Arunank Latha…. ✍️
షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశంతో అందరికీ తెలిసిన మంద కృష్ణ మాదిగ, తన సంస్థ ఎజెండా అయిన వర్గీకరణ అనే అంశాన్ని అనేకసార్లు పక్కనబెట్టాడు. వృద్ధుల, వికలాంగుల పింఛన్‌ల పెంపుకోసం చేసిన పోరాటం అయితేనేమి, గుండె జబ్బు పిల్లలకు ప్రభుత్వమే వైద్యం చేయాలని చేసిన పోరాటమైతేనేమీ, తెలంగాణ జిందా తిలస్మత్ రోజుల్లో గీతారెడ్డి (కులానికి మాల)కి కర్రు కాల్చి వాత పెట్టాలని కోదండరాం అంటే మొత్తం తెలంగాణకు ఉద్యమానికి నాయకుడు అనుకునే ఆయనతోనే (కోదండరాం తోనే) క్షమాపణ చెప్పించడం అయితేనేమీ ఇవన్నీ తన సంస్థ మొదలైన ఆశయానికి భిన్నమైన అంశాలు. ఇవేవీ కేవలం మాదిగల కోసమే చేసినవి కావు.

“కృష్ణ ఆ రోజు గుండె జబ్బు పిల్లలకోసం పోరాటం చేయకపోతే ఆరోగ్య శ్రీ అనే ఆలోచన వచ్చేది కాదు” అని అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డే ఒప్పుకున్నాడు.
తెలంగాణ ఉద్యమ కాలంలో చెరుకు సుధాకర్ మీద పీడీ యాక్ట్ పెడితే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ దండోరానే సభలు పెట్టింది. విమలక్కగా అందరికీ తెలిసిన అరుణోదయ విమలను జైల్లో పెట్టినప్పుడు సభలు దండోరా నిర్వహించింది. మిగతా కులాలతోనూ, హక్కుల సంఘాలతోనూ కలసి నడవడం ద్వారా వర్గీకరణ అనే ప్రజాస్వామిక అంశానికి మద్దతు విశాల సమూహాల మద్దతు కూడగట్టగలిగింది.
ఆర్బీఐ అంబేద్కర్ బ్రెయిన్ చైల్డ్ అయినా, ఎనిమిది గంటల పని దినం ఆయనే ఈ దేశంలో ప్రవేశపెట్టినా ఆయన్ను ఎట్లా రాజ్యాంగానికి పరిమితం చేశారో, ఇన్ని సామాజిక పోరాటాలు చేసిన కృష్ణను కేవలం వర్గీకరణకు కుదించారు. ఈ పోలిక కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చనంత మాత్రానా సత్యం కాకుండా పోదు కదా!
పద్మశ్రీ అనే అవార్డు పట్ల, అది ఇచ్చే ప్రభుత్వాల పట్ల నాకుండే అభిప్రాయాలు ఏవైనా విశాల సమూహాన్ని కూడగట్టిన కడగొట్టు మనిషికి వచ్చినప్పుడు ఆహ్వానించకుండా ఉండలేను. He deserves this award much before. Congratulations Dear Krishna Madiga 💐
Ps: మంద కృష్ణను బీజేపీ నుండి బయటకు లాగేది వర్గీకరణ అమలు మాత్రమే. ఈవీ చిన్నయ్య కేసును వ్యతిరేకించిన కాంగ్రెస్ దానిపై పంజాబ్ ప్రభుత్వం తరఫున పిటిషన్ వేసింది. కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ లాంటి కాంగ్రెస్ స్టాల్ వార్ట్ లాయర్లు వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించారు. “మొదట అమలు చేసేది మేమే” అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాడు. అయినా, అమలు చేయకుండా జాప్యం చేస్తూ కృష్ణను అనివార్యంగా బీజేపీ వైపు నెడుతున్నారు.
మాదిగలకే ఎక్కువ అవకాశాలు వచ్చాయి అనే ఒక వాదన ఈ మధ్య మొదలైంది. ఎక్కువ అవకాశాలు పొందే మాదిగల నుండి మిగతా కులాలకు వాటా దక్కాలన్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేగా!? ఈ లాజిక్ ఎందుకో మర్చిపోతున్నారు.



