ఆమె పేరు నామ్కీ… టిబెట్ లోని చారో ఊళ్లో తన సొంత ఇంటిని వదిలి… తన అత్త సెరింగ్ తో కలిసి సరిగ్గా ఏడాది క్రితం పారిపోయి వచ్చింది. పగలూ, రాత్రీ అత్తా, కోడళ్లిద్దరూ కలిసి శ్రమించి.. మొత్తానికి నేపాల్ బార్డర్స్ దాటి.. ఇండియాకు చేరుకున్నారు. ఎందుకు నామ్కీ మరి సొంత దేశం వదిలి ఇండియాకు చేరుకుంది..?

ఎందుకు తమ సొంత దేశాన్నే వదిలాల్సొచ్చింది..?
టిబెట్ లో తమ మతపరమైన ఆచారాలపై ఆంక్షలను నిరసిస్తూ చాలామందితో కలిసి.. నామ్కీ, ఆమె సోదరి ఇద్దరూ నిరసనల్లో పాల్గొన్నారు. అప్పుడు నామ్కీ వయస్సు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అదిగో అప్పుడు ఆమెతో పాటు, ఆమె సోదరినీ వేర్పాటువాదులనే ముద్రతో చైనా సైనికదళాలు అదుపులోకి తీసుకున్నాయి. టిబెట్ పేరుకు ప్రత్యేక దేశమే అయినా.. అక్కడంతా సాగేది చైనా రాజ్యంగమే. అక్కడా చైనా దళాలదే ఆధిపత్యం. దలైలామా పాలనకు చరమగీతం పాడాక.. ఆ ఊసెత్తేవాళ్లన్నా అక్కడి దళాలు కఠిన శిక్షలు అమలు చేస్తుంటాయి.
మానవీయకోణంలో ఆలోచించే తత్వమే కనిపించని నరరూప రాక్షసులు చైనా దళాలంటోంది నామ్కీ. టిబెట్ లో ఏడాది కాలం తాము జైల్లో నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి బాధలనుభవించామో ఈ ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికే ఇప్పుడు నోరు విప్పుతున్నామంటోంది నామ్కీ. అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణం. యూనిఫామ్స్ లో ఉండి కూడా చైనా దళాలు తమను శారీరక వేధింపులకు గురిచేశాయి. ప్రపంచంలోనే ఎత్తైన మంచుకొండల్లా.. టాప్ ఆఫ్ ద హిల్స్ గా చెప్పుకునే చోట.. కనీసం దుప్పట్లు కూడా లేకుండా సన్నని బట్టలు కప్పుకుని ఆ గడ్డ కట్టే చలికి వణికిపోయాం. అయితే, ఏడాది తర్వాత నన్నూ, నా సోదరిని విడిచిపెట్టినా.. బెదిరింపులతో కూడిన షరతులతో మా బతుకుకు ఒక భరోసా కనిపించకుండా పోయిందని ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో నామ్కీ వెల్లడించింది.
దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని… దలై వర్గానికి మద్దతిస్తున్నామన్న ఆరోపణలతో తమపై వేర్పాటువాదుల ముద్ర వేసి.. తాషీ గ్యాల్కలింగ్ కౌంటీలో తమను నిర్బంధించారని వాపోయింది నామ్కీ.
అక్కడ తాషీ గ్యాల్కలింగ్ కౌంటీ జైలులో ఉన్నప్పుడు.. తమకూ నిర్బంధంగా సైనిక శిక్షణనిచ్చేవారని.. అలాగే, చైనా రాజ్యాంగాన్నీ అధ్యయనం చేయించేవారంటోంది. జైల్లో రాగితీగలు, సిగరెట్ పెట్టెలు, గడియారాల తయారీ వంటి పనులు చేయించడంతో పాటు.. లేబర్ క్యాంపులకూ పంపేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ జైలు శిక్ష ముగిసిన తర్వాత కూడా.. ఒక వారం రోజులపాట గాబా కౌంటీలోని పెమా లాతంగ్ పోలీస్ స్టేషన్ లో గడపాల్సి వచ్చిందని.. ఆ తర్వాత నుంచి తమ కుటుంబం మొత్తం నిరంతర పరిశీలనలో ఉందని వారి కష్టాలను నెమరు వేసుకుంటూ.. తమ సొంత దేశంలోనే తాము పరాయివాళ్లలా బతికిన కన్నీటి కథను వివరించింది నామ్కీ. 2023 జూన్ లో పొట్ట చేత పట్టుకుని.. ఆ నరరూప రాక్షసులింకేం చేస్తారోనన్న భయంతో.. తన అత్తతో కలిసి బార్డర్స్ దాటి.. ఓ కాందీశీకురాలిలా వచ్చిన నామ్కీ.. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో అక్కడి స్థానిక భాషను నేర్చుకుంటోంది. ఎంత సరిహద్దులను కల్గి ఉన్నా.. టిబెటన్ భాష అర్థం కాకపోవడంతో.. ఏం చేయాలన్నా భాషే ప్రధానమని గమనించి.. ఇప్పుడు భాష కోసమే శిక్షణ తీసుకుంటోంది నామ్కీ.
ఎక్కడో టిబెటన్ వాసి రాగానే.. స్థానికంగా ఉన్న జనం రండి రండి రండి దయచేయండంటూ ఆతిథ్యమిచ్చేయరు.. కానీ, నామ్కీ దలాలైమా భక్తురాలై ఉండటం.. ఆయన మార్గదర్శకత్వంపై స్థానికంగా ఆమె మాట్లాడిన తీరు ధర్మశాల స్థానికులనూ ఇంప్రెస్ చేసింది. అలా మొత్తానికి ప్రస్తుతం నామ్కీ ధర్మశాలలో తన జీవితాన్ని గడుపుతోంది.
అయితే, ఇది నామ్కీ అనే ఓ టిబెటన్ మహిళ కథగానే చూడలేం. ఎందరో టిబెట్ శరణార్థులు.. చైనా దళాల దౌర్జన్యానికి అమ్మలాంటి ఉన్న ఊళ్లను వదిలిపెట్టి ఇప్పుడు ఇండియాకు తరలివస్తున్న వలసవాదానికి ఓ ప్రతీక.. నామ్కీ పడ్డ కష్టాల సుదూర ప్రయాణం. ఇప్పుడు నామ్కీ లక్ష్యం ఒక్కటే. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ.. చైనా దళాల వైఖరెలా ఉంది.. వారి చేతుల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏవిధంగా జరుగుతుందో తెలియజెప్పడమే.. తన కింకర్తవ్యమంటోంది నామ్కీ.



