రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జెడ్ ఫ్యాక్టర్ ఉంటుందా..?
యువ ఓటర్ల ఆలోచనలెలా ఉన్నాయి…? వారి గురించి మిగిలిన సమాజంలోని ఓటర్స్ ఏమనుకుంటున్నారు..?
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీల దృష్టి కూడా సమకాలీన రాజకీయాలు, వాటిని ప్రభావితం చేస్తున్న అంశాల చుట్టే తిరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు దేశంలో పేపర్ లీక్స్, ఓట్ల తొలగింపు వంటి అంశాలపై ఉద్యమాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో… జెన్ జీ ఫ్యాక్టర్ యూపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతోందన్నదానిపై కొన్ని మీడియా, సర్వే సంస్థలు ఇప్పటికే సర్వేలను ప్రారంభించాయి.
సోషల్ మీడియాలో షార్ట్స్, మీమ్స్ తో కనిపించే ఈ తరం.. ఓటు విషయంలో మాత్రం ఉద్యోగాలు, నాణ్యమైన చదువులు, సామాన్య, మధ్య తరగతికి అందాల్సిన నాణ్యమైన వైద్యం, పరీక్షలు, లీకేజీలు, ధరల పెరుగుదల వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకునేట్టుగానే సర్వే ఫలితాలు ప్రతిబింబించడమే చర్చకు కారణం.

కుల, మతాలను మించి జెన్ జీ ఫ్యాక్టర్ పనిచేస్తుందా..?
యూపీ అంటేనే సాధారణంగా కుల సమీకరణాలు, మతం, సంక్షేమ పథకాలు, శాంతిభద్రతల వంటివి ప్రధానాంశాలుగా తెరపైకొస్తాయి. కానీ, 2027 ఎన్నికల్లో మరో అంశం కూడా ప్రభావితం చేయబోతుందా.. అది జెన్ జీ ఓటేనా అన్నది చూడాల్సి ఉంది.
న్యూస్ 18 అనే సంస్థ యూపీలో ఓ మెగా సర్వే చేసింది. 56 శాతం మంది జెన్ జీ ఓటర్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపబోతున్నారనే ఫలితాలు ఇప్పుడక్కడి సంప్రదాయ ఓటు బ్యాంకునే నమ్ముకుని రాజకీయాలు చేసేవారిని ఆలోచింపజేసేవి. బీజేపీ, ఎన్డీఏ మద్దతుదారుల్లోనే ఈ అభిప్రాయం బలంగా 63.5 శాతంగా వినిపించడం మరో విశేషం. ఇక సమాజ్ వాది- కాంగ్రెస్ అలయెన్స్ మద్దతుదారులు 41.7 శాతం మంది, బహుజన్ సమాజ్ వాది పార్టీ సానుభూతిపరులు 35. 5 శాతంగా ఈ అభిప్రాయాలను వెలిబుచ్చినట్టు సదరు సర్వే సంస్థ వెల్లడించింది.
జెన్ జీ అంటే సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిగా భావిస్తున్న తరుణంలో.. ఈ మొత్తం సమూహమంతా 2027లో ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే, ఇందులో పద్దెనిమిదేళ్లు నిండనివారూ ఉంటారు గనుక.
మరి ఈతరం ఏం కోరుకుంటోంది..?
యూపీలో గూండారాజ్ తిరిగి రావొద్దనే ఒక స్పృహ కూడా అక్కడి జనంలో కనిపించిందంటోంది సర్వే సంస్థ. 33.4 శాతం మంది శాంతిభద్రతలు కోరుకుంటున్నవారిగా ఫలితాలు కనిపించాయి. అదే తమ ఓటు నిర్ణయంపై అధిక ప్రభావం చూపే ప్రధానాంశంగా వారు చెబుతున్నారు. ఇక ఉద్యోగాలు, ఉపాధిని 21.4 శాతం కోరుకుంటున్నారు. అంటే నిరుద్యోగిత ఎంత పెద్ద ప్రధాన సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ధరల పెరుగుదలపై 19.2 శాతం మంది పెదవి విరిచారు.
అయితే, 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సున్నవారిని సర్వే చేసినప్పుడు మాత్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే 26.3 శాతం మంది స్పందించడం దాని తీవ్రతను చెప్పేది.
ఎన్నికలంటే రాజకీయ నాయకులకు సిద్ధాంతాలు, నినాదాలు, వ్యక్తిగత లాభాలు, అధికార దర్పం కావచ్చుగానీ… ఓటు వేసే యువతకు చదివితే ఉద్యోగం వస్తుందా… పరీక్ష రాసిన తర్వాత ఫలితాలు వస్తాయా.. అవి పారదర్శకంగా ఉంటున్నాయా… ఉద్యోగాల కోసం పోటీ ఎలా ఉంది.. ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు ఓట్ల కాలాన చర్చకొస్తున్నాయి.
పేపర్ లీక్స్ ఎందుకు పెద్ద విషయంగా మారాయి..?
ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నపత్రాల లీకులు, నియామక ప్రక్రియలో ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. పేపర్ లీకులు, జెన్ జీ నిరసనలు కలిపి… 10.4 శాతం మంది దృష్టిలో అవి ముఖ్యమైన అంశాలుగా కూడా సర్వేల్లో నమోదవుతున్నాయి.
ఇది కేవలం ఒక ఎన్నికల అంశం కాదు. పరీక్ష కోసం సంవత్సరాల తరబడి సిద్ధమయ్యే యువకుడికి ఒక నోటిఫికేషన్, ఒక పరీక్ష, ఒక ఫలితం అంటే అతడి కెరీర్ నే మార్చే ఒక దశ. అందుకే ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకత, పరీక్షల నిర్వహణ, సమయానికి ఫలితాలు వంటి అంశాలు యువ ఓటర్లలో రాజకీయ ప్రాధాన్యంగా మారుతున్నాయి.
15 శాతం జెడ్ ఫ్యాక్టర్..?
ఆగస్ట్ లో మనీకంట్రోల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. యూపీ ఓటర్లలో జెన్ జీ వాటా సుమారు 15 శాతంగానే అంచనా. యువ ఓటర్లలో కొంత మేరకు అభిప్రాయ మార్పు కూడా కనిపించింది. అదే అనేక నియోజకవర్గాల్లో రాజకీయ లెక్కలపై ప్రభావం చూపగలదని ఆ విశ్లేషణ కూడా పేర్కొంది. అయితే, ఇవన్నీ అంచనాలు మాత్రమే. అసలు లెక్కలు ఫలితాల తర్వాతనే తేలినా… మొత్తంగా నేటి సినారియో ఎలా ఉందో అంచనాకొచ్చే ఫలితాలుగా వీటిని భావించాల్సి ఉంటుంది.
2026, ఏప్రిల్ లో ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం యూపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 13 కోట్ల 39 లక్షలు. ఇందులో పద్దెనిమేదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే 17 లక్షల 63 వేల మంది ఉన్నారు.
రాజకీయ పార్టీల వ్యూహాల్లోనూ మార్పు
యువత ప్రాధాన్యం పెరగడంతో.. రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార విధానాలను మార్చుకుంటున్నాయి. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, స్టార్టప్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా, ఏఐ కంటెంట్, మీమ్స్, షార్ట్ వీడియోలతో జెన్ జీని చేరుకునే ప్రయత్నాలూ చేస్తున్నాయి.
అయితే యువతను కేవలం సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తామంటే నడిచేలా లేదు… వారి వాస్తవ సమస్యలను నోటీస్ చేయడం.. స్పష్టమైన సమాధానం, హామీలివ్వడం కూడా రాబోయే ఎన్నికల భారతంలో మరో ప్రధానాంశంగా మారబోతోందనేది నేటి ఉద్యమాలు చెబుతున్న మాట.
2027 యూపీ ఎన్నికల ముందు జెన్ జీ గురించి జరుగుతున్న చర్చలో అసలు ఆసక్తికరమైన అంశం ఏంటంటే..?
ఇప్పటివరకు కూడా రాజకీయాల్లో యువ ఓటు అంటే పెద్ద సంఖ్యలో ఉన్న యువ జనాభా అనే అర్థం ఉండేది. ఇప్పుడు ఆ యువతలోనే డిజిటల్‌గా చురుకైన, ప్రశ్నించే, సమాచారం కోసం అనేక వనరులను ఉపయోగించే జెన్ జీ అనే ప్రత్యేక ఒక జాగృత వర్గం కూడా కనిపిస్తోంది. వారు ఏ పార్టీ వైపు వెళ్తారన్నది తేలాలంటే… వారు ఏ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కోరుతున్నారో వాటిని ఆయా పార్టీలు అర్థం చేసుకుని సమాధానపర్చాల్సి ఉంది.


