థార్ ఎడారిలో ఓ అరుదైన ఫోటో: రౌల్‌కు అంతర్జాతీయ గుర్తింపు!

నక్షత్రాల వేటకు వెళ్లి.. ఇసుకలో తేళ్లపై మనసుపడ్డాడు: నాల్గు రోజుల నిరీక్షణకు.. అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు!

పైన తారల కోసం వేటాడుతూ… భూమ్మీద ఎడారిలో ఓ చిన్న తేలును ఫోటో కొట్టాడు. ఫ్రేములో తేలును బంధించి… ఫోటోగ్రఫీలో ప్రపంచ విజేతగా నిల్చాడు. ఇది ఛాయాగ్రాహకుడిగా సీతారాం దిన్కర్ రౌల్ ప్రయాణంలో ఓ మరపురాని ఘట్టం.

రాజస్థాన్ ఎడారిలో అరుదైన ఓ క్షణం… భారతీయ ఫోటోగ్రాఫర్ సీతారాంకు అంతర్జాతీయ గుర్తింపు!

రాజస్థాన్ థార్ ఎడారిలో అందమైన నక్షత్రాలతో కలిపి.. కరవుకు కేరాఫ్ లా కనిపించే ఆ ఎడారికి తన ఛాయాచిత్రాలతో ఒకింత తడి అద్దాలనుకున్నాడు సీతారాం రౌల్. కానీ, అక్కడికెళ్లాక ఓ చిన్న తేలు అతడి కంట పడింది. అది తన నివాసాన్ని తవ్వుకుంటూ కనిపించిన ఆ దృశ్యం.. సీతారాం దృష్టిని, ఆకాశంలో ఉన్న నక్షత్రాల పైనుంచి.. తేలు మీదకు మరల్చింది. దాన్ని కెమెరాలో బంధించేందుకు రోజుల సమయం వెయిట్ చేశాడు. తననుకున్న స్టిల్ దొరికేవరకూ ఓపిక పట్టాడు. మొత్తానికి ఆ 90 సెకన్ల వ్యవధిలో తన కెమెరా కంటితో క్యాప్చర్ చేసిన ఆ ఓ ఫోటోగ్రాఫ్ తీయడానికి రోజుల సమయం పడితే… ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తెచ్చి పెట్టే ఒక రోజు ఆ ఫోటో దక్కించుకుంది.

ఆ ఫోటో పేరు షిఫ్టింగ్ స్యాండ్!

ప్రపంచ ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఈయర్ 2026 పోటీలో బీహేవియర్: ఇన్వర్టెబ్రేట్స్ విభాగంలో సీతారాం విజేతగా నిల్చాడు. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహించే ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 65 వేలకు పైగా ఎంట్రీలు వస్తే.. అందులోంచి మన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సీతారాం ఫోటో ఎంపికై, విజేతగా నిలిపింది.

పైన నక్షత్రాల కోసం వెతికితే… కింద భూమ్మీద తారసపడ్డ తేలు!

సీతారాంది మహారాష్ట్రలోని బద్లాపూర్. వన్యప్రాణుల ఫోటోగ్రఫీపై దాదాపు 14 ఏళ్ల అనుభవం. అడవుల్లో జంతువుల ఫోటోలతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు ప్రకృతిలో చాలామంది పట్టించుకోని, దృష్టికి నోచుకోని చిన్న జీవుల ప్రపంచాన్ని ఆవిష్కరించే స్థాయికి చేరింది. అందుకు రాజస్థాన్ థార్ ఎడారి వేదికైంది. జైసల్మేర్ సమీపంలోని సామ్ అనే గ్రామశివార్లలోని ఇసుక దిబ్బల్లో రాత్రి వేళ పరిశీలిస్తున్నప్పుడు తేళ్లు కనిపించాయి. రాత్రంతా ఆహారం కోసం తిరిగే ఆ తేళ్లు.. సూర్యోదయంతో వచ్చే వేడిని తప్పించుకునేందుకు ఉదయాన్నే ఇసుకలోకి దూరడం ఆరంభించాయి. ఆ సమయంలో ఓ తేలు తన పంజాలతో ఇసుకను తవ్వుతున్న దృశ్యం… ఆ తారలను మించి సీతారాంను ఆకట్టుకుంది. ఆ తేలు తన పంజాతో తన నివాసం కోసం ఇసుకను తవ్వుతున్నప్పుడు ఎగిరిపడే ఆ ఇసుక రేణువులను కూడా తన ఫ్రేములో బంధించగల్గితే అదో మంచి ఫోటోగ్రాఫ్ అవుతుందని భావించాడు సీతారాం. అందుకు గట్టి ప్రయత్నం మొదలుపెట్టాడు.

క్షణాల్లో క్లిక్కుమనిపించే ఓ ఫోటో కోసం… రోజుల నిరీక్షణ!

అనుకున్న దృశ్యాన్ని కెమెరాలో బంధించడమంటే మాటలేం కాదు. అప్పటికే అనుభవం కల్గిన ఫోటోగ్రాఫర్. ఇంకా ఇంకా బాగా రావాలనుకునే పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నాలూ తప్పవు. తేలు కదలికలు, ఇసుకలో దాని ప్రయాణం, వెలుతురు.. ఇలా అన్నీ అనుకూలించాలి. అందుకోసం ఆయన నాలుగు రోజులపాటు పరిశీలిస్తూ.. మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూ చివరకు తాననుకున్న స్టిల్ పట్టుకోగల్గాడు.

అలా తేలు ఇసుకను తవ్వుతుండగా ఎగిరిపడిన ఇసుక రేణువులను గాల్లోనే నిలిచిపోయినట్లుగా కెమెరాలో బంధించాడు. 90 సెకన్ల వ్యవధిలోనే ఆ క్యాప్చరింగ్ అయిపోయింది. అనుకున్న విధంగా ఫోటో క్లిక్కుమంది. అదే ఫోటో ఇవాళ అంతర్జాతీయ యవనికపై సీతారాంకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

నికాన్ డి750 కెమెరాకు… 105 మిల్లీమీటర్స్ మాక్రో లెన్స్, గోడాక్స్ ఫ్లాష్‌ను ఉపయోగించాడు సీతారాం. సాంకేతిక నైపుణ్యంతో పాటు, సరైన క్షణం కోసం నిరీక్షించిన ఓపికకు చివరకు ఒక అద్భుతమైన ఫలితం దక్కే రోజు వచ్చింది.

ఇసుకలో దాగిన జీవన పోరాటం!

అందమైన నక్షత్రాలను ఎడారితో జత కలిపి మరింత అందంగా చూపించాలనుకుని ఇసుక దిబ్బల బాట పట్టిన సీతారాంకు.. కేవలం ఇసుకలో తేలు తవ్వుతుండటం మాత్రమే కనిపించలేదు. అందులో ఆ తేలు జీవన పోరాటముంది. ఎడారి వంటి కఠినమైన వాతావరణంలో చిన్న చిన్న జీవులు మనుగడ కోసం ఎలాంటి పాట్లు పడతాయో చెప్పేది ఆ ప్రకృతి దృశ్యం. మరీ ముఖ్యంగా తేలు తన పంజాలతో ఇసుకను తవ్వుతున్నప్పుడు.. తన కాళ్లపై ఉండే పొడవైన గట్టి వెంట్రుకలు ఆ తేలు ఇసుకలో కూరుకుపోకుండా, జారిపోకుండా తోడ్పడతాయి. ఇసుకపై కదలికలకు ఒకరకంగా అవి స్నోషూస్ లా పనిచేస్తాయి. అలాంటి చిన్న జీవుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం కూడా వన్యప్రాణుల అధ్యయనంలో కీలకమే. కంటిని ఆకర్షించే పెద్ద పెద్ద జంతువులే కాదు… మన కంటికి కనిపించని ఎన్నో చిన్న జీవుల్లోనూ ప్రకృతి ఎన్నో విశేషాలను దాచిపెట్టింది. అందుకే, ఆ దృశ్యాన్ని ఓ డాక్యుమెంట్ చేయాలనుకున్నాడు సీతారాం. అనుకున్నది సాధించాడు.

మరోసారి అంతర్జాతీయ గుర్తింపు!

సీతారాం రౌల్‌కు ఈ గుర్తింపు ఇదే మొదటిసారి కాదు. 2025లో ఆయన తీసిన నేచర్ రీక్లెయిమ్స్ ఇట్స్ స్పేస్ అనే ఫొటోకు ఇదే పోటీలో అర్బన్ వైల్డ్ లైఫ్ విభాగంలో హైలీ కమెండెండ్ గుర్తింపు లభించింది. ఓ చారిత్రక కట్టడం నుంచి గబ్బిలాలు బయటకు వస్తున్న ఆ దృశ్యాన్ని సీతారాం అప్పుడు తన కెమెరాలో బంధించాడు. ఈసారి ఎడారి ఇసుకలో తేలు చేస్తున్న చిన్న పనిని ప్రపంచానికి చూపించాడు. ప్రకృతిలోని ప్రతి జీవి ఒక కథ చెబుతుందని, దాన్ని చూడటానికి ఆసక్తి, ఓపిక, పరిశీలన అవసరమని సీతారాం ఫొటోగ్రఫీ మనకి గుర్తుచేస్తోంది.

అంతేకాదు, కొన్నిసార్లు ప్రపంచాన్ని ఆకట్టుకునే దృశ్యం కోసం దూరాలు ప్రయాణించాల్సి రావచ్చు. కానీ, చాలాసార్లు అలాంటి దృశ్యాలు మన కళ్లముందే ఉన్నా.. దాన్ని గుర్తించగల చూపు, బంధించగల ఓపిక అందరికీ ఉండవు. సీతారాం రౌల్ విజయం చెబుతున్న కథ ఇది.

సీతారాం ఫోటోగ్రఫీని వీక్షించేందుకు ఈ సైట్ ఓపెన్ చేస్తే మరిన్ని ఛాయాచిత్రాలను చూడొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles