రంగు పడుద్ది
……………………………………………………………………..
కట్టా శ్రీనివాస్.. ✍️
మనిషి కళ్ళు తెరచినప్పటినుంచి , వెలుతురు ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి కనిపించేవి రంగులే, రంగులు
తెల్లటి కాంతి రంగులుగా ఎలా విడిపోతుందో, ఎలా మారుతుందో చెప్పినందుకే మనకి రామన్ రూపంలో నోబెల్ ప్రైజ్ దక్కింది.

ఆదిమానవుడు గుహల గోడలపై రాళ్ళని బంకని కొవ్వులనూ అరగదీసి గీసిన రంగుబొమ్మలు చూస్తూనే సహస్రాబ్దుల క్రిందటి మన పూర్వీకుల ఆలోచనల్ని చదవ గలుగుతున్నాం.
తోళ్ళూ నారలూకట్టుకోవడం పూర్తయ్యాక బట్టలు నేయడం మొదలేసినా వాటిపై రంగులు రావడానికి చాలా కాలం పట్టింది. మొదట్లో నీలిగోరింట మొక్కల నుంచి తీసిన నీలిమందు (ఇండిగో) కోసం ప్రపంచం మనవైపు ఎంతలా చూసేదంటే ఇండియా అని అదే పేరుతో పిలిచేంత. ఆ తర్వాత కృత్రిమ నీలం తో పాటు అనేక రంగులు బట్టలకు అలముకోవడంతెో అసలా మొక్క ఎలా వుంటుందో కూడా మర్చిపోయాం మనం. మంజిష్ట వేళ్ళనుంచి ఎరుపు, పసుపు కొమ్ములు ఇంకా అదే రంగుపేరుతో వుండటం, సోంపు మొక్కల ( Fennel) నుంచి ఆకుపచ్చ, బొగ్గు, సుద్దల వంటివి రంగులుగా రాజ్యం ఏలాయి.
ప్రశాంతంగా కనిపించాలనుకున్నప్పుడు తెల్లటి బట్టలు వేసుకునే డాక్టర్లు ఆపరేషన్ టైంటో రక్తం చిందినా ఇబ్బంది లేని ఆకుపచ్చని యూనిఫాం చేసుకుంటే, కర్మికులకు ఖాకీ రంగు, మంచులో పసుపు ఫాగ్ లైట్లు అర్ధవంతమైన పనులు చేస్తుంటాయి.
కాన్వాసుల మీద రంగులు ఇప్పటికీ ఆశ్చర్యమే కళ్ళముందు కనిపించే ధృశ్యాలను కాగీతం మీదనో, క్లాత్ మీదనో చిత్రించాలనుకున్నప్పుడు నైపుణ్యం రంగుల కలయికలోనే కదా చూపిస్తుంటారు.
కోళ్ళు కొట్లాడినా వాటిని ఈకల రంగులను బట్టి కాకులనో డేగలనో పిలిచుకుంటూ సమయానికి తగు రంగులెంచి బరిలోకి దింపుతుంటాం.
అంతెందుకు మనుషులు చర్మాల రంగుల ఆధారంగా ఆధిపత్యాలను ప్రకటించుకుంటాం. కాస్తంత ఎండపడే ప్లేసుల్లో వున్నందుకు నల్లవాళ్ళుగా ఈస్టిండియాతో పిలిపించుకున్నాం.
రంగు రంగుల ఈకల తోకను విసనకర్రలా విప్పి గిరగిర తిరిగే పిట్టను జాతీయ పక్షి అంటాం. మగ నెమళ్ళకే రంగుల ఈకలుంటాయని తెలిసీ చక్కగా డాన్స్ చేసే అమ్మాయిలను నాట్యమయూరి అంటాం.
రాళ్ళు రంగుల్లో మెరసాయంటే తలమీద కూడా పెట్టుకుంటాం, బంగారంలోనో వెండిలోనో ఇమిడ్చి వేళ్ళకు తగిలించుకుంటాం. జాతకం మార్చేసేంత శక్తి రాయి అయినా దానికున్న రంగులో నింపుకునే వుంటుందని నమ్మేస్తాం.
సినిమా (వెండి) తెరల మీద నలుపు తెలుపు ఆటల నుంచి రంగులు రాగానే ఈస్టమన్ కలర్ అగ్ ఫా కలర్, ఫుజీ కలర్ అంటూ మురిసిపోయాం.
అప్పుడెప్పుడో 99లో కంప్యూటర్ ఇస్టిట్యూట్ పెట్టిన కొత్తల్లో సిఆర్ టి (కాథోడ్ రే ట్యూబ్ ) మానీటర్ల నుంచి రంగు ఎల్ సిడీ కొనుక్కొచ్చిన సంతోషం ఇంకా గుర్తుంది. రంగుల్ని బాగా చూసేందుకే ఎల్ ఈ డిల్లోల హెచ్ డి లూ ఎల్ హెచ్ డీలు, యూ హెచ్ డీ లు అంటూ మరింత మెరుగులు దిద్దుకుంటున్నాం.
మొబైల్స్ లో మాత్రం రంగు తెరలు రాగానే అప్పట్లో నోకియా ప్రతి జేపులోనూ రంగుంది అంటూ చేసిన ప్రకటనలు ఒక రేంజ్ లో హడావిడీ చెయ్యలేదా.
రక్తం ఎర్రగా వుండే జీవులతో నిండిన నేల మీదకు నీలిరంగు రక్తం వుండి సముద్రంలో వేల అడుగుల లోతునుంచి బయటికి వచ్చిన చేపను చూసి డూమ్స్ డే పిష్ వచ్చింది అప్పట్లో సునామీని ఇదే సూచించింది అంటూ ఆందోళన పడుతూనే వున్నాం కదా.
పళ్ళెంలో కూరగాయలు అన్ని రంగులవీ వుండేలా చూసుకుంటూ అన్ని పోషకాలూ అందినట్లే అనుకుంటాం. నీళ్ళ పీహెచ్చ తెలుసుకోవాలన్నా రంగు ఎలా మారిందో చూస్తాం. రోడ్డు మీద ఎర్ర రంగు చూస్తే ఆగుతాం, పచ్చరంగుకే సాగుతాం, మనల్ని శాసించే రాజకీయాలూ ఏదో ఒక రంగు కే అంటిపెట్టుకుని వుంటాయి. జాతీయ జెండా అయినా రంగులు దాని అర్ధాలతోనే ముడిపడివుంటుంది మరి.
ఈ కలరోపాఖ్యానం, రంగుల దండకం చివర్లో ముగింపుగా మీకో ప్రశ్న కలలు కలర్తోనే కంటున్నారా లేదా గుర్తురాకపోతే ఈ రోజు రాత్రి గట్టిగా అనుకుని పడుకోండి రేపు ఉదయం కామెంటు చేద్దురు గాని.
హోళీ శుభాకాంక్షలు.



