అలల మధ్య భరతనాట్యం: సంద్రాన్నే కళావేదిక చేసిన ఓషన్ ఆర్టిస్ట్.. కేర్కర్!

సంద్రాన్నే కళావేదిక చేశాడు… అలలపై నవరసాలు పలికించాడు!

గంభీరమైన సముద్రాన్ని క్యాన్వాస్ గా మారిస్తే ఎలా ఉంటుంది..? ఎగిసిపడే అలల సౌందర్యాన్నే కళావేదికగా మారిస్తే ఎలా ఉంటుంది..? ఇలాంటి ఆలోచనలే ఓ డాక్టర్ ను కళాకారుడిగా మార్చేశాయి. అందుకు గోవా మోర్జిమ్ బీచ్ వేదికైంది.

భరతనాట్యంతో అక్కడి సంద్రపు అలలకు నవరసాలు నేర్పిన ఆ కళాకారుడే డాక్టర్ సుబోధ్ కేర్కర్.

సముద్రం చాలామందికి జీవనాధారాం. మత్స్యకారులు, పర్యాటకులతో సంపాదించుకునే బోట్లు, స్టీమర్స్ నడిపేవారు, ఒడ్డునే హోటల్స్, స్టాల్స్ పెట్టుకుని బతికేవారు, వచ్చే టూరిస్టులను ఫోటోలు తీస్తూ, పెయింటింగ్స్ గీస్తూ బతికేవారు.. ఇలా సముద్రం ఎందరికో ఓ ఉపాధి మార్గం.

కానీ, గోవాకు చెందిన డాక్టర్ సుబోధ్ కేర్కర్ కు మాత్రం సముద్రం ఓ కళావేదిక. ఒకప్పుడు వైద్యుడిగా పనిచేసిన ఆయన… తర్వాత వైద్య వృత్తినే వదిలేసి సముద్రంతో ప్రేమలో పడ్డాడు. తన కళకు గురువుగా, క్యాన్వాస్ గా ఆ సంద్రాన్నే ఎంచుకున్నాడు. తన కళా ప్రస్థానంలో భరతనాట్య కళాకారులు, మత్స్యకారులు, ఇసుక తిన్నెలు, సముద్రపు గవ్వలు, ప్లాస్టిక్ వ్యర్థాలు.. అన్నీ భాగమయ్యాయి.

కళాకారుడిగా అవతారమెత్తిన వైద్యుడు!

సుబోధ్ కేర్కర్ 1959లో… భారతదేశంలో యువత స్వర్గంలా భావించే గోవాలో తొలి శ్వాస తీసుకున్నాడు. చిన్నప్పట్నుంచీ కళలంటే మక్కువ. తండ్రి చంద్రకాంత్ కేర్కర్ కూడా కళాకారుడే. చిన్నతనంలోనే తండ్రి వెంట సముద్ర తీరంలో నడుస్తూ గడిపిన సమయం ఆయనపై బలమైన ప్రభావాన్ని చూపింది. అదే ఆయన్ను సముద్రంతో ప్రేమలో పడేసింది.

గోవా మెడికల్ కళాశాలలో వైద్య విద్య చదివిన కేర్కర్… డాక్టర్ గా పనిచేశారు. కొన్నేళ్లపాటు ప్రభుత్వాసుపత్రిలో పనిచేయడంతో పాటు.. ప్రైవేట్ ప్రాక్టీసూ చేసేవారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఆయన పనిచేయడం వల్ల.. వారి జీవితాలతో పాటే… వారి జీవితాలతో అల్లుకున్న సముద్రంతోనూ ఆయనకు అనుబంధం మరింత పెరిగింది. దాంతో 1990లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు కేర్కర్. వైద్య వృత్తిని పూర్తిగా వదిలేసి.. కళనే తన జీవితంగా ఎంచుకున్నారు.

సంద్రంతో ముడిపడ్డ పెయింటర్ సృజనాత్మకత!

సుబోధ్ కేర్కర్ ఓ పెయింటర్. మొదట్లో సంద్రాన్ని వివిధ రకాలుగా తన క్యాన్వాస్ పై చిత్రీకరించేవాడు. తన చిత్రాల్లో మత్స్యకారులకూ పెద్ద చోటుండేది. ఆ తర్వాత పడవల రూపంలో శిల్పాలు చేయడం మొదలెట్టారు. సముద్రపు గవ్వలతో ఇన్ స్టాలేషన్స్ చేశారు. అంటే, అప్పటికే ఉన్న సముద్రాన్ని ఇంకింత అందంగా పర్యాటకులను అటువైపు రప్పించే విధంగా తీర్చిదిద్దేవాడు. ఇసుకలో ఆకృతులను సృష్టించాడు. మత్స్యకారులతో ఉన్న స్నేహంతో తన కళలో క్యాన్వాస్ పైనే కాదు.. తన పనిలోనూ వారిని భాగస్వాములను చేశారు.

అలా సుబోధ్ కేర్కర్ కళ ఏ మ్యూజియాలకో, ఆర్ట్ గ్యాలరీలకో మాత్రమే పరిమితం కాకుండా… గోవాలోని మోర్జిమ్ బీచునే ఓ వేదికగా మార్చుకుంది. అలా కేర్కర్ ఓషియన్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించారు.

సముద్రమంటే కేర్కర్ దృష్టిలో!

బయట కనిపించే సముద్రమే కాదు.. తన లోపల కూడా ఓ సముద్రముందంటాడు కేర్కర్. కానీ, తన గురువు మాత్రం సంద్రమేనంటాడు. సముద్రమంటే ప్రకృతే కాదు.. నాగరికతలను నిర్మించిన ఓ శక్తి అన్నది సుబోధ్ అభిప్రాయం.

నవరసాల బీచుగా మోర్జిమ్!

సుబోధ్ ఆలోచనల్లోని ప్రయోగాల్లో ఒకటి నవరసాస్. సాధారణంగా భరతనాట్యమంటే ఓ పెద్ద వేదిక, దాని వెనుక థిల్లానాలు పాడే విద్వాంసులు, కళాకారులు, వెలుగు, జిలుగుల్లో డ్యాన్స్ బ్యాలేలు చూసే ప్రేక్షకులే గుర్తుకొస్తారు. కానీ, కేర్కర్ ఆ వేదికను మార్చేశారు. సంద్రపు ఒడ్డున ఇసుక తిన్నెలనే భరతనాట్యానికి వేదిక చేశాడు. సుమారు 40 మంది భరతనాట్యం కళాకారులతో కలిసి ఆయన రూపొందించిన నృత్య రూపకానికి అనూహ్యమైన ఆదరణ దక్కింది. సంప్రదాయ వస్త్రాల్లో భరతనాట్య కళాకారిణులంతా అలలతో పాటే కదులుతుంటే… ఆ నృత్య భంగిమలు, ఇసుక, సంద్రపు అలలు ఇలా అవన్నీ ఒకే ఫ్రేములో మిళితమైన ఆ చిత్రం ఓ దృశ్యకావ్యమైంది.

భరతనాట్యంలో నవరసాలు అంటే తొమ్మిది భావాలు. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం ఇలాంటి భావాలన్నీ ముఖ కవళికలు, హస్తముద్రలు, శరీర కదలికల ద్వారా సాధారణంగా నాట్యకారులు వ్యక్తీకరిస్తారు. కానీ, కేర్కర్ ఆ భావాలకు మరో నేపథ్యాన్నిచ్చారు. అక్కడికి నాట్యానికొచ్చేవారి ముందు వేదిక లేదు. సముద్రముంది. బ్యాక్ డ్రాప్ లేదు. అలలున్నాయి. కృత్రిమ లైటింగ్ లేదు. సహజమైన వెలుతురుంది. అలాంటి చోట ఇసుక తిన్నెలనే వేదిక చేసి.. భరతనాట్యంలోని భావాలను.. ప్రకృతిలోని కదలకలతో మిళితం చేశాడు.

నవరసాల నృత్య రూపకం కేర్కర్ కు కొత్త ప్రయోగమేం కాదు!

అసలు మోర్జిమ్ బీచులో నవరసాసాలను అర్థం చేసుకోవాలంటే కేర్కర్ గత కాలపు కళా ప్రయోగాల గురించీ ఓసారి తెలుసుకోవాలి.

2019లో అదే గోవాలోని మోర్జిమ్ బీచును వేదిక చేసి… సుమారు నలభై మంది మత్స్యకారులతో ది వేవ్ అనే పెర్ఫార్మెన్స్ ఆర్ట్ వర్క్ కు ప్రాణం పోశాడు. మత్స్యకారులంతా ఒకరికొకరు చేతులు పట్టుకుని.. అలల కదలికలను అనుకరిస్తూ ముందుకు, వెనక్కి కదిలే ఆ దృశ్యాలను డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరించాడు.

అలాగే సముద్ర కాలుష్యంపైనా కళారూపంలోనే అవగాహన కల్పించాడు. అందుకు కార్పెట్ ఆఫ్ జాయ్ పేరిట… 15 లక్షలకు పైగా విసిరేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి భారీ ఇన్స్టాలేషన్ రూపొందించాడు. ఆ ప్రాజెక్టును గోవాకు వెళ్లిన పర్యాటకులు సుమారు రెండు లక్షల మంది సందర్శించినట్టు గోవా యూనివర్సిటీ ప్రొఫైల్ పేర్కొంటోంది. 2024లో నెదర్లాండ్స్ లోనూ ఓషియానిక్ పేరిట పెర్ఫార్మెన్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు కేర్కర్.

అలా ఓ వైద్యుడి జీవితంలోకి వచ్చిన సముద్రం… ఆయన కళా ప్రయాణానికే ఓ కేంద్ర బిందువుగా మారింది.

కళకు గ్యాలరీలవసరం లేదని నిరూపించాడు!

ఇదే సుబోధ్ కేర్కర్ ప్రత్యేకత. కళను గ్యాలరీల్లోనో, మ్యూజియాల్లోనూ మాత్రమే చూడవచ్చనే భావనకు భిన్నంగా ఓ సముద్రాన్నే తన కళా జీవితానికి వేదిక చేశాడు. ఓ బీచ్ ఆర్ట్ గ్యాలరీ కావచ్చు. కళా వేదిక కావచ్చు. అక్కడి ఇసుక క్యాన్వాస్ కావచ్చు. మత్స్యకారుడే తోటి కళాకారుడు కావచ్చు. నృత్యకారుడి కదలికలు ఓ ఇన్స్టాలేషన్ కావచ్చు. అందుకే, కేర్కర్ కళ అందమైన దృశ్యకావ్యాల్లానే కాదు… ప్రకృతి, సముద్రం, చరిత్ర, పర్యావరణం, మానవ జీవితం, సామాజిక, రాజకీయ అంశాల చుట్టూ కూడా తిరిగి ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించిపెట్టింది.

తన బాల్యంలో తండ్రితో కలిసి నడిచిన సముద్రతీరం… తర్వాత డాక్టర్‌గా కలిసిన మత్స్యకారుల జీవితం… ఆ తర్వాత కళాకారుడిగా చూసిన సముద్రం…ఇలా, ఈ మూడు కలిసి, ఆయన కళా ప్రపంచాన్ని సరికొత్తగా నిర్మించాయి.

ఇప్పుడు ఆయన గోవాలోని మ్యూజియం ఆఫ్ గోవా వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. సమకాలీన కళను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఓ డాక్టర్ తన వైద్య వృత్తికి స్వస్తి పలికి సముద్రాన్నే ప్రయోగశాలగా మార్చాడు. అదే ఆయనకు ఓ అధ్యయన పుస్తకమైంది. ఓ ప్రయోగశాలగా మారింది. ఓ వేదికను కల్పించింది.

అలా గోవా మోర్జిమ్ బీచును భరతనాట్య కళాకారుల నృత్యాలతోనూ, ఇతర తన కళారూపాలతోనూ… ప్రకృతి, సంప్రదాయం, సముద్రం మూడింటి మిళితంగా ఓ కళాఖండంలా మార్చారు సుబోధ్ కేర్కర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles