్లగా మారుతాయని.. ఇలాంటి సంకేతాల వల్ల కూడా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించవచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట.

అలాగే ఉష్ణమండల అట్లాంటిక్ మహాసంద్రంలో కూడా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువయ్యే అవకాశాలే ఎక్కువ అని కూడా wmo హెచ్చరిస్తోంది. దీంతో మొత్తం ప్రపంచ వాతావరణ వ్యవస్థనే సంక్లిష్ఠంగా మారే ప్రమాదాలు కనిపిస్తున్నట్టు ఈ సంస్థ చెబుతోంది.

ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి ఇస్తున్న హెచ్చరికేంటి..?

వాతావరణ ప్రమాదాలు పెరుగుతాయి. ఎల్ నినో ఇప్పుడు మన ఇంటి గుమ్మంలోకొచ్చింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, విధ్వంసకర కార్చిచ్చులు, రికార్డ్ స్థాయి సముద్ర ఉష్ణోగ్రతల నమోదును ఎల్ నినో మరింత తీవ్రం చేయనుంది.

శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమనీ వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించడంతో పాటే.. వాటి మూల కారణాలను కూడా ఎదుర్కొనే విధంగా సన్నద్ధం చేయాలన్నది ఐక్యరాజ్యసమితి ఇస్తున్న పిలుపు.

అత్యంత నిశితంగా పరిశీలించే ఘటనల్లో ఇప్పుడు ఎల్ నినో ఒకటి. అయితే, కేవలం అంచనాలతోనే విపత్తులను నివారించడమూ అంత ఈజీ ఏం కాదు. అయితే, అదే సమయంలో నమ్మకమైన వాతావరణ సమాచారంతో చర్యలు తీసుకోగల్గితే.. ప్రభుత్వాలు, ప్రజలు ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి తగిన సన్నద్ధతతో తీవ్ర వాతావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేగల్గే అవకాశాలూ లేకపోలేదు.

రాబోయే నెలల్లో సంభవించే ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు సాయంగా వాతావరణ సమాచార సేవలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సన్నద్ధం అవ్వడంతో పాటు.. అంతర్జాతీయ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు ఇప్పుడు WMO చెబుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles