వ్యాపారంలో టాటా అంటే ఓ నమ్మకం. అయితే, అదేదో రతన్ టాటా తమ వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వామిగా పగ్గాలు చేపట్టాకే జరిగిందేం కాదు. ఆ ఫ్యామిలీ బ్లడ్ లోనే విశ్వాసం అనే మాటపై ఉంచిన విశ్వాసం మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఉద్యోగులకు జీతాలివ్వకుండానే ఎన్నో సంస్థలు నడుపుతున్నవారున్న ఈ కాలాన.. అందుకు భిన్నంగా సంస్థలో ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకు లేడీ మెహెర్ బాయి ప్లాటినం గొలుసులో ఉన్న విలువైన వజ్రాన్ని కూడా తాకట్టు పెట్టింది ఆ కుటుంబం. రతన్ టాటా మృతిపై యావత్ భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసే ఈ సందర్భంలో.. ఆ ఫ్యామిలీ ఇన్స్పైరింగ్ ఆ కథేంటో ఓసారి విందాం రండి.

అది 1924 సంవత్సరం.. టాటా స్టీల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయం. ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో ఆ టాటా సంస్థ కొట్టుమిట్టాడుతోంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు… బ్యాంక్ రుణాలూ దొరకని గడ్డు పరిస్థితి. అప్పుడు జెంషెట్టి టాటా పెద్ద కొడుకైన సర్ దొరాబ్జీ టాటాకు ఏంచేయాలో అర్థం కాకుంటే.. ఆయన భార్య మెహర్ బాయి తన కోసం ప్రత్యేకంగా లండన్ లో కొన్న వజ్రాన్నే అమ్మేయమంది. పట్టుబట్టిన భార్య మాట కాదనలేక.. మరొకవైపు టాటా స్టీల్ లో ఉద్యోగుల జీతభత్యాలు వెళ్లేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో దొరాబ్దీ ఆ జూబ్లీ డైమండ్ ను ఇంపీరియల్ బ్యాంకుకు తాకట్టు పెట్టేశాడు. చాలా క్లిష్టమైన సవాళ్లతో కూడిన సమయంలో.. తమ వ్యక్తిగత సంపదను కూడా తాకట్టు పెట్టి.. సంస్థ కోసం.. అందుకోసం నిలబడిన కార్మికులు, ఉద్యోగుల కోసం నాడు దొరాబ్జీ టాటా, ఆయన భార్య మెహెర్ బాయి బాబా చేసిన త్యాగం.. టాటా స్టీల్ చరిత్రలో ఓ మర్చిపోలేని అధ్యాయం. ఆ తర్వాత టాటా స్టీల్స్ కు ఆదాయం రావడంతో పాటు.. అది ఎదిగిన తీరు మరో చరిత్ర.
కోహినూర్ కంటే రెండింతల పరిమాణంలో పెద్దదైన ఆ 245. 35 క్యారెట్ల విలువైన జూబ్లీ డైమండ్ ను దొరాబ్జీ లండన్ వ్యాపారుల దగ్గర ఏరి కోరి తన భార్య కోసం కొన్నాడు. ఆమె మెడ గొలుసులో.. నెక్లెస్ మాదిరిగా ఆ వజ్రాన్ని పొదిగారు. కేవలం పెద్ద పెద్ద వేడుకల్లో మాత్రమే మెడలో ధరించే నెక్లెస్ గా టాటాలే దాన్ని చూసుకునేవారంటే దాని విలువేంటో అర్థం చేసుకోవచ్చు. అవును విలువెంతో తెలుసా… 1900 సంవత్సరంలోనే దాన్ని 1 కోటి 6 లక్షల 90 వేల 300 రూపాయలకు కొన్నారు.
టాటా స్టీల్స్ రిటర్న్స్ పెరగడంతో బ్యాంకులో కుదువపెట్టిన ఆ జూబ్లీ డైమండ్ ను తిరిగి తీసుకున్నారు దొరాబ్జీ టాటా. అయితే, ఆయన మరణానంతరం ఆయన పేరుతో స్థాపించిన దొరాబ్జీ టాటా ట్రస్ట్ కోసం మళ్లీ ఆ జూబ్లీ డైమండ్ ను అమ్మేశారు.
టాటా స్టీల్ ఉద్యోగులను కాపాడుకునే యత్నంలో దొరాబ్దీ టాటా కంటే.. ఆయన భార్య మెహెర్ బాయిదే కీలక పాత్ర. అంతేకాదు, మెహెర్ బాయి ప్రగతిశీల మహిళ. బాల్యవివాహాల నిరోధానికి 1929లోనే ఆమోదింపబడ్డ శారదా చట్టానికి మెయిన్ మోటోగా మెహెర్ బాయి నిల్చారు. అంతేకాదు, నేషనల్ ఉమెన్స్ కౌన్సిల్ తో పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వంటి సంస్థల్లో నాడే ఆమె క్రియాశీల సభ్యురాలుగా, ఓ సంఘ సంస్కర్తగా పలు ప్రచారాల్లో పాల్గొనేవారు. అలా 1927లో ఆమె మిచిగాన్ లో.. హిందూ వివాహ బిల్లు కోసం వాదించిన తీరు… 1930లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మహిళలకు రాజకీయాల్లో పురుషులతో సమాన హోదా కల్పించాలంటూ ఆమె లేవనెత్తిన డిమాండ్స్ మహిళాభ్యుదయం పట్ల ఆమె సామాజిక స్పృహ, ఆటిట్యూడ్ ను పట్టి చూపేవి. 1921లో ముంబైలోని విల్సన్ కళాశాల మైదానంలో మెహెర్ బాయి అధ్యక్షతన జరిగిన సమావేశం ముంబైలోని మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించాలనే తీర్మానం చేయడాన్ని నాడు అంతర్జాతీయ మీడియా కూడా హైలెట్ చేసింది.
అలా టాటాల చరిత్రలోనే నిజాయితీ, సమాజం స్పృహ అణువణువునా కనిపిస్తాయి.. నిన్నటివరకూ మనం చూసిన రతన్ టాటా వరకు!



