ఢిల్లీకి కుడుముల రుచి చూపించిన.. టిబెటన్!

డుమువులు ప్రథమా విభక్తన్నట్టుగా… ఇప్పుడా నగరానికి కుడుములు ప్రథమరుచిగా తయరయ్యాయి. అర్థమైందిగా… గణేష్ నవరాత్రుల్లో సంప్రదాయం ప్రకారం పెట్టే నైవేద్యం… ఆ విఘ్ననాయకుడికిష్టమైన పిండిపదార్థం… ఆ కుడుములే ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీలో ఫేమస్.

కుడుములను చాలారకాలు తయారుచేస్తుంటారు. బియ్యపు పిండిలో… తెలంగాణా ప్రాంతంలో పిల్చుకునే కరియల తరహాలో లోపల కొబ్బరి, శర్కర కాంబినేషన్ ను పెట్టి ఒక పద్ధతిలో అయితే… ఇడ్లీ కుక్కర్ వంటి పాత్రల్లో స్టీమ్ట్ గా ఆవిరి ద్వారా బియ్యపు పిండిని పాలతో తడిపి, శర్కర వేసి ఉడికించి తయారు చేయడం మరో పద్ధతి. అంతేకాదు… అనుములతో కూడా కుడుములు చేస్తుంటారు. అయితే ఆ గణనాయకుడికిష్టమైన సంప్రదాయ కుడుములతో పాటే… కుడుములందు ఎన్నెన్నో రకాలు. అయితే ఈ కుడుములను దేశ రాజధాని ఢిల్లీకి మరింత బాగా పరిచయం చేసిన మహిళ పేరు డోల్మా సెరింగ్.

ఈశాన్యాన ఉన్న టిబెట్ నుంచి ఉత్తరంలో ఉన్న ఢిల్లీకి 1990వ దశకంలో వచ్చింది డోల్మా సెరింగ్. బతుకుదెరువు కోసం వచ్చిన డోల్మా తనకు వచ్చిన విద్యతో ఎన్నో ఉద్యోగాల కోసం యత్నించింది. కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసింది. కానీ ఎందుకో జీవితం అనుకున్నంత తృప్తి కల్గడంలేదు… ఏంచేయాలో తోచని పరిస్థితి. కానీ అఫ్పుడే ఏదో కొత్తగా చేస్తే క్లిక్కవుతుందన్న ఆలోచనలు సుడిగుండాల్లా మదిలో మెదులుతున్న క్రమంలో మెరిసిన యోచన.. కుడుముల బిజినెస్. కుడుములను రుచిగా తయారుచేసి అమ్మేందుకు కొడుకు రాముతో కలిసి ఓ స్టాల్ ప్రారంభించింది. అసలు కుడుములంటే కొందరు మొదట్లో అసహ్యంచుకున్నారట అక్కడ. అందులోనూ ఆవిరితో స్టీమ్డ్ గా చేయడమా అని ఇంకొంత జలదరింపుతో అసలవి తినే పదార్థమేనా అని మాట్లాడేవారట. అసలంతవరకూ పరిచయంలేని ఓ భిన్నమైన రుచిని ఢిల్లీ ప్రజానీకానికి చేరువ చేయడమంటే ఎంత కష్టమో కూడా అర్థమైందట డోల్మాకు. కానీ అప్పుడప్పుడే ఒకళ్లిద్దరి నుంచి మొదలై పరిమిత సంఖ్యలో కస్టమర్లు రావడం మొదలైంది. కానీ ఆ పరిస్థితులను తన కొడుకు, సోదరితో కలిసి తట్టుకోవడం కూడా ఎంతో కష్టమైందన్నది డోల్మా మాట. పైగా తన దగ్గర ఉన్న చిన్న చిన్న స్టీమర్లతో ఎక్కువ సంఖ్యలో చేయలేని పరిస్థితి. ఇలా డోల్మా ఢిల్లీకి పరిచయం చేయాలనుకున్న ఓ వినూత్నమైన రుచైన కుడుములను… ఢిల్లీ ప్రజలను ఆస్వాదింపజేయడానికి పలు కష్టాలే ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఢిల్లీ లజ్పత్ నగర్ లో ప్రారంభించిన స్టాల్ ఆదిలో ఒకళ్లిద్దరితో కనిపిస్తే… ఇప్పుడు నిల్చోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి. అంతేకాదు… ఢిల్లీలో మరో రెండు చోట్ల కూడా స్టాల్స్ ఓపెన్ చేసి కుడుముల వ్యాపారాన్ని రోజుకు వందల కుడుములు… వేల రూపాయలన్నట్టుగా నడిపిస్తోంది డోల్మా. ప్రారంభంలో ఆమెకు భాషా సమస్య కూడా ఏర్పడిందంటోంది డోల్మా. దాంతో వచ్చే కస్టమర్స్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి… తనకు వచ్చిన భాషతో వాళ్లకెలా అర్థం చేయించేదని.. మానసికంగా కూడా ఇబ్బంది పడేదట డోల్మా. అలాంటి స్థితి నుంచి డోల్మా ఇప్పుడు కుడుముల్లో ఎన్నో రకాలు… అందులోనూ వెజ్-అండ్ నాన్ వెజ్ కుడుములనూ తయారుచేస్తూ ఢిల్లీ ఆహారప్రియుల మదిని దోచుకుంటోంది. వారి జిహ్వచాపల్యాన్ని క్యాష్ చేసుకుంటోంది.

ఎక్కడో టిబెట్ నుంచి వలస వచ్చి… అసలు అంతకుముందు వినని, చూడని, తినని ఓ స్టీమ్డ్ పదార్థాన్ని వారికి పరిచయం చేసే క్రమంలో… వైఫల్యాలు ఎదురుతన్నినా ఓపిగ్గా ఎదురుచూచి విజయం సాధించింది డోల్మా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles