గతంలో ఒక సినిమా వంద రోజులాడితే హిట్.. అంతకుమించి ఓ షోలే, ఇంకో దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, మరో హమ్ ఆప్కే హై కౌన్ లా సంవత్సరాల తరబడి ఆడితే అదో చరిత్ర. కానీ, ఇప్పుడు ఓ సినిమా ఎంత కలెక్షన్స్ సంపాదించిందన్నదాన్ని బట్టే ఆ సినిమా విజయపు అంచనా!
పైగా ఓవర్సీస్ లో ఎంత… దేశీయ మార్కెట్ లో ఎంత… ఓటీటీలో ఎంత అనే లెక్కలూ సరేసరి.
సినిమా ఫక్తూ ఓ వ్యాపారమనుకునేవాళ్లు కొందరు. సినిమా కళా, వ్యాపారము రెండూను అనుకునేవారు మరికొందరు. సినిమాను కళగానే చూసేవారూ ఇంకొందరు. కానీ, ఇప్పుడున్న కమర్షియల్ ఫార్మూలాకు సినిమా కచ్చితంగా ఫక్తూ వ్యాపారమే అయి కూర్చుంది. అందుకే, ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సినిమాలంటూ వందల కోట్లు పెట్టి.. ఏళ్లకేళ్లు ఒకే సినిమాను తీస్తూ దానిపై అంచనాలను అంతకంతకూ పెంచే యత్నాలు జరుగుతున్నాయి.

ఆ కోవలో బాహుబలితో మొదలైన అంచనాలు త్రిబుల్ ఆర్.. ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప, సలార్, కల్కి, పుష్ప2 వంటి సినిమాలతో మరింత పెరుగుతూ సినిమా వ్యాపారాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. ఇప్పుడు బాలీవుడ్ రచయితలు, హీరోలు, దర్శకులు కూడా ఈ కమర్షియల్ సినిమా వ్యాపారంలో అందులోనూ దక్షిణాది గురించి మాట్లాడుకోవడం మరో విశేషం.
ఇంతవరకూ ఓకే. కానీ, ఒక సినిమాకు వందల కోట్లు పెడితేనే సినిమా హిట్టవుతుందా…?
ముమ్మాటికీ ఈ సూత్రమెప్పుడూ స్థిరంగా పనిచేసిన దాఖలాల్లేవు. భారీ సెట్టింగ్స్, తారాగణం, టెక్నీషియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సినిమాను భారీగా ఖర్చు పెట్టి తెరకెక్కించినా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి అనుకున్న వసూళ్లు రాని సినిమాలెన్నో. నిర్మాతలను శంకరగిరి మాన్యాలు పట్టించిన చిత్రాలెన్నెన్నో.
అదే సమయంలో కేవలం తక్కువ ఖర్చుతో తెరకెక్కించి బాక్సాఫీస్ రికార్డ్సును బద్ధలు కొట్టిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. అత్యధిక ఖర్చు చేసి గొప్పలు పోతూ చెప్పుకుంటున్న సినిమాల మధ్య… కాస్త భిన్నంగా, ఇప్పుడు మనం వాటి గురించే చెప్పుకోబోతున్నాం.
అలాంటి వాటిలో చరిత్రలో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి సక్సెస్ అయిన సినిమాల్లో ఉరి- ది సర్జికల్ స్ట్రైక్ గురించి కాస్త చెప్పుకోవాలి.
ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమనే ఓ కుదుపు కుదిపింది. కేవలం 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే… 244 కోట్ల రూపాయల రిటర్న్స్ తెచ్చిన సినిమాగా విక్కీకౌశల్ ప్రధాన పాత్ర పోషించిన ఉరి- ది సర్జికల్ స్ట్రైక్ రికార్డులకెక్కింది.
ఉరి సినిమా కంటే ముందు చిన్న బడ్జెట్ తో తెరకెక్కి గొప్ప విజయాలు సాధించిన సినిమాల్లేవా అంటే ఉన్నాయి. కానీ, ఈరోజుల్లో స్టార్ క్యాస్ట్, సెట్టింగ్స్, లొకేషన్స్ ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఉరి సినిమా బడ్జెట్ పెద్దదేమీ కాదు. కానీ, సాధించిన విజయం మాత్రం అద్భుతం. కంటెంట్ ఉంటే కటౌట్ ఎలా నిలబడుతుందో చూపిన సినిమా ఉరి- ది సర్జికల్ స్ట్రైక్.
అలాంటి చిత్రాల కోవలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా కూడా బాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. అదే జై సంతోషీ మా. కేవలం 3 లక్షల బడ్జెట్ తో నిర్మించారు జై సంతోషీ మా సినిమాని. 15 ప్రింట్స్ ను విడుదల చేసేందుకు సుమారు 5 నుంచి 6 లక్షల వరకూ ఖర్చయ్యాయి. కానీ, ఆ 15 ప్రింట్స్ తో ఆ సినిమా ఆగిపోలేదు. డిమాండ్ పెరిగింది. దాంతో 300 ప్రింట్స్ తీయాల్సి వచ్చింది. సినిమా ప్రమోషన్ నుంచి మొదలుకుంటే.. డిమాండ్ పెరిగేకొద్దీ ప్రింట్స్ తీయడానికే సినిమా నిర్మాణాన్ని మించి 15 రెట్ల ఎక్కువ బడ్జెటైంది. అయితేనేం..? డిమాండ్ ను బట్టే కదా ఆ ఖర్చు పెట్టింది. అందుకు, ఏకంగా 400 కోట్ల నికర వసూళ్లు సాధించింది జై సంతోషీ మా. ఒక చిన్న బడ్జెట్ చిత్రానికి ఇప్పటివరకూ దక్కిన అజేయమైన రికార్డుగా కూడా ఈ సినిమానే ఇప్పటివరకూ చెప్పుకోవచ్చు.
ఈ మధ్య వచ్చిన కాంతారా కూడా ఇలాంటి సంచలనమే సృష్టించింది.
ఇక నిశ్శబ్దంగా వచ్చి దుమ్మురేపిన తెలుగు సినిమాల జాబితాలో బలగం, జాతిరత్నాలు, నువ్వు, నేను వంటివెన్నో చెప్పుకోవచ్చు.
ఇలాంటి కోవలోనే హిందీలో టాప్ టెన్ లో తను వెడ్స్ మను రిటర్న్స్, బదాయి హో వంటి సినిమాలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో కూడా ఓ లుక్కేయండి.
- జై సంతోషి మా (1975) – 400 కోట్ల రూపాయల ప్లస్
- నికాహ్ (1982) – 275 కోట్లు ప్లస్
- దోస్తీ (1964) – 250 కోట్లు ప్లస్
- ఉరి – ది సర్జికల్ స్ట్రైక్ – సుమారు 244 కోట్లు ప్లస్
- ఖయామత్ సే ఖయామత్ తక్ – సుమారు 185 కోట్లు
- తను వెడ్స్ మను రిటర్న్స్ – సుమారు 165 కోట్లు
- ధర్మ (1973) – సుమారు 160 కోట్లు
- ప్రతిఘాట్ (1987) – సుమారు 150 కోట్లు
- ఆజ్ కీ ఆవాజ్ (1984) – సుమారు 145 కోట్లు
- బదాయి హో (2018) – సుమారు 140 కోట్లు
ఇదిగో తక్కువ బడ్జెట్స్ తోనూ సినిమాలను బ్లాక్ బస్టర్ చేయొచ్చని నిరూపించిన చిత్రాల జాబితా ఇది.



