సాటి మనుషుల పట్ల కనీస కనికరాన్ని కల్గి ఉండటం సోషల్ యానిమల్ గా కనీస మానవత్వమైతే… సాటి మూగజీవులన్నింటి పట్ల కూడా అలాంటి సానుభూతి కల్గి ఉండటం గొప్ప లక్షణం. ఎవ్వరవునన్నా, కాదన్నా అది మానవత్వాన్ని మించిన గొప్ప గుణం. దాన్ని దైవత్వమంటే తప్పేం లేదు. అలాంటివారిలో రతన్ టాటా పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రతన్ టాటా కన్నుమూశారాన్న వార్త భారతీయ వ్యాపార ప్రపంచంలో ఓ విచారకమైన సందర్భం. మూగజీవాల నుంచి కరడుగట్టిన మనుషుల హృదయాలనూ గెల్చుకున్న అందరివాడు ఎవరైనా ఉన్నారా అంటే.. ఒకే ఒక్క టాటా పేరే వినిపిస్తందేమో?! ఈ సందర్భంగా అలాంటి టాటా హృదయ స్పందనకు దగ్గరగా ఆయన నిర్మించిన చివరి ప్రాజెక్ట్ గురించి ఓసారి చెప్పుకుందాం.

మూగజీవాల గోస ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన రతన్ టాటా.. ఏకంగా అలాంటి జీవాలకు ఏదైనా జరగరానిది జరిగితే వాటి ప్రాణాలు కాపాడేందుకు, ఎవ్వరికీ చెప్పుకోలేని వాటి బాధలు తీర్చేందుకు ఏకంగా 165 కోట్ల రూపాయల వ్యయంతో ఓ ఆసుపత్రినే నిర్మించారు. సాటి వాడికి సాయం చేద్దామంటేనే లెక్కలు చూసుకునే క్యాలిగ్లేటెడ్ ప్రాక్టికల్ సొసైటీలో.. మూగజీవాల పట్ల దయ కల్గి ఉండటం.. ఆయన బిజినెస్ టైకూన్ గా ఎదిగిన ఎత్తంత మానవత్వం. మనిషి తత్వం. చాలా మంది భాషలో దైవత్వం.
ఇప్పటికే క్యాన్సర్ హాస్పిటల్స్ తో పాటు.. ఎన్నో వ్యవస్థల స్థాపనకు ఆద్యుడైన టాటాకు.. ఎందుకు అసలు మూగజీవాల కోసం అంత పెద్ద ఆసుపత్రిని కట్టించాలనిపించింది..? అదీ దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైలో! తన పెంపుడు కుక్కకు కాలు జాయింట్ లో గాయమైనప్పుడు అమెరికాలోని మిన్నెసోటాలో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆలస్యమవ్వడంతో ఆ కుక్కకు సరైన వైద్యమందకపోవడం.. టాటాను బాధించింది. తమకోసం నిత్యం రక్షణగా ఉంటూ.. యజమానిపై విశ్వాసాన్ని చూపే బాధ్యత గల్గిన మూగజీవుల బాధను పట్టించుకోకపోవడం సరి కాదేమోనన్న ఒకింత విచారమే.. తన 86 ఏళ్ల వయస్సులో టాటాను 165 కోట్లతో మూగజీవాల కోసం వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణానికి పురిగొల్పింది.
ముంబై మహాలక్ష్మిలో 98 వేల అడుగుల విస్తీర్ణంలో.. ఐదంతస్తుల్లో.. 200 పడకలతో పెంపుడు జంతువులు, మూగజీవాల కోసం 24 గంటల పాటు నడిచేలా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటైన ఆసుపత్రి బహుశా ప్రపంచంలోనే పెద్దదై ఉంటుందేమో! ఇప్పుడీ హాస్పటిల్ బ్రిటీష్ వెటర్నరీ వైద్య నిపుణుడు ధామస్ హీత్ కోట్ ఆధ్వర్యంలో ప్రారంభమై.. పెట్ యానిమల్స్ ట్రీట్ మెంట్ కు ఓ కేరాఫ్ గా నిలుస్తోంది. టాటా మానవత్వాన్ని చాటిచెప్పేలా అమూల్ ప్రచురించిన THE IDEAL HOS’PET’AL కార్టూన్ కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ ట్రెండింగ్ ఇష్యూ.
వ్యాపారం కోసం వైద్యాన్ని మార్కెట్ సరకు చేసి సేవను మర్చిన కార్పోరేట్, ప్రైవేట్ వ్యవస్థ వేళ్లూనుకున్న కాలంలో… పెంపుడు జంతువుల కోసం ఓ ఆసుపత్రి నిర్మించాలన్న తలంపు.. దాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో అత్యాధునికంగా తీర్చిద్దాలన్న సంకల్పాన్ని ఏమని పొగడగలం. అందుకే.. It’s great to be great, but it’s greater to be human అనేది ప్రఖ్యాత అమెరికన్ నటుడు, కాలమిస్ట్ విల్ రోజర్స్ చెప్పిన మాటైతే.. అందుకు ప్రతిరూపం మన రతన్ టాటా. టాటా వంటివారు భౌతికంగా లేకపోయినా… ఏ వ్యాపారాన్ని, వ్యాపారస్తుణ్ని చూసినప్పుడైనా.. పోలికల్లో టాటా గుర్తు రాకుండా పోరు. టాటాకు ఘన నివాళి.



