ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే భయపడే పార్టీలు, ఆయా నాయకులు.. ఇప్పుడు సోషల్ మీడియా అంటే లాగులు తడుపుకుంటున్నారు. తెల్లార్లేస్తే తమపై ఎలాంటి వార్తలు చూడాల్సి వస్తుందో… ఏవిధంగా ట్రోలింగవుతామో.. ఎలాంటి మీమ్స్ కు గురవుతామోనని ఒకటే ఆందోళన. అదే సమయంలో అలాంటివాటిని కౌంటర్ చేసేందుకు.. మీడియా యాడ్స్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతూ.. సోషల్ మీడియా వారియర్స్ నే ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారు. అందుకోసం పెద్దమొత్తం వెచ్చిస్తున్నారంటేనే.. సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, వేక్ ఆరోపణలు, కేవలం థంబ్ నెయిల్స్ ను మాత్రమే నమ్ముకుని.. కంటెంట్ కరువైన చాలామంది కథనాలు వదిలేసి కాస్త ఫిల్టర్ చేస్తే.. కొందరు తమ సృజనాత్మకతతో అటు డబ్బుకు డబ్బు.. మరోవైపు కీర్తికి కీర్తి సంపాదించి ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా చెప్పదల్చుకున్న సబ్జెక్టులో స్పష్టత.. కాసింత సృజనాత్మకత కూడా తోడైతే… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ను మించిన సబ్ స్క్రైబర్స్ ను ఎలా సంపాదించొచ్చో కూడా నిరూపిస్తున్నారు. అలాంటి వాళ్లల్లో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఓ పేరు ధృవ్ రాఠీ.

ధృవ్ రాఠీ.. హర్యానా రోహతక్ వాసి. ట్రావెల్ వ్లాగర్ గా తన జర్నీ ప్రారంభించి.. ఇప్పుడు పొల్టికల్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా అదరగొడుతున్నాడు. నేషనల్ మీడియా ఛానల్స్ కు కూడా లేని సబ్ స్క్రైబర్స్ తో… తన దమ్మెంతో చాటుకుంటున్నాడు. తాననుకున్నది స్పష్టంగా వివరిస్తూ… ప్రభుత్వాలకు కంట్లో నలుసుగా కూడా మారాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఇండియా కూడా ప్రజాస్వామ్యం వైపు నుంచి నియంతృత్వ పాలన వైపు మళ్లుతుందా అన్నట్టుగా చేసిన డిక్టేటర్ అనే ఓ వీడియో వైరల్ గా మారింది. కొంత సృజనకు తోడు, సాహసోపేతమైన దారి.. ప్రశ్నించే తత్వం.. సబ్జెక్ట్ పై స్పష్టత ఉండటంతో… సామాన్యుల నుంచీ సివిల్ సర్వెంట్స్ వరకూ ఎందరో ధృవ్ యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్, వ్లాగ్స్ కు ఫాలోవర్స్ గా మారిపోయారు.
సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఇంతలా ఎదుగొచ్చా అనేవిధంగా.. ధృవ్ తాను జస్ట్ ఓ ట్రావెల్ వ్లాగర్ గా ప్రారంభించిన వీడియో షేర్స్.. ఇప్పుడు లక్షల సంఖ్యల్లో వైరలవుతూ.. ఆయనకు ఆదాయమే కాకుండా… ధృవ్ ను మిగిలిన సోషల్ మీడియా ప్రపంచంలో ఓ ధృవతారలా నిలబెడుతున్నాయి. దీంతో ధృవ్ తన యూట్యూబ్ ఛానల్ డబ్బింగ్ వెర్షన్స్ తో.. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజానీకానికి కూడా చేరువయ్యేందుకు.. ఇప్పటికే మరాఠీ, కన్నడ, తమిళ, బెంగాలీ, తెలుగులో కూడా కొత్త వెర్షన్స్ తో ఛానెల్స్ ను ప్రారంభించి… డబ్బింగ్ వెర్షన్ ఛానల్స్ కు కూడా 1 లక్షా 30 వేల మంది సబ్ స్క్రైబర్స్ తో.. సోషల్ మీడియా స్టార్ గా ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు 29 ఏళ్ల ధృవ్.
2011లో ఇండియా అగైనస్ట్ కరప్షన్ పేరుతో.. అన్నాహజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో.. ధృవ్ రాఠీలో రాజకీయాలపై ఆసక్తి మొదలైంది. అప్పటివరకూ పెద్దగా రాజకీయాలు పట్టించుకోని ధృవ్… ఆ తర్వాతే రాజకీయ విశ్లేషణలపైనా దృష్టి సారించాడు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలో మళ్లీ బీజేపీ విజయకేతనం ఎగురవేయబోతోందంటూ పలు సర్వేలు చెబుతున్న వేళ.. భారత్ నియంతృత్వం వైపు అడుగులేస్తోందా అంటూ ధృవ్ చేసిన పొల్టికల్ అనాలసిస్ వైరల్ గా మారి.. ఏకంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇబ్బందిగా పరిణమించింది. అయితే, తానేం ఏ పార్టీకీ వ్యతిరేకం కాదని.. అలా అని అనుకూలమూ కాదని… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలాన కూడా.. ది రియల్ స్టోయ్ ఆఫ్ ధృవ్ రాఠీ అనే వీడియోలో.. తనను తాను వందశాతం కాంగ్రెస్ వ్యతిరేకిగా చెప్పుకొచ్చాడు ధృవ్.
జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ధృవ్.. తానో యూట్యూబ్ ఎడ్యుకేటర్ గా, యాక్టివిస్టుగా, వ్లాగర్ గా తన వెబ్సైట్ లో తన గురించి కాస్త చెప్పుకొచ్చాడు. చాలా క్లిష్టంగా ఉన్న సబ్జెక్టును అందరికీ అర్థమయ్యే రీతిలో.. సృజనాత్మకంగా అరటిపండు ఒల్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పడమే తాను చేస్తున్న పని అంటాడు ధృవ్. తానెక్కువగా హిందీ కంటెంట్ నే ఎంచుకోవడానికి అది తన మాతృభాష అని.. అలాగే, ఆ భాషలో హై క్వాలిటీ కంటెంట్ తనకు తక్కువ కనిపించిందంటాడు ధృవ్ రాఠీ. కానీ, ధృవ్ రాఠీ ఎప్పుడైతే.. పొల్టికల్ వీడియోస్ ప్రారంభించాడో.. అప్పుడు తానే ఊహించని రీతిలో సబ్ స్క్రైబర్స్ సంఖ్య పెరిగి.. అది ఏకంగా తన మెయిన్ యూట్యూబ్ ఛానల్ కు 18 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ను తయారుచేసింది.
ఎన్డీటీవీకి 16.4 మిలియన్స్ మెంబర్ సబ్ స్క్రైబర్స్ గా ఉంటే.. మరో ప్రముఖ మీడియా సంస్థైన న్యూస్ 18కు 7.13 మిలియన్స్ మాత్రమే సబ్ స్క్రైబర్స్ కనిపిస్తారు. ఇలా ప్రధాన ఛానల్స్ కూడా అందుకోలేని రీచింగ్ తో… హిమాలాయాలంత ఎత్తులో ఇప్పుడు ధృవ్ యూట్యూబర్ గా సంచలనంగా మారిపోయాడు.
రాహూల్ శర్మ అనే డెహ్రాడూన్ కు చెందిన ఓ 22 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్.. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్.. ది ప్రింట్ అనే వెబ్ సైట్ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే.. తను క్రమం తప్పకుండా ధృవ్ వీడియోస్ చూస్తుంటానని.. అవి వివిధ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలో తనకు నేర్పుతాయంటారు. అలా వ్యూయర్ ను యంగేజ్ చేయడంలో.. రాఠీ మంచి ప్రతిభావంతుడంటాడు. వాస్తవానికి నేను ప్రభుత్వాలకు కాస్త అనుకూలంగానే ఆలోచించే వ్యక్తినైనప్పటికీ… అతడి విశ్లేషణలు వింటున్నప్పుడు.. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఇంకో కొత్త కోణం కనిపిస్తుందంటాడు శర్మ.
ధృవ్ సోషల్ మీడియా ప్రయాణం, డిజిటల్ బ్లాగర్ గా అవతారం!
2014లో జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవతారమెత్తిన ధృవ్ రాఠీ యూట్యూబ్ ఛానల్ కు.. 2017 వరకూ 50 వేల మంది సబ్ స్క్రైబర్స్ వచ్చారు. అప్పటికే పొల్టికల్ సబ్జెక్ట్ పైనా దృష్టి సారించి.. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేసేలా.. సర్జికల్ స్ట్రైక్స్, అంధ్ భక్త్స్, దెయిర్ లాజిక్, ఈవీఎం హ్యాకింగ్, రియాల్టీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్, 3 ఈయర్స్ ఆఫ్ మోడీ ఎక్స్ పోజ్డ్ వంటి పొల్టికల్ వీడియోస్ రిలీజ్ చేయగా లక్షల వ్యూస్ తో అవి.. కేంద్ర ప్రభుత్వాన్నే షేక్ చేశాయి. ఈ క్రమంలో బెదిరింపులను కూడా ధృవ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
2018లో బీజేపీ ఐటీ సెల్.. ధృవ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది. కానీ, ధృవ్ లో అప్పటివరకూ ఉన్న కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లో.. ఓ నికార్సైన జర్నలిస్టూ ఆవిర్భవించాడు. దాంతో వెనుకడుగు వేయలేదు సరికదా.. తన వీడియోస్ ను విడుదల చేస్తూనే.. ఫ్యాక్ట్ చెక్ కంటెంట్ తో కౌంటర్స్ గా తనపై ద్వేషం చిమ్మేవారికి కచ్చితమైన సమాధానమిస్తూ వచ్చాడు. అలాగే, వ్యంగ్యాత్మక కార్టూన్స్ మాత్రమే అప్పటివరకూ చూస్తున్న జనానికి.. యూట్యూబ్ లో.. పెయిడ్ న్యూస్ అనే అర్థం వచ్చేలా.. పీన్యూస్ పేరిట ఇతర వార్తా మాధ్యమాల తీరుపై సెటైరికల్ కంటెంట్ నూ అందించి.. మొత్తంగా జనాన్ని తన యూట్యూబ్ ఛానల్ వైపు ఆకర్షించాడు ధృవ్. అయితే, ఆ ఛానల్ ఇప్పుడు కనిపించకుండా చేసేశారు. ఆ తర్వాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరింత తీవ్రత కూడా అదే సమయంలో పెంచేశాడు ధృవ్. ఈ క్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, వ్యంగ్య రచయితైన ఆకాశ్ బెనర్జీతో కలిసి.. ది దేశ్ భక్త్ అనే మరో ఛానల్ ను ప్రారంభించి.. ధృవ్ రాఠీ షో పేరుతో నిర్వహించే ప్రోగ్రామ్ లో ఏకంగా ప్రభుత్వాల తీరును కడిగిపారేస్తున్నాడు.
ఇప్పుడు ధృవ్ రాఠీ యూట్యూబ్ ఛానల్స్, వ్లాగ్స్ కు సంబంధించి పని చేసేందుకు సుమారు డజన్ మంది అతడి వద్ద ఉన్నారు. ఇప్పుడు తానే ఓ ఇండస్ట్రీ అయ్యాడు. హౌ టూ స్పాట్ ఫేక్ న్యూస్, హౌ టూ బాయ్ కాఠ్ మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్, హౌ టూ సేవ్ రివర్స్, 7 టిప్స్ టూ గెట్ ఏ జాబ్ వంటి ప్రముఖ వ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్సెన్నో ఇప్పుడు ధృవ్ రాఠీ అనే 29 ఏళ్ల కుర్రాడు అప్రతిహతంగా నడిపిస్తూ ఒక ఊపు ఊపుతున్నాడు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరెంతో.. సవాళ్లూ అన్ని!
ప్రతిపక్షపార్టీలు కూడా సంధించని ప్రశ్నలను పాలకపక్షం ముందుంచడంతో.. ధృవ్ రాఠీ డిక్టేటర్ వీడియో విశేషమైన ప్రజాదరణ పొందింది అలాగే, అన్ని విమర్శలు కూడా రాఠీ ఎదుర్కోవాల్సి వస్తోంది. కామెంట్స్ చేయడం.. విశ్లేషణల పేరిట దేశభద్రత గురించి మాట్లాడటం.. వాటిని ప్రాక్టికల్ గా అనుభవించిన వారికే తెలుస్తుంది కానీ… ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని, సైట్స్ పెట్టుకుని ఏది పడితే అది రాసేవారికి.. మాట్లాడేవారికి ఏం తెలుస్తుందంటూ రివర్స్ పంచులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. 2022లో ఇమ్రాన్ ఖాన్ ఓటమికి సంబంధించిన పెట్టిన.. పొల్టికల్ టర్మ్ ఆయిల్ ఇన్ పాకిస్థాన్ అంటూ పెట్టిన వీడియోస్ ను కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని భూభాగంపై వినిపించిన తప్పుడు వాదనలే అందుకు కారణమని కేంద్రం పేర్కొంది.
రాఠీని సమర్థించేవాళ్ల వాదన ఏంటంటే..?
తాను దేశంలో లేకపోవచ్చునేమో.. దూరంగానే ఉండొచ్చునేమోగానీ.. తను ఇవాళ భారతీయ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని పనిని నిర్భయంగా చేస్తుండటం అభినందించాల్సిన విషయమంటారు కొందరు ది ప్రింట్ తో. ధృవ్ పొల్టికల్ ఎక్స్పర్ట్ కాకపోవచ్చునేమోగానీ.. పొల్టికల్ ఎడ్యుకేటర్, పొల్టికల్ ఒపినీయన్ మేకర్, పొల్టికల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ప్రస్తుతం సోచ్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న.. 2020లో ధృవ్ తో కలిసి కొన్ని పొల్టికల్ వీడియోస్ చేసిన మోహక్ మంగళ్. అంతేకాదు.. యూట్యూబ్ లో తన కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎట్లా అటెన్షన్ గా మార్చవచ్చనే సైన్స్ తెలిసిన వ్యక్తని.. లీడ్ నుంచి మొదలకుంటే.. థంబ్ నెయిల్ వరకూ కంటెంట్ పై స్పష్టత, సృజనాత్మకత ప్రదర్శించే యూట్యూబర్ ధృవ్ అని కొనియాడుతున్నాడు మోహక్.
గూగుల్ సెర్చ్ ఇంజన్ లో బాగా కనిపించే వారిలో ఒకడిగా.. ఇప్పుడు ధృవ్ పేరు!
డిక్టేటర్ వీడియో అనంతరం.. ధృవ్ పేరు పతాకశీర్షికలకెక్కగా.. Xలో ధృవ్ వీడియో.. ధృవ్ ట్రెండిగ్ గా మారిపోయారు. ధృవ్ సోషల్ మీడియాపై చూపిస్తున్న ప్రభావంతో.. ఆయనపై దేశవ్యాప్తంగా దృష్టి పడింది. ఈ క్రమంలో తాను ఏ పార్టీ నుంచి విరాళాలు, డబ్బులు తీసుకుని పెయిడ్ ఆర్టికల్స్, కంటెంట్ రూపొందించడం లేదని కుండలు బద్దలు కొడతాడు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దక్షిణాదిలోని ఓ రాష్ట్రంలోని ఓ ప్రముఖ పార్టీ నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా తను వద్దనుకున్నట్టు చెబుతున్నాడు. తనను రాజకీయాల్లోకి రావాలంటూ చాలామంది ఆహ్వానిస్తున్నారని.. ఇంకో పదేళ్ల ఏళ్ల వరకూ అలాంటి ప్రస్తావనే ఉండదని.. కేవలం, ప్రజలకు నేటి రాజకీయాలు, వాటి వెనుక ఉన్న ఆంతర్యాలను వివరించడం, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడమే తన లక్ష్యమంటున్నాడు.. 29 ఏళ్ల ధృవ్. మొత్తంగా పిట్ట కొంచెమే అయినా.. ఘనమైన కూతతో.. చిన్న వయస్సులోనే ఓ ప్రభంజనమైన ధృవతార ధృవ్ రాఠీ.



