సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఓ మైలురాయి.. మాధురీ దీక్షిత్ నృత్యాలకు గీటురాయి. నటులతో పాటు, ప్రేక్షకులకూ మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఓ సకుటుంబ సపరివార చిత్రం. దీదీ తేరా దేవర్ దివానా పాటతో కేవలం ఆడియోపైనే 11 కోట్ల 70 లక్షల రూపాయల బిజినెస్ చేసిన సినిమా.. రామ్ లక్ష్మణ్ సంగీతంలో కంటిన్యూయిస్ గా చార్ట్ బస్టర్స్ లో ప్రతీ వీక్ లో టాప్ లో నిల్చిన పాట.. ఫిలిప్స్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించిన సంగీతం.. వెరసి హమ్ ఆప్కే హై కౌన్.. ముఖ్యంగా ఆ సినిమా పాటలు చాలామందికి ఓ నోస్టాల్జియా!
అయితే, ఆ సినిమాను అందరినీ ఆకట్టుకునేట్టు తీసిన సూరజ్ బర్జాత్యా దర్శకుడు కాకపోతే మాత్రం సినిమా అంత స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిల్చేదో, లేదో మాత్రం తెలియదు. తను తీసే ప్రతీ చిత్రం వెనుక ఎలాంటి సమస్యలెదురయ్యాయి.. ముఖ్యంగా హమ్ ఆప్కే హై కౌన్ చిత్ర నిర్మాణం కొరకు తన తండ్రి రాజ్ కుమార్ బర్జాత్యా నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నాడనే విషయాలను ఈమధ్య ఆయన ది ఫిల్మ్ కంపానియన్ అనే వెబ్ సైట్ తో పంచుకున్నారు.

హమ్ ఆప్కే హై కౌన్ చిత్ర నిర్మాణం.. ఆ పాటలు సూపర్ హిట్టైన తర్వాత అడుగడుగునా తనకు సాదర స్వాగతం లభించిందని.. ఆ సినిమా వీక్షించినవారు, పాటలు విన్నవారు.. అంతకుముందెప్పుడూ అలాంటి సినిమా రాలేదంటూ తనను కొనియాడారన్నారు. అయితే, ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రి రాజ్ కుమార్ బర్జాత్యాదే అంటాడు సూరజ్.
మైనే ప్యార్ కియా సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులోకీ డబ్ చేశాం. డబ్ చేస్తున్నప్పుడు కూడా తన తండ్రి తన ముందే కూర్చుని.. వాట్ నెక్స్ట్ అని ప్రశ్నించారన్నారు. దానికి చూద్దాం అని తాను జవాబిస్తే.. దానికి తన తండ్రి సమాధానపడలేదంటారు సూరజ్. అప్పుడు తన తండ్రి అవాధి భాషలో నిర్మించిన ఒక సినిమాను నువ్వు హిందీలో రీమేక్ చేయాలి. దాన్ని మన రాజశ్రీ సంస్థే 1981లో నిర్మించింది. దాని పేరు నదియా కే పార్. అదో పెద్ద హిట్. కానీ దానిపై ఎవరి దృష్టీ ఇంకా పడలేదు. దాన్ని హిందీలోకి రీమేక్ చేస్తే ఇప్పుడున్న ట్రెండ్ లో మరో పెద్ద హిట్టవుతుందని తన తండ్రి సూచించాడని చెప్పుకొచ్చారు సూరజ్.
ఇండో-ఆర్యన్ భాషగా పేరున్న అవాధి భాష ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లోని ప్రజలు మాట్లాడుతుంటారు. ఆ భాషలోనే నదియా కే పార్ సినిమాను 1981లో రాజశ్రీ సంస్థ గోవింద్ మూనిస్ డైరెక్షన్ లో సచిన్ పిల్గావోంకర్, సాధనా సింగ్ హీరో, హీరోయిన్స్ గా నిర్మించింది.1982, అక్టోబర్ 10న విడుదలైన నదియా కే పార్ కు రవీంద్ర జైన్ సంగీత దర్శకుడు. అప్పుడది సూపర్ హిట్.
అయితే, తండ్రి రాజ్ కుమార్ బర్జాత్యా వాట్ నెక్స్ట్ అన్నప్పుడు కాస్త అన్యమనస్కంగానే చూద్దాం అని దాటవేసిన సూరజ్ బర్జాత్యాకు.. అంత మంచి సినిమా చూసిన తర్వాత ఎందుకు రీమేక్ చేయకూడదు, దానికి తానే ఎందుకు దర్శకత్వం వహించకూడదనిపించిందట.
అదే సమయంలో తాను అప్పటికే మైనే ప్యార్ కియాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక వాట్ నెక్స్ట్ అనే ఒత్తిడి తనలో కూడా పెరిగిందంటాడు సూరజ్. అలాగే, కొన్ని సబ్జెక్ట్స్ పరిశీలిస్తూ.. ఏంచేయాలా అన్న ఆలోచనలు నడుస్తూ ఏదీ ఒక పట్టాన నచ్చని పరిస్థితుల్లో తన తండ్రి ఆ సూచన చేశాడని చెప్పుకొచ్చాడు సూరజ్. అయితే, ఆ ఒత్తిడితో రెండుసార్లు అనారోగ్యానికి గురైన సూరజ్ ఈసీజీ తీయించుకోవాల్సి వచ్చిందట. ఒక దశలో తాను దర్శకత్వం వహించలేననుకున్నాడట హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి. పైగా అప్పటికే ఓ సినిమా సూపర్ హిట్ కావడంతో… వచ్చే సినిమాపై జనంలో అంచనాలు మరింత పెరుగుతాయన్న ఆలోచనలు తనను తరిమాయంటాడు సూరజ్. పైగా ఎలాంటి విలన్స్, రౌడీయిజం, వయోలెన్స్ లేకుండా.. కేవలం ఒక కుటుంబ కథాచిత్రాన్ని.. అదీ శ్రావ్యసంగీత దృశ్యకావ్యంగా తెరకెక్కించాలన్న తన తండ్రి కోరిక తనకో సవాల్ గా మారిందంటూ చెప్పుకొచ్చారాయన. పైగా అప్పటికే పెద్ద హిట్ ఇచ్చిన నేపథ్యంలో.. దాని ప్రభావం ఏ మాత్రం పడకుండా.. అంతకన్నా పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో తానెలా ఒత్తిడికి గురైందీ చెప్పారాయన.
ఎట్టకేలకు హమ్ ఆప్కే హై కౌన్ సినిమాను తన తండ్రి ఏ విధంగానైతే కోరుకున్నాడో.. అదే విధంగా నదియా కే పార్ సినిమా ఇన్స్పిరేషన్ తో.. తెరకెక్కించడంలో సూరజ్ బర్జాత్యా కృతకృత్యుడయ్యాడు. 1994లో విడుదలైన హమ్ ఆప్కే హై కౌన్… 90ల్లో విడులై ఆరోగ్యకమైన వినోదానికీ కేరాఫ్ లా.. ఇంటిల్లిపాదినీ అలరించేలా ప్రజాదరణ పొందడంతో పాటు.. ఏకంగా జాతీయ చలనచిత్ర అవార్డునూ కొల్లగొట్టింది. కుటుంబ విలువలు, ప్రేమ, ఆప్యాయత, అన్యోన్య దాంపత్యం, బంధువులు, బంధాల వంటివాటిని ఎంతో సానుకూల ధోరణిలో చూపిస్తూ… ఉమ్మడి కుటుంబాలంటే ఇలా ఉండాలనేలా హమ్ ఆప్కే హై కౌన్ నిలవడం ఇక మనందరికీ తెలిసిన చరిత్రే. పైగా దక్షిణాదిలో టాప్ మోస్ట్ సింగర్ గా ఉన్న బాలు చేత సింగిల్ కార్డ్ గాయకుడిగా.. హమ్ కే హై కౌన్ లో పాడించిన పాటలు ఎంత హిట్టో కూడా సినీ అభిమానులు చూసిందే.



