ఇద్దరు హీరోల సినిమాల పేర్లు సేమ్ టూ సేమ్ ఉంటే ఏం జరుగుతుంది..? పెద్ద హిట్ కావాలని విడుదల చేసినప్పుడు కనీసం రిటర్న్స్ కూడా రాని సినిమా… మళ్లీ వెలుగులోకొస్తుంది. అలా వెలుగులోకి రావడమే కాదు… సినిమా పెట్టుబడిని మించిన రాబడితో ఇప్పుడా చిత్రబృందాన్ని హాశ్చర్యపరుస్తోంది. మరి కలికాలపు కల్కి కథేంటో ఓసారి తెలుసుకుందామా..?

అశ్వనీదత్ నిర్మాణంలో.. టైమ్ ట్రావెలింగ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్, దీపికా పదుకొన్, బిగ్ బీ అమితాబ్, వెర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ వంటి తారాగణంతో.. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తూ భారీ అంచనాలను కూడగట్టుకున్న సినిమా కల్కి 2898 AD. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఆ సినిమాకు ముందస్తు టికెట్ బుక్సింగ్స్ ను కూడా ఓపెన్ చేశాయి థియేటర్స్. ఓవైపు బుకింగ్సన్నీ హౌజ్ ఫుల్ చూపిస్తుంటే… సందెంట్లో సడేమియా అన్నట్టు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ గతంలో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాను కూడా థియేటర్స్ లో ఇదే సమయంలో విడుదల చేశారు. దీంతో చాలామంది ప్రభాస్ కల్కి సినిమా కోసం టిక్కెట్స్ బుక్ చేసే క్రమంలో… బుక్ మై షోలో రాజశేఖర్ కల్కి సినిమా టిక్కెట్స్ కొనడంతో పాటు… ఏకంగా ప్రభాస్ కల్కి రిలీజ్ కాకముందే థియేటర్లకు కూడా వెళ్లి రాజశేఖర్ కల్కి చూసి తమలో తామే తామెంత పప్పులో కాలేశామా అని సరదాగా నవ్వుకుంటున్నారట.
అయితే ప్రభాస్ కల్కి 2898 AD ప్రభావం… రాజశేఖర్ కల్కిపై పడటంతో… కల్కి రిలీజ్ సమయంలో కంటే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించుకోవడం కొసమెరుపు. మొత్తంగా ఏ కల్కి కోసం టిక్కెట్స్ బుక్ చేస్తున్నారో కూడా తెలియని ఓ గందరగోళంలో తెలుగు ఆడియన్స్ రాజశేఖర్ కల్కికి విచ్చలవిడిగా టిక్కెట్స్ బుక్ చేస్తుండటం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

ఈ మొత్తం ఊహించని పరిణామంపై హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా X వేదికగా స్పందించారు. ఈ మొత్తం ఫన్నీ వ్యవహారంతో నాకు అస్సలు సంబంధం లేదన్నట్టుగా స్పదించిన రాజశేఖర్.. అదే సమయంలో, ప్రభాస్, నాగ్ అశ్విన్, అశ్వనీదత్, వైజయంతీ ఫిల్మ్స్ కు, ఇతర తారాగణమందరికీ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ సినిమాతో మీరు చరిత్ర సృష్టించాలి.. మరో అడుగు ముందుకేయాలంటూ ట్వీటారు రాజశేఖర్.
సుమారు 20 షోలు రాజశేఖర్ కల్కి సినిమా టిక్కెట్లకు బుక్ మై షో ద్వారా హౌజ్ ఫులల్లయ్యాయి. కొందరు ప్రభాస్ అభిమానులైతే… కల్కి 2898 AD సినిమా ఇంకా రిలీజ్ కాకముందే… రాజశేఖర్ కల్కి సినిమా చూసొచ్చినవాళ్లు… ఇప్పటికే కల్కి 2898 AD విడుదల రోజున టిక్కెట్స్ బుక్ చేసుకునే క్రమంలో రాజశేఖర్ కల్కికి బుక్ చేసుకున్నవారు తమ టిక్కెట్లను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసుకోవడంతో… ఒక వినోదకరమైన చర్చకు దారితీస్తోంది. హలో ఏఎంబీ.. ఇదేంటీ… నేను ప్రభాస్ కల్కి కోసం బుక్ చేస్తే… రాజశేఖర్ కల్కికి టిక్కెట్ బుక్కవ్వడమేంటంటూ.. తామెలా బుక్కయ్యామో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో.. ఇప్పుడు కల్కి డబుల్ యాక్షన్ సినిమా ముచ్చట పరాకాష్ఠకు చేరుకుంది. అయితే, ప్రభాస్ కల్కి కలెక్షన్స్ సంగతెలాగూ ఉండనే ఉంటుంది గానీ… తంతే బూరెల గంపలో పడ్డట్టు రాజశేఖర్ కల్కి కూడా మంచి రిటర్న్స్ రావడంతో ఇప్పుడు రెండు కల్కిల చిత్రబృందాలు ఫుల్లు హేపీ.


