ఫిన్లాండ్ సమాజం
డా. పుల్లూరి సంపత్ రావు.. ✍️
విద్యలో ఫిన్లాండ్ అద్భుతాలు చేసిందని అంటారు. పీసా(PISA: Programme for International Student Assessment) టెస్ట్ లో ఫిన్లాండ్ చాలా సార్లు ముందుంటుంది. విద్యారంగ పరిశోధనలు చేసి Finnish Lessons అనే పుస్తకం రాసిన Pasi Sahlberg గారు GERM: (Global Educational Reform Movement) గురించి టెడ్ టాక్స్ లో మాట్లాడారు. అక్కడి విద్యారంగంలోAccountability కంటే Trust ఎక్కువని వారి అభిప్రాయం. ఫిన్నిష్, స్వీడిష్ వంటి స్థానిక భాషలలో విద్యాబోధన జరుగుతుంది. ఇక్కడ 7-16 సంవత్సరాల విద్య తప్పనిసరి. 43 శాతం విద్యార్థులు వృత్తి విద్యలోకి వెళుతారు. విద్యార్థులు టీచర్లను పేరు పెట్టి పిలుస్తారు, 38 శాతం పేరెంట్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడుపుతారు. తల్లులకంటే తండ్రులు సగటున 8 నిముషాలు ఎక్కువ గడుపుతారని ఒక సర్వే తెలిపింది. అందుకని ఇక్కడికి విద్యారంగ పరిశోధన కోసం ప్రపంచం నలు మూలల నుండి వస్తున్నారు. ఈ కారణంగానే Pasi Sahlberg గారు Ministry of Education and Culture ఉన్న మంత్రిత్వ శాఖ పేరును Ministry of Education and Tourism గా మార్చాలని జోక్ చేస్తున్నారు.

ఫిన్లాండ్ దేశపు వివరాల్లోకి వెళితే వారి విద్యారంగం ఇలా ఎందుకుందో మరింత ఎక్కువ అర్థం అవుతుంది. ఫిన్లాండ్ ను ఆనుకుని నార్వే, స్వీడెన్, రష్యా దేశాలు ఉన్నాయి. దక్షిణాన బాల్టిక్ సముద్రం ఉంది. హెల్సేంకి దీని రాజధాని. కరెన్సీ యూరో. 56.03 లక్షల జనాభా. 3,38,455స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం. జనసాంద్రత కిలోమీటరుకు 18 మంది. ఫిన్నిష్, స్వీడిష్ భాషలు మాట్లాడుతారు. 99.5 శాతం అక్షరాశ్యత. 200 సభ్యులు గల ఏక సభా విధానం లో పార్లమెంటరి ప్రభుత్వం పద్ధతి నడుస్తున్నది. బహుళపక్ష విధానం. సాదారణంగా సంకీర్ణ ప్రభుత్వాలుంటాయి. అతిపెద్ద పార్టీ నుండి ప్రధాని, రెండో స్థానం వారికి ఆర్థిక శాఖ లభిస్తుంది. నాలుగు సంవత్సరాలకొక సారి ఎన్నికలు జరుగుతాయి. రాజకీయాల్లో 50 శాతం మహిళలు ఉన్నారు. ప్రస్తుతం పెటరీ ఒరపో ప్రధానిగా ఉన్నారు. ఓటర్లలో 50 శాతం 50 సంవత్సరాల వయసు పైబడిన వారే. దేశాన్ని 19 ప్రాంతాలుగా 310 మున్సిపాలిటిలుగా విభజించారు. రాష్ట్రాలు ఉండవు. అన్ని అధికారాలు మున్సిపాలిటీలకే ఉంటాయి. ఒకే ఒక మెట్రో నగరం. అది హెల్సేంకి. 14 లక్షల జనాభా రాజధానిలోనే ఉంది. మూడొంతుల ఆదాయం మెట్రో నగరం నుండే వస్తుంది.
ఆరోగ్య సదుపాయాలు ఎక్కువే. తక్కువ శిశుమరణాలు, తక్కువ క్యాన్సర్ రేట్. సంతోషంగా ఉండే దేశంగా దీనికి పేరుంది. వరల్డ్ హ్యాప్పినెస్ రిపోర్ట్ ఈ దేశానికి గత ఏడు సంవత్సరాలుగా వరుసగా మొదటి స్థానం ఇచ్చింది. జీవన ప్రమాణాలు ఎక్కువ. పురుషుల సగటు ఆయు ప్రమాణం79 సంవత్సరాలు కాగా స్త్రీలు సగటు 84. ప్రతి 307 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. స్థూల జాతీయ ఉత్పత్తిలోను, మనవాభివృద్ది సూచిలోను, లింగ సమానత్వంలోను సంతృప్తికర జీవనంలోనూ పేరెన్నిక గల దేశం. పత్రికా స్వతంత్రంలో ముందున్న దేశం. పౌరహక్కుల రక్షణలో అగ్రస్థానం. అసమానతలు తక్కువ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం అత్యంత తక్కువ అవినీతి దేశాల్లో ప్రపంచంలో ఐదవది, యూరప్ లో మొదటిది.
34,700 మంది రక్షణ సిబ్బందిలో 25 శాతం సైన్యం ఉంటుంది. మిగతావాళ్ళంతా18 సంవత్సరాలు నిండిన పురుషులు 6-12 నెలల ఆర్మీలో గాని 12 నెలల సివిల్ సర్విస్ లోగాని చేరుతారు. ప్రతి సంవత్సరం 500 మంది స్త్రీలు స్వచ్చంద మిలిటరీ సర్విస్ చేస్తారు.
కలప వంటి అటవీ ఉత్పత్తులు, ఖనిజాలు, చేపలు, మాంసం, పర్యాటకం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. మహిళా ఉద్యోగుల శాతం ఎక్కువ. విశాలమైన ఇండ్లు. అందరికీ మొబైల్స్, కార్లు ఉంటాయి. నోకియా పేరుతో ఫిన్లాండ్ లో ఒక నది, పట్టణం ఉన్నాయి. ఆ పేరుతో ఫోన్లు ఉన్న సంగతి మనకు తెల్సిందే. దేశంలో 40 వరకు జాతీయ పార్కులు కొన్ని థీం పార్కులు ఉన్నాయి. ఉత్తర ప్రాంతమంతా మంచుతో ఉంటుంది. దీన్ని లాప్ ల్యాండ్ అంటారు. ఈ ప్రదేశాన్ని సాంటాక్లాజ్ నివాసం గా చెప్పుకుంటారు. వేసవిలో 73 రోజుల పాటు వరుసగా సూర్యాస్తమయం ఉండదు. చలికాలం 51 రోజులు సూర్యోదయం కాదు. శరీర ఉష్ణోగ్రత కోసం “సౌనా” లు అందుబాటులో ఉంటాయి. స్కేటింగ్, ఐస్ హాకి, టూరిజానికి ప్రసిద్ది.
ఫిన్లాండ్ ప్రజలు తక్కువ మాట్లాడుతారని అంటారు. వాళ్లకు సిగ్గు, బిడియం ఎక్కువ. భార్య భర్తలు కూడా సరిగా మాట్లాడుకోరని వాళ్ళపై జోక్స్ వేస్తుంటారు. ఇక్కడి ప్రజలు ఏకాంతాన్ని, నిశ్శబ్ధాన్ని, శుబ్రతను ఎక్కువ ఇష్టపడుతారు. సంపద కంటే సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు. ఫిన్లాండ్ లో పౌరులు, ఉద్యోగులు, నాయకులు బాధ్యతగా ఉంటారు. ఫిన్లాండ్ ప్రజల గురించి ఇతరులను ఒక్క మాటలో చెప్పమంటే “నిజాయితి” అని చెప్తారు. బాల్యం నుండే పిల్లలకు పరోపకారం అలవాటు చేస్తారు. అవతలివారి అవసరాలు, ఇతర సంస్కృతులను, భిన్న వాతావరణాల పట్ల ఆశావాద దృక్పదం, సమాజం పట్ల బాధ్యత వంటివి ఫిన్లాండ్ జాతీయ విద్యా లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ పిల్లల పుస్తకాలు ప్రచురిస్తున్న దేశం ఫిన్లాండ్. ప్రతి ఒక్కరికి ఇంటర్ నెట్ చట్టభద్దంగా అందరికి అందుబాటులో ఉండాలని 2010 లో చట్టం చేశారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మంచు ప్రదేశం కాబట్టి స్వచ్చమైన గాలి లభిస్తుంది. రుచికి ఆరోగ్యానికి మంచిదని ట్యాప్ వాటర్ తాగుతారు. పాలు ఈ దేశపు జాతీయ ద్రావకం. కాఫీ తాగడం ఎక్కువే. ఫిన్లాండ్ సమాజం లో నేరం, హింస బాగా తక్కువ. దొంగతనాలు చాలా తక్కువ. కార్ లాక్ చేయకుండానే షాపుల్లోకి వెళుతారు. అర్థ రాత్రైనా వీధుల్లో తిరుగొచ్చు. పోలీస్ వాళ్ళు ఎంతో మర్యాదగా ఉంటారు. 112 అనేది ఈ దేశపు ఎమర్జెన్సి నంబర్. ఎలాంటి ఫోన్ అయినా సిమ్ లేకపోయినా, ఫోన్ లాక్ చేసి ఉన్నా కూడా ఈ నంబర్ డయల్ చేయచ్చు. వీరి సహజ స్వభావం రీత్యా కొంత మంచువల్ల కొంత నెమ్మదిగా ప్రయాణాలు చేస్తుంటారు. ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశం. ఫిన్లాండ్ వాళ్ళు కూడా ఇతరులను చూసి కొన్ని నేర్చుకుంటున్నారు. ఈ మద్య కాలంలో దొంగతనాలు, ఆత్మహత్యలు, గృహ హింస, ఆల్కహాల్, కుంగుబాటు వంటి సమస్యలు నమోదు అవుతున్నాయట.



