Indus Martin.. ✍🏻
చాలా పనులు అందరికీ సాధారణంగానే ఉంటాయి. పొద్దున్నే లేవడం, తయారై బ్యాగ్ తీసుకుని ఉజ్జోగానికి పోవడం, ఆఫీసులో గాసిప్, బాస్ ని కాకాపట్టి మంచిచేసుకోడం, ఆయన అర్చినప్పుడు నవ్వుతూ సమాదానం చెప్పి తప్పించుకోడం…. ఇవన్నీ సాధారణ జీవితంలో అతిసామాన్య విషయాలే చాలామందికి.
కానీ అపార్ట్మెంట్లో నుండి క్రింద వెయిట్ చేస్తున్న ఊబర్ కార్ చేరుకోడానికి లిఫ్ట్ ఎక్కాలంటే ప్రాణంపోయినంత భయం కొందరికి. లిఫ్ట్ ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ కంట్రోల్ తప్పి కింద పడిపోతుందో, ఎక్కడ తలుపులు మూసుకుపోయి ఇక ఎప్పటికీ తెరుచుకోవో.. ఎక్కడ లిఫ్ట్లో ఎక్కిన అగంతకుడు దాడిచేస్తాడో…. ఇలాంటి అనేక భయాలతో లిఫ్ట్ ఎక్కడమే మానుకుని ఎనిమిదేసీ తొమ్మిదేసీ ఫ్లోర్లు ఎక్కీ దిగేవాళ్ళు మనమధ్యనే ఉన్నారు. మనం వాళ్ళను చూసి నవ్వేస్తాం. నా మిత్రుడు ఒకాయనకు టూవీలర్ ఎక్కడం అంటే విపరీతమైన భయం. కళ్ళుతిరిగి పడిపోతాడు. దానిఫలితంగా ఎంత ఖర్చైనా కారు మెయింటెయిన్ చెయ్యాల్సిన అవసరం.
ఇలాంటి ఫోబియాలతో మనచుట్టూ బ్రతికే అనేక సామాన్య జీవితాల గురించి పట్టించుకునే అవసరం, అలవాటు మనలో ఎవరికీ ఉండదు.
వీటన్నిటికీ కారణం ఏమిటీ? ఎప్పుడో జరిగిన ఒక సంఘటన మొత్తం జీవిత గమనాన్నే ప్రభావితం చేస్తుందా? ఎంతో పట్టుదలతో కనిపించే వ్యక్తులు చిన్నచిన్న విషయాలలో బేలగా మారిపోయే అవకాశం ఉందా?

ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమాకు పొయెటిక్ అప్పీల్ అద్ది 2023లో విడుదల చేస్తే వుచితంగా టికెట్ ఇచ్చినా చూడటానికి ఎవరూ థియేటర్ కి పోని సమాజం ఇది. 8AM METRO లో హీరోపాత్ర పోషించే స్మగ్లర్లు ఉండరు. కట్ చేస్తే యుక్రేన్ రాజప్రాసాదం ముందు గెంతే కాస్ట్లీ షాట్స్ ఉండవు. పాటలుంటాయి… నిద్రలో మెల్కొలిపే లిరిక్స్ తో, అలసిపోతే జోకొట్టే సంగీతంతో… కానీ పాత్రలు లిప్ సింక్ చెయ్యవు. సినిమా జరుగుతూనే ఉంటుంది, పాటలు వచ్చి పోతూనే ఉంటాయి.
హైద్రాబాద్ ను ఋతుపవనాల నేపధ్యంలో చూపించిన సినిమాలు అరుదు. హైద్రాబాద్ ఎర్నాకులం కాదు. కానీ వానొస్తే దాని అందం వేరే ఉంటుందని అందరికీ తెలుసు. తుంపరల సాంగత్యంలో మెట్రో స్టేషన్లో నిలబడి జనాలను పరికించి చూడటం ఎంతబావుంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది.
అసలు వానా – రైలూ కాంబినేషన్ అనుభవించినవాళ్ళు దాన్ని ఎన్నటికీ వదులుకోలేరు. మళ్ళీ మళ్లీ దానికోసం వెతుక్కుంటూనే ఉంటారు. దుర్గంచెరువూ-మద్రాస్ కాఫీ కాంబినేషన్ మాత్రం డ్రగ్ అడిక్షన్ లాంటిది కాదా? దగ్గరౌతున్న స్త్రీపురుష స్నేహం – గుల్జార్ కవిత్వం … ఇంతకన్నా అడిక్షన్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇవన్నీ మొదటినుండీ చివరివరకూ టచ్ చేస్తూనే ఉంటాయి ఈ సినిమాలో. అయినా జనాలకు ఎందుకు ఎక్కవూ ఇలాంటి సినిమాలూ?
ఎందుకు ఎక్కలేదో కనీసం చెప్పడానికైనా మీలాంటి ఎక్స్పర్ట్స్ చూడాల్సిన సినిమా ఇది. మల్లేశం ఫేం రాజ్ రాచకొండ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా ఇది!
Zee5 లో ఉంది… ఒక్కసారి చూడండి. సమయం వృధా అవ్వదనే గ్యారెంటీ నాది.



