సూసైడ్ అటెంప్ట్ నుంచి టాప్ కమెడియన్ గా!

13 ఏళ్లకే ఆత్మహత్యాయత్నం చేశాడు… వీధుల్లో పెన్నులమ్ముకు తిరుగుతూ బతికాడు.. కానీ, ఆ తర్వాత గోడకు కొట్టిన రబ్బర్ బంతిలా రివర్స్ లో దూసుకొచ్చాడు. ఇవాళ ఓ కోటీశ్వరుడు. ఆయనే భారతీయులను తన కామెడీ, టైమింగ్ తో ఉర్రూతలూగించిన జాన్ ప్రకాశ్ రావు జనుమల.

కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జానీ లివర్ ఉరఫ్ జాన్ ప్రకాశ్ రావు జనుమల. మన తెలుగువాడు. 1957, ఆగస్ట్ 14న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హిందుస్థానీ యూనీలివర్ లో ఆపరేటర్ గా పనిచేసేవారు. తర్వాత జానీ కూడా అక్కడ కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత జానీ లివర్ కుటుంబం ముంబైలోని ధారావి స్లమ్ ప్రాంతానికి మకాం మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. దాంతో ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో 7వ తరగతి వరకూ చదువుకున్న జానీ లివర్.. ఆ తర్వాత చదువు కూడా ఆపేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

వీధుల్లో పెన్నులు అమ్మిన జానీ లివర్!

ప్రముఖ హాస్యనటుడిగా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో.. శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్న జానీలివర్ విజయవంతమైన ప్రయాణం వెనుక ముళ్లదారులే ఎక్కువ. కుటుంబానికి సాయం చేయడానికి చిన్న వయస్సులోనే కూలీగా మారాడు. పలుచోట్ల పనులు చేశాడు. ముంబై వీధుల్లో పెన్నులమ్ముకున్నాడు. బాలీవుడ్ నటులను అనుకరిస్తూ తన మిమిక్రీతో జనాన్ని అలరించేవాడు. కానీ, మిమిక్రీ ప్రదర్శనలు, హావభావాలే తనలోని కామెడీ ప్రతిభకు పునాదిగా మారాయి.

పిన్న వయస్సులోనే చుట్టుముట్టిన కష్టాలు!

తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఇంట్లో పోషణ భారంగా మారింది. బతుకే భారమైపోయింది. దాంతో తీవ్రమైన ఒత్తిడి. అలా 13 ఏళ్లకే ఎందుకీ జీవితమనుకుని రైల్వే ట్రాక్ వద్దకు ఆత్మహత్య చేసుకుందామని వెళ్లాడు. కానీ, తన ముగ్గురు అక్కాచెల్లెళ్ల బాధ్యత తనపై ఉందని గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జానీ వివరించాడు. ఆ తర్వాత తన ఆలోచనను విరమించుకుని.. ఎలాగైనా జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో ఎదిగాడు.

జానీ లివర్ అనే పేరెలా వచ్చింది..?

హిందుస్థాన్ యూనిలివర్ లో పనిచేస్తున్న సమయంలో ఆయన ప్రతిభను నిరూపించుకునే ఓ అవకాశం వచ్చింది. కంపెనీ కార్యక్రమంలో తన సీనియర్ అధికారులను అనుకరిస్తూ మిమిక్రీతో అలరించాడు. ఆ ప్రదర్శన తర్వాత ఆయన్ను అంతా జానీ లివర్ అని పిలవడం ప్రారంభించారు. అలా జాన్ ప్రకాశ్ రావు జనుమల కాస్తా… జానీ లివర్ గా గుర్తింపు పొందాడు.

ఉద్యోగాన్ని వదలి అభిరుచి వైపు!

ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే అప్పుడప్పుడూ తన ప్రతిభను ప్రదర్శించుకునేందుకు స్టేజ్ షోస్ లో వచ్చే అవకాశాలనూ ఉపయోగంచుకున్నాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టేజ్ షోస్ తో ఆదాయం పెరిగింది. దాంతో స్థిరమైన ఉద్యోగాన్ని కూడా వదిలేసి అభిరుచైన వినోద రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికే దర్శకుడు శేఖర్ కపూర్ తో కూడా పరిచయమేర్పడి ఓ ప్రాజెక్ట్ కూడా చేశాడు. ఉద్యోగభద్రత గురించి తండ్రి ఆందోళన చెందినా.. అభిరుచి మేరకు వినోద రంగంలోనే కొనసాగాడు.

సినిమాల్లో మొట్టమొదటి అవకాశమెలా వచ్చింది..?

సినిమాల్లోకి రాకముందు తన మిమిక్రీ, హావభావాలతో మెల్లిమెల్లిగా ఎదిగి.. దేశంలోనే తొలి స్టాండ్ అఫ్ కమెడీయన్లలో ఒకడిగా ఎదిగాడు. దేశ, విదేశాల్లో లైవ్ షోస్ చేసేవాడు. 1982లో అమితాబ్ తో కలిసి ఆయన ఒక లైవ్ షోకు సంబంధించిన టూర్ లో పాల్గొన్నాడు. అప్పుడు సునీల్ దత్ జానీ లివర్ ప్రతిభను గమనించి దర్ద్ కా రిష్తా సినిమాలో అవకాశమిచ్చారు.

విజయానికి చిరునామా!

ఆ అవకాశం తర్వాత జానీ లివర్ కెరీర్ ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయింది. 350 సినిమాలకు పైగా నటించి.. దేశంలో అత్యం ప్రియమైన హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కామెడీతో ఒక మూడు తరాలను అలరించాడు. విజయంతో పాటే, ఆర్థిక స్థిరత్వాన్నీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జానీ లివర్ ఆస్తుల విలువ 277 కోట్లుగా ఒక అంచనా. ఇటీవలే హౌజ్ ఫుల్ 5వ పార్ట్ తో మరోసారి తెరపై కనిపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles