డయాబెటిస్, కిడ్నీస్ ఫెయిల్యూర్, గుండెపోట్లు, బీపీ, క్యాన్సర్ ఇలా పలురకాల వ్యాధులతో పాటు.. అప్పుడప్పుడూ అంతుచిక్కని రోగాలతోనూ సతమతమవుతున్న నేటి రోజుల్లో ఆరోగ్యంగా బతకడమెలా అన్న ఆలోచనల చుట్టూ ఈ సమాజం పరిభ్రమిస్తోంది. ఇలాంటి సమయంలో ఏ అలవాట్లైతే సరి కావని ఈ సమాజం అనుకుంటుందో.. అవే అలవాట్లతో 101 ఏళ్ల వయస్సులోనూ హాయిగా జీవిస్తోంది ఓ ముసలమ్మ. చైనాకు చెందిన ఆ ముసలమ్మ కథ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆసక్తి రేకెత్తించే ఆ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ఓసారి తెలుసుకుందాం రండి.

ఆరోగ్యంగా ఉండాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. వయస్సును బట్టి ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ ప్రోటీన్స్, కార్పోహైడ్రెట్స్, ఫైబర్ ఇలా కావల్సినవాటిని అంతే సమపాళ్లల్లో అందేలా చూసుకోవాలి. వయస్సు మీద పడుతున్నకొద్దీ చక్కెర, ఇతర స్వీట్స్ తగ్గించాలి. వీటికి తోడు తమ దినచర్యలో త్వరగా పడుకోవాలి. ఇదిగో ఇలాంటి ఎన్నో ఆహర, ఇతర కట్టుబాట్ల మధ్యలో నడుస్తున్న జీవనశైలిలో.. వీటన్నింటీ ప్రశ్నించేలా ఓ బామ్మ జీవతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
చైనా బీజియాంగ్ ప్రావిన్స్ లో వెన్ జౌ పట్టణానికి చెందిన శతాధిక వయస్సు గల 101 ఏళ్ల జియాంగ్ యుయెకిన్ కథ ఇది. తన నిశ్చింత జీవనశైలితో ఇంటర్నెట్ లో ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ ఈ ముసలావిడ.
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం మొట్టమొదటి కూడని అలవాటు. అర్ధరాత్రి రాత్రి తర్వాత జంక్ ఫుడ్ తినడం అస్సలే కూడని అలవాటు. సూర్యోదయం తర్వాత లేవడం మంచిదే కాదంటారు. కానీ, వీటినే పాటిస్తూ 101 ఏళ్లకూ తన నిత్య జీవనశైలిలో ఎంతో చురుకుగా ఉంటోంది జియాంగ్ యుయెకిన్. ఇంతేనా…? మన సంక్రాంతి చక్కినాలిచ్చినా పటపటా కొరికేసేలా ఆమె దంతాలు పని చేస్తున్నాయట.
ఆరోగ్య నిపుణులు చెప్పే సూత్రాలకు పూర్తి భిన్న జీవనశైలి!
సాధారణంగా ఆరోగ్య నిపుణులు పాటించాలని చెప్పే నియమాల్లో తేలికపాటి భోజనం, క్రమబద్ధమైన జీవన చర్య, త్వరగా నిద్రపోవడం వంటివి ఉంటాయి. ఇంకొంచెం ఆయుర్వేదిక్ పద్ధతుల్లోనైతే పచ్చి కూరగాయలు, ఆర్గానిక్ ఫుడ్ వంటివీ టీవీల్లో చూస్తూ.. నచ్చినవారు పాటిస్తూ, నచ్చనివారు ఇదేం చాదస్తమనుకోవడం మనమెరిగిందే. కానీ, వీటన్నింటికీ పూర్తి విరుద్ధమైంది జియాంగ్ జీవనశైలి.
జియాంగ్ జీవితం ఉదయం పది కానిదే ప్రారంభం కాదు. ఉదయాన్నే మేల్కోవాలనే ఆరోగ్య సూత్రానికి ఈ శైలి బద్ద విరుద్ధం. సంప్రదాయ అల్పాహారానికి బదులుగా.. గ్రీన్ టీతో తన దిన చర్య ప్రారంభిస్తుంది. సాయంత్రం నుంచి టీవీ ముందు కూర్చుని.. రాత్రి రెండింటి వరకూ టీవీ చూస్తూ మేల్కొనే ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ మధ్యమధ్యలో స్నాక్స్ కూడా తింటుంది. ఇక ఆమె ఆహారపలవాట్లలో పేస్ట్రీలు, బిస్కెట్స్, చిప్స్, ఎండబెట్టిన చిలగడ దుంపలు.. ఇవన్నీ జియాంగ్ కు ఎంతో ఇష్టమైన ఫుడ్. ఇక వెన్ జౌ పట్టణ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తున్న మాటిసాంగ్ స్వీట్ అంటే జియాంగ్ ఉవ్విళ్లూరుతుంది.
ఇప్పటివరకూ కూడా 101 ఏళ్ల ప్రాయంలోనూ ఏనాడూ దంతాలకు సంబంధించిన ఎలాంటి సమస్యా తలెత్తలేదు. డెంటల్ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే పడలేదు. ఇప్పటికీ ఎంత గట్టివైనా సులభంగా నమిలేస్తూ యువకులకే సవాల్ విసురుతోంది జియాంగ్.
జియాంగ్ అలవాట్లకు కారణాలేంటి..?
జియాంగ్ అలవాట్లు చిన్నప్పట్నుంచీ అలాగే ఉన్నవేం కాదు. రెండేళ్ల క్రితం అంటే 99 ఏళ్ల వయస్సులో జియాంగ్ జారి పడిపోయింది. చేతికి గాయమై శస్త్ర చికిత్స చేశారు. త్వరగా కోలుకోవాలంటే అప్పటికీ ఆమె యాక్టివ్ గా చేసుకుంటున్న ఇంటి పనులు ఆపేయాలని కుటుంబ సభ్యులు కోరడంతో.. ఇక అప్పట్నుంచీ ఆమె అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.
పగటిపూట విశ్రాంతెక్కువ తీసుకోవడం.. మధ్యాహ్న నిద్రకు అలవాటు కావడం ప్రారంభమైంది. దాంతో ఆమె రాత్రిళ్లూ నిద్ర రాక టీవీకి అతుక్కుపోవడమూ ఆరంభమైంది. చివరకు అదే అలవాటుగా మారిపోయింది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అలవాటు లేని జియాంగ్.. మధ్యాహ్నం లంచ్ కంటే ముందే అన్నం తినేస్తుంది. ఇక సాయంత్రం ఆరు గంటల సమయంలో మళ్లీ భోజనం చేస్తుంది. బాగా ఆకలనిపిస్తే 9 గంటలకు లైట్ స్నాక్స్ కూడా తీసుకుంటారు.
మరి జియాంగ్ దీర్ఘాయుష్షుకు కారణాలేంటి..?
కఠినమైన డైట్ తీసుకోకపోవడమే ఆమె దీర్ఘాయుష్షు రహస్యం. వ్యాయామాలేమీ చేయకున్నా.. మనశ్శాంతిగా జీవించడమూ పూర్ణాయుష్షుకు కారణాలుగా చెబుతారు ఆమె కుటుంబ సభ్యులు. అనవసరమైన ఆందోళనలు, ద్వేషాలు పెట్టుకోవడాలు వంటివాటిని దగ్గరకు రానివ్వకుండా.. ఒత్తిడికి దూరంగా ఉండే ఆమె జీవనశైలే జియాంగ్ పూర్ణాయుష్షుకు కారణాలు.
ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినడం, గాఢ నిద్ర వంటివన్నీ ఆమెను ఇంకా ప్రోయాక్టివ్ గా ఉంచుతున్నాయట.
మొత్తంగా ఇంటర్నెట్ లో వైరలైన ఈ చైనా వృద్ధురాలి కథ.. వ్యాయామాలు చేసినంత మాత్రాన్నే ఆరోగ్యంగా ఉండలేరు.. మనశ్శాంతిగా ఉండగల్గినప్పుడే… జియాంగ్ లా జీవించొచ్చన్న విషయాన్ని నేటి కాలపువారికి చెబుతున్న ఓ పాఠం.


