తమిళ ప్రేక్షకులకు ఆయన దాము అప్పా.. వంటల ప్రపంచానికి ఆయన డాక్టర్ కె. దామోదరన్!

ఎవరీ డాక్టర్ దామోదరన్…?

కుక్ విత్ కోమలిలో జడ్జ్ గా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన డాక్టర్ కె. దామోదరన్.. అక్టోబర్ 25న చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 72 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన కాలం చేశారు. అయితే, ఈ దామోదరన్ లైఫ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్. అందుకే ఓసారి ఆయనేంటో తెలుసుకుందాం.

వంటగదిలో మొదలైన దాము ప్రయాణం.. పద్మశ్రీ పురస్కారం వరకూ సాగిందంటేనే ఇది తెలుసుకోవాల్సిన లైఫ్ స్టోరీ.

డిష్ వాషర్ గా కెరీర్ ప్రారంభించిన దాము పేరిట మూడు గిన్నీస్ రికార్డులున్నాయి. డాక్టరేట్ సంపాదించిన దామును గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతోనూ సన్మానించింది. మరి ఇంతకీ ఈ దామోదరన్ ఏం చేశాడని..?

నవ్వుతూ ఇంతకాలం టెలివిజన్ లో అలరించిన దాము ఇక లేరు!

కుక్ విత్ కోమలితో ఈమధ్యకాలంలో బాగా ఫేమ్ అయ్యారు దాము. అయితే, ఈయన కేవలం టీవీలో కనిపించే వంటల నిపుణుడు కాదు. వంటగదిలో బోళ్లు కడిగే స్థాయి నుంచి మొదలైన దాము జర్నీ… భారతీయ వంటకాల ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే స్థాయికి ఎదిగింది.

దాము గురించి మరింత!

1954, సెప్టెంబర్ 3న తమిళనాడులో జన్మించిన దామోదరన్.. చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ లో డిప్లమా పూర్తి చేశారు. ఆరంభంలో హోటల్ కిచెన్ లో వాషింగ్ పనులు చేసిన అనుభవం కూడా దాముకుంది. హోటల్ మేనేజ్మెంట్ పూర్తైన తర్వాత మధురై కామరాజ్ యూనివర్సిటీలో బీకాం, మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. అమెరికన్ హోటల్ అండ్ మోటెల్ అసోసియేషన్ నుంచి CHE, CHA అర్హతలు కూడా సంపాదించారు. చే అంటే సర్టిఫైడ్ హాస్పిటాలిటీ ఎడ్యుకేటర్. చా అంటే సర్టిఫైడ్ హోటల్ అడ్మినిస్ట్రేటర్. చే అంటే హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం, క్యాటరింగ్ వంటి కోర్సులు బోధించే ఉన్నత విద్యా స్థాయి అధ్యాపకులకు ఈ గుర్తింపు ఉంటుంది. అలాగే, చా అంటే హోటల్ నిర్వహణ, నాయకత్వం, పరిపాలనలో అనుభవం ఉన్న సీనియర్ హాస్పిటాలిటీ మేనేజర్లు, హోటల్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. అలాగే, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ సెంటర్ మేనేజ్మెంట్ కూడా అభ్యసించారు. కాన్ఫరెన్స్ సెంటర్ మేనేజ్మెంట్ అంటే సమావేశాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, బిజినెస్ మీటింగ్స్ జరిగే కేంద్రాల్ని సమర్థంగా నిర్వహించడం.

1977లో తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా దామోదరన్ ఉద్యోగ జీవితం మొదలైంది.

చెఫ్ మాత్రమే కాదు.. బోధకుడిగా కూడా ఆకట్టుకున్న దాము!

1986లో దాము బోధనా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. చెన్నైలోని అసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎంజీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఎంపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలకు నాయకత్వం వహించారు. 2004లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ పొందారు. ఈ రంగంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ చెఫ్‌గా కూడా దాము గుర్తింపు పొందారు.

వంట అంటే రుచురుచులు వండటమే కాదు.. పాకశాస్త్రంలో లోతులను చూశారు. పాకశాస్త్రం, దాని శిక్షణ, నిర్వహణ ఇలా ముఖ్యమైన అన్ని విభాగాల్లోనూ దాము సాధికారిత సాధించారు.

617 వంటకాలతో.. 24 గంటలకు పైగా వంట!

2010 డిసెంబర్ 22, చెఫ్ దాము 24 గంటలకు పైగా ఒక నిరంతర వంట కార్యక్రమానికి సారథ్యం వహించారు. అందులో భాగంగా 617 వంటకాలు తయారు చేశారు. మొత్తం 190 కిలోల వివిధ రకాల ఆహార వంటకాల కోసం సరిగ్గా… 24 గంటల 30 నిమిషాల 12 సెకన్లు సమయం వంటలు వండి వ్యక్తిగత వంటగాడి విభాగంలో లాంగెస్ట్ కుకింగ్ మారథాన్ తో గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్సుకెక్కాడు.

ఒక్క రికార్డుతో ఆగిపోలేదు!

14.7 మీటర్ల పొడవైన దోసె తయారీ, ప్రపంచంలోనే అతి ఎక్కువ కూర తయారీతో కలిపి ఆయన పేరిట మొత్తం మూడు గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి.

దాము అప్పాగా టీవీ తెరపైకి!

దాము తన నలభీమపాకంతో అప్పటికే ప్రాశస్త్యం పొందినప్పటికీ… కుక్ విత్ కోమలి అనే ఓ టీవీ కార్యక్రమం దామును మరో స్థాయికి తీసుకెళ్లింది. వంటల పోటీకి కామెడీని జోడించిన ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, జడ్జ్ గా కనిపించిన దాము.. నిష్ణాతుడైన వంటగాడిగా కాకుండా పోటీదారులను ప్రోత్సహించే పెద్దమనిషిలా అందరినీ ఆకట్టుకున్నారు. అదే ఆయన అభిమానులతో ఆయన్ను దాము అప్పా అని పిలిపించుకునేలా చేసింది.

2019 నుంచి ఆయన కుక్ విత్ కోమలి టీవీ ధారావాహికంలో కనిపించారు. ఆయన చెప్పే వంట విషయాలు ఎంత ముఖ్యమో.. వాటిని అంతే సులంభంగా విడమర్చి చెప్పే తీరూ ఆకట్టుకునేది.

తమిళ వంటకాలకు గరిటెలాంటివాడు దాము!

దాముకు తమిళనాడు సంప్రదాయ వంటకాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ముఖ్యంగా చెట్టినాడ్ వంటకాలంటే ఎంతో ఇష్టం. స్వయంగా తానే మసాలాలు తయారు చేసుకోవడం, సంప్రదాయ వంటకాల రెసిపీలను సేకరించడం, వాటిని ప్రజలకు పరిచయం చేయడం ఇవన్నీ ఆయనకెంతో ఇష్టమైనవి. 17కు పైగా వంట పుస్తకాలు రాసిన దాము… క్యాటరింగ్ విద్యార్థుల కోసం కూడా పుస్తకాలు రాశారు.

లక్షలాది పిల్లలకు భోజనం ఆయన కెరీర్ లోనే ఉత్తమం!

చెఫ్ దాము జీవితంలో ఎక్కువగా చర్చకు రాని మరో ముఖ్యమైన అధ్యాయం.. తమిళనాడు ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకంతో ఆయన అనుబంధం. 2008-11 మధ్య ఆ కార్యక్రమంలో పనిచేస్తూ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో సుమారు 1 లక్షా 40 వేల మంది మధ్యాహ్న భోజన సిబ్బందికి శిక్షణనిచ్చారు. పిల్లలకు అందించే ఆహారం రుచికరంగా, నాణ్యంగా ఉండేలా వంట విధానాల్లో మార్పులను సూచించారు. ఆ కార్యక్రమం ద్వారా కోట్లాది పాఠశాల పిల్లలకు అందించే భోజనంలో వివిధ రకాల అన్నం, గుడ్డు వంటకాలను ప్రవేశపెట్టే పనిలో ఆయన భాగస్వామ్యం ఉంది.

వందల మందికి వంట చేయడం ఒక రికార్డే కావచ్చు. కానీ వేలాది మంది వంట సిబ్బందికి మంచి వంట నేర్పి, లక్షలాది మంది పిల్లలకు అందే భోజనం నాణ్యతను మెరుగుపరచడంలో భాగస్వామిగా మారి.. తన వృత్తితో సామాజికంగా తనదైన ముద్రను వేశారు.

పద్మశ్రీ. పురస్కారంతో మరింత పరిచయమైన దాము పేరు!

వంటను వృత్తిగా ఎంచుకున్నవారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కూడా దాము ప్రయాణం ప్రత్యేకమైంది. అందుకే, ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2025లో ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. వంటలు, ఆహార సంస్కృతి, విద్య, టెలివిజన్ వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన ఏళ్ల కృషికి ఆ గౌరవం దక్కింది. అప్పుడు ఆయనకు వచ్చిన గుర్తింపు కేవలం ఓ వ్యక్తికి లభించిన పురస్కారం కాదు. వంట కూడా ఓ కళే.. అందులోనూ నైపుణ్యత అవసరం.. ఆ వృత్తిది కూడా దేశ గౌరవంలో కీలకపాత్ర అని ఓ సందేశముంది.

తెరపై నవ్వుతూ కనిపించిన దాము.. ఇప్పుడు జ్ఞాపకాల్లో!

చెఫ్ దాము మరణంతో తమిళ టెలివిజన్ ఒక పరిచయమైన ముఖాన్ని కోల్పోయింది. కానీ ఆయన ప్రయాణం టీవీ తెరతో ముగియదు. వంటగదిలోని చిన్న పనుల నుంచి మొదలైన ప్రయాణం.. హోటల్ మేనేజ్‌మెంట్ విద్య, పీహెచ్‌డీ, బోధన, వంట పుస్తకాలు, టెలివిజన్, గిన్నీస్ రికార్డులు, తమిళ వంటకాల ప్రచారం, వేలాది మంది వంట సిబ్బందికి శిక్షణ.. చివరకు పద్మశ్రీ వరకు సాగింది. అందుకే చెఫ్ దాము కథ ఒక వంట మనిషి కథ మాత్రమే కాదు.. ఒక వృత్తిని ప్రేమిస్తే, అదే వృత్తి, ఆ మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలదో చెప్పే ఓ ప్రయాణం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles