విషాదం పైనుంచి విజయం వైపు దూసుకెళ్లిన బంతి.. దినేష్ కార్తీక్!

ఆత్మహత్యాయత్నం నుంచి… విజయం వైపు! చదివి తీరాల్సిన ట్రెండీ క్రికెటర్ స్టోరీ!!

కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది!!

దినేష్ కార్తీక్… ఐపీఎల్ చూస్తున్నవారికి.. సరిగ్గా రెండు రోజుల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచులో.. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఛేజింగ్ ఎఫర్ట్స్ లో అతని ప్రతిభ చూసినవారికికి ఠక్కుమని కళ్లల్లో మెదిలే పింఛ్ హిట్టర్!

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భార్య… ఓస్నేహితుడు… ఇద్దరూ కలిసి మోసంచేస్తే… మరో స్త్రీ వలన ఆకాశానికెదిగిన వాడు దినేష్ కార్తీక్!!

ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మహత్య అంచులదాకా వెళ్లి.. తిరిగి సాధించినవాడు.

ఎవరో నిన్ను కిందపడేస్తే నువ్వు ఓడిపోవడమేంటి… నీ జీవితాన్ని ఇంకొకరు శాసించడమేంటి… నీ జీవితాన్ని నీ చేతుల్లోనే లేనంతగా ఇతరులు ప్రభావం చేయడమేంటి…?

ఇదిగో ఇలా బోలెడన్ని ప్రశ్నలకు.. ఇవాళ దినేష్ కార్తీక్ ఎదిగిన తీరు సమాధానాలై కనిపిస్తాయి.

నెవర్ గివ్ అప్… మరణం వరకు పోరాడుతూనే ఉండాలి.. చివరకు కర్మఫలంగా భావించాలి.. అందరికీ సమయం వస్తుంది.. ఓపిక పట్టండి.. ఇదే దినేష్ కార్తీక్ లైఫ్ స్టోరీ చెబుతున్న సూక్తి.

దినేష్ కార్తీక్… 2004వ సంవత్సరంలో.భారత క్రికెట్ జట్టులో యువ వికెట్ కీపర్ గా అరంగేట్రం చేశాడు. ఆయన క్రికెట్ జీవితం వడివడిగా పుంజుకుంది. అప్పుడప్పుడే గాడిలో పడుతోంది. కట్ చేస్తే లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2007లో తన చిన్ననాటి మిత్రురాలైన నికితా వంజారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

దినేష్, నికిత వైవాహిక జీవితం కూడా… దినేష్ కార్తీక్ అరంగ్రేటం తర్వాత ఇండియా జట్టులో కొనసాగుతున్నట్టే.. చాలా సంతోషంగా సాగుతోంది. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు కూడా.. దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయమది. అతడి స్నేహితుడు, తమిళనాడు జట్టు ఓపెనర్.. ఆ తర్వాత భారత జట్టులోనూ స్థానం సంపాదించిన మురళీ విజయ్ రూపంలో దినేష్ కార్తీక్ జీవితం ఊహించని విషాదంలోకి నెట్టివేయబడింది. తాగుడుకు బానిసైన దినేష్ కార్తీక్ ఏకంగా ఆత్మహత్య అంచుల వరకూ వెళ్లాడు.

అసలేమైంది…? స్నేహితుడైన మురళీ విజయ్ రూపంలోనే.. ఎందుకు కార్తీక్ కు మానని గాయమైంది..?

కార్తీక్, మురళీ విజయ్ ఇద్దరూ స్నేహితులు కావడంతో.. వారికేర్పడిన చనువుతో మురళీ విజయ్ తరచూ కార్తీక్ ఫ్యామిలీతో కలిసేవాడు. దినేష్ భార్య నికిత.. మురళీ విజయ్ పట్ల ఆకర్షితురాలైంది. ఆ విషయాన్ని చూడ్డానికి బలాఢ్యుడిగా పైకి కనిపించినా.. మృదుస్వభావి, లౌక్యం అంతగా తెలియని కార్తీక్.. దగ్గరి స్నేహితుడు, భార్యనే కదా అన్న నమ్మకంతోనో, ఏమో గుర్తించలేకపోయాడు. కానీ.. నికిత, మురళీ మధ్య బలపడిన సాన్నిహిత్యం, ఇద్దరూ బహిరంగంగా కలవడం.. దినేష్ కార్తీక్ కు అనుమానం వచ్చే లోపే ఊరంతా చుట్టి తెలిసిపోయింది. మురళీ విజయ్ తో.. తమ కెప్టెన్ దినేష్ భార్య నికిత ప్రేమలో ఉందనే విషయాన్ని టీమ్ కెప్టెనైన దినేష్ కార్తీక్ గ్రహించడం కంటే ముందే… తమిళనాడు టీమ్ మొత్తానికి తెలిసిపోయింది.

మురళీ విజయ్, నికిత ఆకర్షణ.. వివాహేతర సంబంధం వైపు అడుగులేయించింది. అలా 2012 సంవత్సరంలో నికిత గర్భవతైంది. పుట్టబోయే చిన్నారి మురళీ విజయ్‌ వారసత్వమన్న బలమైన టాక్ తో.. అప్పుడు దినేష్ కార్తీక్ విరుచుకుపడ్డాడు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో.. ముందుగా భార్య నికితతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న మరుసటి రోజే.. నికిత, మురళీ విజయ్‌ని పెళ్లి చేసుకుంది. ఎవరికైనా పెళ్లైన 9 నెలలైతేనేగానీ.. పిల్లలు పుడుతారు. కానీ, మురళీ విజయ్, నికత మధ్య ఏర్పడిన వివాహేతర బంధంతో… వారి వివాహమనంతరం కేవలం 3 నెలలకే వారికి బిడ్డ పుట్టింది.

దాంతో దినేష్ కార్తీక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. మానసికంగా కృంగి కృశించిపోతున్నాడు. కట్టుకున్న భార్య, నమ్మకముంచిన స్నేహితుడు మురళీ చేసిన మోసాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేకపోయాడు. ఇద్దరూ కలిసి పొడిచిన వెన్నుపోటుకు.. మద్యానికి బానిసయ్యాడు. ఉదయం లేస్తే.. దేవదాస్ సినిమాలో హీరో క్యారెక్టర్ లా నిద్రలోకి జారుకునేవరకూ మందు బాటిల్స్ తోనే దినేష్ కార్తీక్ సహవాసం తయారైంది. ఇంకేం.. ఏ కాస్త అటూఇటూ తేడా వచ్చిన పక్కన పెట్టే సెలక్టర్స్… దినేష్ కార్తీక్ అనే యువ వికెట్ కీపర్ ను పక్కనబెట్టారు. భారత జట్టులో స్థానం పోయింది. ఆ తర్వాత రంజీట్రోఫీల్లోనూ తాను చేయని పాపానికి ఆత్మన్యూనత వెంటాడి.. అక్కడా విఫలమయ్యాడు.

తమిళనాడు జట్టు కెప్టెన్సీ కూడా దినేష్ కార్తీక్ కు అందకుండా పోయింది. దాంతో పాటు.. కార్తీక్ ను తప్పించిన తమిళనాడు టీమ్.. తనకు వెన్నుపోటు పొడిచిన మురళీ విజయ్‌నే కెప్టెన్‌గా నియమించడం.. దినేష్ కు నిద్రపట్టని రాత్రులకు కారణమైంది. క్రికెటర్ గా విఫలమైతే.. ఓసారి కాకుండా ఇంకోసారి పుంజుకోవచ్చు. గట్టిగా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ, ఒక జీవితమే వైఫల్యమై.. నవ్వులపాలై… తనను ఓ కెప్టెన్ గా ఆదరించే తన సహచరులే.. వెనక్కి వెళ్లి తన జీవితం గురించి… తనకు జరిగిన అన్యాయం గురించి.. తన అసమర్థత గురించి గుసగుసలు పెట్టుకుంటున్నారన్న ఆలోచనలు దినేష్ ను వెంటాడాయి. చివరకు ఐపీఎల్‌లో జట్టులో కూడా దినేష్ కార్తీక్ కు చోటు దక్కలేదు. జిమ్‌ మానేశాడు. ఆ సమయంలో దినేష్ కార్తీక్ అంటే.. నిరాశ, నిస్పృహలకు ఓ కేరాఫ్. అలాంటి పరిస్థితిలో దినేష్ ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు.

కానీ, జిమ్ ట్రైనర్ చొరవ కార్తీక్ ను గాడిలో పడేసింది!

తర్వాత ఓరోజు దినేష్ కార్తీక్ నిత్యం జిమ్ చేసే చోట జిమ్ ట్రైనర్.. కార్తీక్ ను అత్యంత కడు దయనీయమైన స్థితిలో చూశాడు. జిమ్ కు తీసుకెళ్తానంటే ససేమిరా అన్నా వినకుండా.. ఇక లాభం లేదని బలవంతంగా కార్తీక్ ను జిమ్ తీసుకెళ్లాడు.

కొత్త ఆశలు చిగురింపజేసిన భారత స్క్వాష్‌ మహిళల ఛాంపియన్‌ దీపికా పల్లికల్‌!

భారత స్క్వాష్‌ మహిళల ఛాంపియన్‌ దీపికా పల్లికల్‌ కూడా.. దినేష్ కార్తీక్ రెగ్యులర్ గా వెళ్లే జిమ్‌కి వెళ్లేది. దినేష్ కార్తీక్ పరిస్థితి చూసిన ఆమె గుండె చలించిపోయింది. ట్రైనర్‌తో కలిసి దినేష్ కార్తీక్‌కు కౌన్సెలింగ్ ప్రారంభించింది.

ట్రైనర్, దీపిక కష్టానికి ఫలితం మెల్లిగా మొదలయ్యాయి. ఆశలు చిగురించడంతో వారు.. దినేష్ ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని సంకల్పించారు. అదే సమయంలో తమిళనాడు జట్టుకు కెప్టెన్ అయిన మురళీ విజయ్‌ ఆట… అటకెక్కింది. అప్పటికే భారత జట్టులో కూడా స్థానం సంపాదించుకున్న మురళీ విజయ్‌ పేలవమైన ఫామ్ తో… భారత జట్టు నుంచి కూడా మురళీని తప్పించారు. తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా.. అతని చెత్త ఆటతో ఇంటికి పంపించేసింది.

మరోవైపు దీపికా పల్లికల్ మద్దతుతో దినేష్ కార్తీక్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దాని ప్రభావం రోజురోజుకూ కనిపిస్తోంది. దినేష్ కార్తీక్ మళ్లీ తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ స్కోర్లు చేస్తున్నాడు. త్వరగానే అతను ఎక్కడైతే రిజెక్టయ్యాడో.. అక్కడే ఐపీఎల్ కూ సెలక్టయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఓవైపు ఆటతో పాటే.. అంతవరకూ తనను బాధించిన తన మాజీ భార్య బంధం స్థానే.. దీపికా పల్లికల్ తో దినేష్ కార్తీక్ కు సాన్నిహిత్యం పెరిగింది. అలా దినేష్ కార్తీక్ అనే క్రికెటర్.. దీపికా పల్లికల్ అనే భారత స్క్వాష్ మహిళల ఛాంపియన్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

క్రికెట్ వయస్సు ప్రకారం, దినేష్ ఏజ్ బార్డ్ క్యాండిడేట్. రిటైర్మెంట్ ఇవ్వాలనీ నిర్ణయించుకున్న పరిస్థితి. మరోవైపు అతడి భార్య దీపికా పల్లికల్ గర్భవతి అయి.. కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం దీపిక కూడా తన స్క్వాష్ ఆటకు విరామమిచ్చింది.

దీపికా, దినేష్ కార్తీక్ ఈ ఇద్దరికీ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌ ఎలైట్ ఏరియాలో ఓ బంగ్లా కొనాలన్నది ఓ కల. 2021లో ఓ భవనం కూడా ఆఫర్ కొనుగోలుకు కూడా ఓ ఆఫర్ వచ్చింది. కొనాలని ఇద్దరు దంపతులుకున్నా… ఇద్దరూ క్రీడలకు దూరంగా ఉన్న వేళ అంత డబ్బు పెట్టి అంత ఖరీదైన రాజభవనం వంటి బంగ్లాను కొనేదెలా..?

అప్పుడే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ నుండి మళ్లీ దినేష్ ను ఆఫర్ వరించింది. వికెట్ కీపర్‌గా దినేష్ ను తిరిగి జట్టులోకి చూడాలని ధోనీ కోరుకుంటున్నట్లు దినేష్ కు సమాచారమందింది. 2022 ఐపీఎల్ కు వేలం ప్రారంభమైంది. కానీ, ఆ ఏడు చెన్నైకి బదులుగా.. దినేష్ కార్తీక్ ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కొనుగోలు చేసింది. దినేష్ భార్య దీపిక కూడా మళ్లీ విరామమిచ్చిన తన ఆటలోకి తిరిగి ప్రవేశించింది. ఇద్దరు కవలలు పుట్టిన వేళా విశేషమో, ఏమోగానీ.. ఆరు నెల్లకే.. ఆమె గ్లాస్గో సిటీలోని స్క్వాష్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ లో తన భాగస్వామి జోష్న పునప్పతో కలిసి.. మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది.

దినేష్ కార్తీక్ ను తన భార్య విజయం ఇంకా పొంగిపోయేలా చేసింది. 2022 నుంచి ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ ప్రతిభ, ప్రదర్శన తన వెలకు తగ్గ విలువను కళ్లకుగట్టాయి. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి.. గేమ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరపున తన పోరాట పటిమ చూసిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన కార్తీక్ కు.. కోహ్లీ వంటి ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ వంగి వంగి గౌరవించిన తీరు.. తప్పకుండా విషాదం నుంచి విజయాన్నెలా తానందుకున్నాడో ఓసారి పురా జ్ఞాపకాలకు వెళ్లితే దినేష్ కే ఆశ్చర్యమనిపించే విషయం.

అప్పుడప్పుడూ పార్ట్ టైం కామెంటేటర్ గా కూడా అలరిస్తుంటాడు దినేష్ కార్తీక్.

మొత్తంగా దినేష్ కార్తీక్… ఓ సక్సెస్ స్టోరీ. ఈ మధ్య వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ స్టోరీని మించిన కథ. పడిపోయిన తర్వాత లేవడమెలాగో… నేర్పించే కథనం. ఓపిక పట్టండి.. సవాళ్లనెదుర్కొండి.. పరిస్థితులతో పోరాడుతుండండి. కచ్చితంగా మీరు చేరుకోవాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకుని తీరుతారనే ఓ మెస్సేజ్ ఓరియెంటెడ్ లైఫ్ స్టోరీ.. దినేష్ కార్తీక్!

అయితే, ప్రతీ మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. దినేష్ కార్తీక్ స్టోరీలో… తన వైఫల్యాలు, విషాదాల వెనుక ఓ ఆడదున్నట్టే.. తన విజయానికీ మళ్లీ ఆ నారీశక్తే ఉత్ప్రేరకమవ్వడం విశేషం.

ఇప్పుడు మళ్లీ దినేష్ కార్తీక్ విశ్వరూపం చూస్తున్నప్పుడు ఈ స్టోరీ చెప్పుకోవాల్సిన అవసరముందనిపించింది.

ఇక మురళీ విజయ్ వంటివారి గురించి ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోగా.. అలాంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles