సంప్రదాయాల వృత్తంలో ఉంటూనే.. హక్కులకై పోరాటం: ఫెమినిచి ఫాతిమా!

ఫెమినిచి ఫాతిమా’ (మలయాళం – ప్రైమ్ వీడియో)


Vijay Kumar Koduri… ✍🏻

మదర్సాలో బోధకుడైన అష్రాఫ్ భార్య ఫాతిమా రోజువారీ జీవితం, ఒక సాధారణ సంప్రదాయ ముస్లిం కుటుంబ స్త్రీ జీవితం కన్నా భిన్నమైనది కాదు. వంట చేయడం, భోజనాలు పెట్టడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, అత్త, మొగుడి బాగోగులు, ముగ్గురి పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం – ఇంతే!

ఇంతేనా ?

మొగుడు బయటికి వెళుతుంటే చెప్పులు అందించడం, వంటింట్లో ఉన్నాసరే, మొగుడు కేక వేస్తె బెడ్ రూమ్ లోకి వచ్చి ఫ్యాన్ వేయడం, అత్త సూటిపోటి మాటలను, మొగుడి పెత్తనం భరించడం వంటివి అదనం.

ఇన్నింటి నడుమ, కాసేపు మెత్తని పరుపు మీద నడుం వాల్చితే దొరికే విశ్రాంతి గొప్ప ఊరట ఆమెకు. ఒక రాత్రి ఆ పరుపుని పెద్ద కొడుకు తడిపి వేస్తాడు. కాస్త శుభ్రం చేసి బయట ఆరవేస్తే వీధికుక్క వచ్చి పాడు చేస్తుంది. ఇక ఆ పరుపుని ఎట్టి పరిస్థితులలో ఇంట్లోకి తీసుకు రావొద్దు అంటాడు భర్త. అట్లా అని కొత్త పరుపు కొని తెచ్చేంత స్తోమత వున్నవాడు కూడా కాదు.

మరి, అసలే నడుము నొప్పితో బాధపడే ఫాతిమా పరిస్థితి ఏమిటి ?

ఈ పరుపు సమస్యను ఫాతిమా ఎట్లా పరిష్కరించుకున్నది?

ఆ క్రమంలో ఫాతిమా ఎదిగిన తీరు ఏమిటి?

చివరికి మొగుడు ఖంగారు పడి ‘నువ్వు ఫెమినిస్టువా?’ అని అడిగితే, ఫాతిమా ఇచ్చిన జవాబు ఏమిటి ?

కేవలం గంటన్నర సినిమా ఇది

ఎక్కడా గంభీరమైన వాదనలు గానీ సన్నివేశాల గానీ లేని సినిమా ఇది

మరొక మళయాళ సినిమా ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ ప్రస్తావించిన స్త్రీల సమస్యలనే ఈ సినిమా కూడా ప్రస్తావించింది. కాకపొతే. ఆ సినిమాలాగా బిగ్గరగా మాట్లాడి ఎదురు తిరగడం వంటివి లేకుండా సున్నితంగా, ఒకింత వినోదంతో ప్రస్తావించింది.

సంప్రదాయాల వృత్తంలోనే ఉంటూ ఒక ముస్లిం స్త్రీ తన చిన్న చిన్న హక్కులను ఎట్లా సాధించుకుందో అద్భుతంగా చెప్పిన సినిమా యిది

ముఖ్యంగా, అటు భర్తను, ఇటు అత్తను విలన్ల మాదిరి చూపించకుండా ‘వాళ్ళు కూడా ఈ వ్యవస్థలు తయారు చేసిన మనుషులే’ అన్నట్టు చిత్రించడం బాగుంది

మొత్తంగా ఈ సినిమా నాకు ఎంత బాగా నచ్చిందో మాటల్లో వర్ణించలేను.

ఎవరన్నారు – ముస్లిం దర్శకులు, రచయితలూ తమ సంప్రదాయ సమాజంలోని రుగ్మతల మీద సినిమాలు తీయరని? 28 ఏళ్ల యువకుడైన ఈ సినిమా దర్శకుడు తీసి చూపించాడు. నిష్ఠతో జీవించే సంప్రదాయ ముస్లిం పెద్దలు కూడా ‘శభాష్’ అనేంత గొప్పగా తీసాడు

మర్చిపోయా – ఈ సినిమాను మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ సమర్పించాడు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles