#ullozhukku
…………………………………………………….
డా. పుల్లూరి సంపత్ రావు.. ✍🏻
ఉళ్ళోడుక్కు(ullozhukku) సినిమా పరిచయం

ఇద్దరు స్త్రీ మూర్తుల చిత్తడైన అంతరంగ అల్లకల్లోలాన్ని కట్టుదిట్టంగా చిత్రించిన మలయాళ సినిమా ఉళ్ళోడుక్కు. ఇంగ్లీష్ లో దీనికి ‘అండర్ కరెంట్’ అనే అర్థం చెప్తున్నారు. అయితే దీన్ని ‘ఇన్నర్ కరెంట్’ అంటే బాగుంటుందని కథానాయిక పార్వతి తిరువోత్తు అంటున్నారు.
సినిమా సమీక్షకుల ప్రశంశలు అందుకుంటున్న చాలా సినిమాలలో కథా, కథనం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా మలయాళ సినిమాలలో మనదాక చేరిన అనేక సినిమాలు ఈ కోవకు చెందినవే. ఉళ్ళోడుక్కు కథ రాసుకుని దర్శకత్వం చేసింది 36 ఏళ్ల క్రిస్టోటోమి. ఇతను కలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఉళ్ళోడుక్కు స్క్రీన్ ప్లే 2018 లో సినిస్తాన్ ఇండియాస్ స్టోరీ టెల్లర్స్ కాంటెస్ట్ లో గెలుపొందింది. ఇది అతని మొదటి సినిమా.
వరదల కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు ఆలస్యం కావడం, ఆ సమయంలో కుటుంబ సభ్యుల మద్య దాగి ఉన్న రహస్యాలు బయటపడి ఎలాంటి పరిణామాలకు దారితీసాయో, అంతిమంగా వాళ్ళు ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారో బహిర్గతం చేసిన సినిమా ఉళ్ళోడుక్కు. 2005లో కేరళలో వచ్చిన వరదల కారణంగా అంత్యక్రియలు ఆలస్యమవడం తన కుటుంబంలోనే జరిగిందని, అయితే అసలు కథ మాత్రం రాసుకున్నదని దర్శకులు చెప్పారు.
అంజు అనే క్రిస్టియన్ సేల్స్ గర్ల్ రాజీవ్ అనే చిన్నా చితకా పనులు చేసుకునే హిందూ అబ్బాయి ప్రేమించుకుంటారు. పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యం ఇచ్చే అంజు పేరెంట్స్ లీలమ్మ కుమారుడు థామస్ కుట్టి తో అంజు పెళ్లి చేస్తారు. అయితే ఆ అబ్బాయికి అనారోగ్యం. అది తెలిసి పాత ప్రియునితో సంబంధం కొనసాగిస్తుంది అంజు. ఈ లోగా అంజు గర్భవతి అవడం, థామస్ కుట్టి చనిపోవడం జరుగుతుంది. వర్షాలు, వరదల కారణంగా అంత్యక్రియలు ఆలస్యం అవుతాయి. క్రమంగా లీలమ్మ దాచిన వాస్తవాలు, అంజు దాచిన వాస్తవాలు బయటపడుతాయి.

పైకి కథ సరళంగా అనిపించినా లోపలికి వెళితే కఠిన వాస్తవాలు ఉంటాయి. ఎవరికి వారు తాము చేసిందే సరైంది అనుకుంటారు గానీ తరచి చూస్తే తత్వం బోధపడుతుంది.
ఒంటరి పాత్రలు. ఏకాకి జీవితాలు, దాచిన రహస్యాలు సినిమాలో కనిపిస్తాయి. అన్ని పాత్రలు ఏదో ఒక బయటికి చెప్పుకోలేని బాధను మోస్తాయి. అయితే అవి పొరలు పొరలుగా వాస్తవాలు బయటికి వస్తాయి.
మనసు కలచివేసే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. షేక్స్పియర్ డ్రామాలలో ఉండే కర్కశత్వం ఉంది. ఇంట్లో అంతిమ సంస్కారం కోసం ఎదురుచూస్తున్న శవం, అప్పుడే కడుపులో ఊపిరి పోసుకున్న ప్రాణం కూడా పాత్రలుగా ఉంటాయి. ఓ గడియారం, జంట తబలాలు, ఊయల, నవజాత శిశువు కోసం అల్లికలతో కుట్టిన డ్రెస్, బంగారు గొలుసు వంటివి ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. లీలమ్మ – అంజుల మధ్య వచ్చే సన్నివేశాలలో ఇద్దరి చూపులు, మౌనం, కరెంట్ పోవడం వంటివి సంభాషణలకు మించిన భావాలను వ్యక్తం చేశాయి. చివరి సన్నివేశం ఊహించినదే అయినా దర్శకులు వాస్తవానికి ప్రాధాన్యం ఇచ్చారు.
కొడుకును కోల్పోయి కోడల్ని, పుట్టబోయే బిడ్డను తనవద్దే ఉంచుకోవాలని తపనపడే లీలమ్మ పాత్రలో ఊర్వశి అసమాన నటన ప్రదర్శించారు. భర్త అంత్య క్రియలు కాగానే ఆ ఇంటిని వదిలిపెట్టి ప్రియునితో వెళ్లిపోవాలనే అంజు పాత్రలో పార్వతి బాగా చేశారు. ఆమె నటన ఉయరే, ఎన్ను నింటే మొయిదీన్, టేక్ ఆఫ్ వంటి సినిమాలలో కూడా ప్రశంసలు అందుకున్నది. తన సమకాలీకుల్లో ఆమె సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. షెహనాజ్ జలాల్ ఫోటోగ్రఫీ బాగుంది. మనం కూడా మోకాలు లోతు నీళ్ళలో ఉన్నామన్న భావన కలుగుతుంది. వర్షం, ఇళ్లలోకి నీళ్ళు రావడం, పడవలో ప్రయాణం, వర్షాకాలపు ఇబ్బందులు, ఒంటరిగా ఎక్కడో విసిరేసినట్టు ఉండే కుట్టనాడ్ ప్రాంతంలోని బ్యాక్ వాటర్స్ మెస్మరైజ్ చేస్తాయి. సుశాన్ శ్యామ్ హృద్యమైన సంగీతం కథను ఎలివేట్ చేసింది. రోగిష్టి భర్త పాత్రలో ప్రశాంత్ మురళి, ప్రియుని పాత్రలో అర్జున్ రాధాకృష్ణన్ చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించారు. కిరణ్ దాస్ ఎడిటింగ్ కథనాన్ని సంక్షిప్తం చేసింది. సినిమా మొదటి సన్నివేశం ఇద్దరి మద్య ప్రేమను చూపించి రెండవ సన్నివేశంలో మరో అబ్బాయితో అమ్మాయి పెళ్ళయి పడవలో వెళ్ళిపోవడం చూపిస్తారు. అంత క్రిస్పి ఎడిటింగ్.
“పనీ పాట లేని ఓ హిందూ అబ్బాయితో బతకాలని కలలు కనకు” అని అంజు తండ్రి చెప్పే డైలాగ్ క్రైస్తవేత్తరులకు కొత్తగా అనిపిస్తుంది. అంజు డ్రీమ్ సీన్ అనవసరం అనిపించింది. ఏదో ఒక విభాగంలో ఈ సినిమాకు అవార్డు రావడం ఖాయం.
21 జూన్ 2024 న విడుదలైన ఈ సినిమా Amazon primeలో మలయాళంలో ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో ఉంది.



