చింతపలుక్కాయంటె పోరికి బవుపీర్తి.
కండ్లవడితెజాలు పానం ఇడుచుకుంటది…

ఇష్టమైన వస్తువు గురించి మనిషి గురించి
మనిషి ప్రాణం విడుచుకునుడు నిజమేనా మరి.. ?
నిజమేనా అంటే, వెనుకటిసంది మస్తు కథలున్నయి.
దాంట్లకెల్లి, ఓ కథ చెప్త. ఈ కథ.. వంకాయశాకం కథ.
అనంగనంగ ఓ ఊరు. ఆ వూర్ల ఇద్దరు అత్తగోడండ్లు.
మొగోళ్లు దేశాంత్రం బోతే, ఈళ్లిద్దరు ఇంటికాడుంటరు.
ఇరుగుపొరుగు ఇల్లమల్లి-అత్తకోడలు అల్లిబిల్లి అని
మొదట్లనైతె ఇద్దరు కలిసిమెలిసి ముద్దుగనే ఉందురు.
కని, చుట్టుపక్కలోళ్లకు గిట్లుంటె మనసునవడుతదా,
అత్తను అమ్ముకొమ్మని-కోడలును కొలుచుకొమ్మన్నట్టు
లేనికాడ అరికెలువట్టిచ్చి కొత్తకొత్త కొట్లాటలు పుట్టిచ్చిరి.
ఇగ,అత్తకు కోడలుకు గోరుకొయ్యలు మూలచుక్క లెక్కనె.
అత్తకుకోడలుకు ఇద్దరికి ఇష్టమయ్యే ముచ్చట్లు కొన్నుంటైగద.
అసొంటి ముచ్చట్లల్ల వంకాయశాకం ఒక్కటి. ఇది ఇద్దరికి పీర్తి.
ఈ కూరవండుకున్ననాడయితె, తల్లిబిడ్డల తీరుగనేవుంటరు.
ఇదిట్లుండంగ కొడుకువచ్చిపొయినంక కోడలుకు నెలదప్పింది.
మనుమడు పుడుతడంటె ఎంత శంకిణి కయినగని కొట్టుకోదా,
కోడలుకు బాగ ఇష్టమని, అత్త మనుసువెట్టి వంకాయ వండింది.
దంటకు పచ్చిమిర్పకాయలు కాల్చిపిసికి పచ్చిపులుసు చేసింది.
వంటలయినంక, ఓ పిల్లా నేను నీళ్లకు వొయ్యస్త. పైలం అని చెప్పి
బిందెవట్టుకోని వాగుకు పోయింది. అప్పటికే వంకాయకూర మీద
కోడలు మనుసు లిపలిప కొట్టుకుంటంది. అత్తకు వంకాయ ఇష్టం.
తనెంత తింటదో, నాకెంత పెడుతదో, ఒకటిరెండు తొడిమెలన్నా
తింటె మంచిగుంటది. ఆమె ఏమన్న ముక్కలు లెక్కవెట్టుకున్నదా
అని ధైర్యంజేసిన కోడలు, ఆ దర్వాజ ఈ దర్వాజ కలెజూసుకోని
కొద్దిగ భయంభయంగనే సాయమాన్ల ఉన్న ఉట్టికాడికి చేరుకుంది.
ఉట్టిమీది కూరకంచుడు మూతదీసి లోపలికి తొంగిచూసుడు తోటె
ఓ పిల్లా, ఇంట్ల అత్తలేని సందుజూసి ఏంజేత్తన్నవే ? అనుడుతోటే
పాపం ఈ పొల్ల గజ్జన వణికి మర్లిచూసింది.కడుపుతోటి ఉన్నోళ్లు
ఉన్నకాడ ఉండరట. ఎక్కడేమి లేకుంటె ముక్కులున్న పక్కుదీసి
అటీటుజూసి నోట్టేసుకుంటరట, ఇగరా నీకో ముచ్చట చెప్పేదుంది
అని గోడమీదికెల్లి పక్కపొంటామె పిల్చింది. కర్మ గిట్లగాలింది గదా
అనుకుంట కోడలుపిల్ల, పిల్లివట్టిన కోడిపిల్లలెక్క గోడకాడికిజేరింది.
మనది మంగళారం మందిది సోమారమని పక్కింటామె రికాముగ
ముచ్చట ముందటేసె వరకు ఎంతసేపు గడిచిందో తెల్వకనే పాయె.
ఈ లోపట వాగుకువొయి వచ్చిన అత్త, నీళ్లబిందెను దొంతులమీద
పెట్టి, ఉట్టిదిక్కుజూసెటాలకు మూత సగం దెరిచి సగం మూసున్నది.
ఈ పోరిమొకం అంగడివోను, దీనికి గీ మూతగుడ సరిగవెట్టుర్రాదు,
అనుకుంట దన్నదన్నచ్చి, కంచుడుమీది తెరిచినమూత మూసింది.
ఇక్కడ ఇట్ల కంచుడు మీద మూత మూసిందో లేదొ అక్కడ గోడకాడ
ముచ్చట ఇంటున్న కోడలు ఘుబిల్లుమని కింద కూలవడివోయింది.
అయ్యో అయ్యో అని అత్త,నెత్తినోరు కొట్టుకుంట మొత్తుకుంటాంటె
వాళ్లువీళ్లు జమయి, పిల్ల చెయివట్టి ధాతు చూసిండ్రు.ఏం ఆశలేదు
ధాతు కొట్టుకుంట లేదు. కంట్లె పాప ఆడుత లేదు. పెద్దపానం సుత
పొయిందని తెల్సినవాళ్లు తేల్చిచెప్పిరి. కాగలకార్యం ఆయె పాయే.
వీని గుల్లె అయిదు దోసిళ్ల మన్నెత్తి పొయ్య, పొట్టతోటి ఉన్న పొల్లను
పాపకారిదేవుడు ఎట్లదీసుకపాయెనని అందరు వలవల వలపోసిరి.
మాపటికి చస్తే – రేపటికి రెండు అని.. ఈ భూమ్మీద ఏది ఆగుతదని
ఇది ఆగుతది గనుక. పొల్లకు ఒడిబియ్యం బోసిండ్రు. పాడెగట్టిండ్రు.
మంగళారంనాడు చచ్చిపాయెనని, కర్రెకోడినిదెచ్చి పాడెకు కట్టిండ్రు.
ఆడివిల్లలు లేని అత్త, కర్రెకోడికంటె ఎక్కువ లబలబ కొట్టుకుంటంది.
ఊరుదాటి ఏరుదాటి దింపుడు కల్లం కాడ,పాడెదించి కిందవెట్టిండ్రు.
ఓ నర్సమ్మా! పొయ్యింది మల్లత్తదా,వచ్చేకాడికి పోయింద,జెరాగూ
కొద్దిగ తామూలు చేస్కో, తొలుసూరు కడుపుతోటి ఉన్న పొల్లాయె,
దాని కుతి దేనిమీదున్నదో ఏమో, ఇంట్ల ఏమన్న తినుటానికున్నదా
ఆఖరుసారి తెచ్చి నాలికెమీద పెట్టి, చెవుల్ల ఓసారి గట్టిగ పిలువు..
అని అమ్మలక్కలు అసలు ముచ్చటకు ముందుకు వచ్చిరి. అత్తకు
లటుక్కున ఉట్టిమీది వంకాయశాకం యాదికి వచ్చి, ఎవల్లన్న పొయి
సాయమాన్ల ఉట్టిమీద వంకాయకూరున్నది, తేపోండ్రి మీ బాంచెను,
ఎడ్డిమొకపు పోరికి వంకాయ కూరంటె ఎక్కడలేని భమరా దేవుడా
నువ్వెంత పాపపు పనిజేత్తివిరా దేవుడా, అని మల్ల శోకం బెట్టింది.
ఈ లోపల ఎవలో ఓ పిలగాడు సైకిలేసుకోని ఇంటికి ఉరుకనే ఉరికె.
ధనధన సాయమాన్లకు పొయి వంకాయకంచుడు మూత తీసిండు.
ఆడ కూరమీది మూత తీసుడు – ఈడ పాడెమీది కోడలు లేసుడు
అంత క్షణంలనే మాయలెక్క జరిగిపోయింది. ఇదీ.. వంకాయ కథ.
పానం ఇడుచుకునుడు, పానం ఇడుచుకునుడు అంటే ఇట్లుంటది.
అత్త మూతవెట్టే ఘడియకు కోడలుపానం ఆ అటికెలనే ఉన్నదాయె
మూతపెట్టీ పెట్టుడుతోటే, ఆ పానం అండ్లనే ఇరుక్క పోయింది గద.
మల్ల ఈ పిలగాడు పొయి మూత తియ్యంగనే, పానం బయటవడే.
ఇదిగదా పానం ఇడుసుకునుడు, పెద్దలసుద్దులు.. ఇట్లుంటయుల్లా.
ఇవి.. మన కథలూ – మన కయిత్కాలూ !
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి.. ✍🏻 (కరీంనగర్ ఉమెన్స్ కళాశాల, అసోసియేట్ ప్రొఫెసర్)



