14 ఏళ్లు.. 6 హత్యలు: జాలి లేని ఓ సైకో జాలి కథ ఇది!

పేరుకే జాలి… కానీ, ఏమాత్రం జాలి, కరుణ, మానవత్వం ఏ కోశానా లేని హృదయమది. అందుకే అయినవాళ్లందర్నీ వరుస హత్యలు చేసింది. వాటన్నింటినీ హార్ట్ ఎటాక్స్ గా నమ్మించింది. జీతూ జోసెఫ్ క్రైమ్ సినిమాను తలపించే ఓ రియల్ స్టోరీ.. ఈ జాలీయమ్మ జోసెఫ్ కథ. క్రైమ్ సినిమా టేకింగ్స్ కే కాదు.. వినూత్న పద్ధతుల్లో క్రైమ్స్ కూ కేరాఫ్ లా ఈ కేరళ కథ శ్వాస బిగపట్టేలా చేస్తుంది.

అందరూ ముద్దుగా పిల్చుకునే పేరు జాలి. పూర్తి పేరు జాలీయమ్మ జోసెఫ్. కేరళ కోజికోడ్ జిల్లా కూదత్తాయిలో నివాసముండేది.

ఇరుగుపొరుగువారందరికి జాలీయమ్మ అంటే ఎంతో గౌరవం, ప్రేమ, ఆప్యాయత. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా చర్చ్ కు వెళ్లడం.. పక్కవారికి తోచిన సాయం చేయడం.. ఇలా అందరి విశ్వాసాన్ని అపారంగా చూరగొంది. కానీ, ఆ విశ్వాసం వెనుక ఓ నాటకముందనేది కథ మొత్తం ముగిశాకగానీ తేలింది.

పైగా తాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, క్యాలికట్ లో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నానంటూ మరింత గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతీరోజూ ఉదయమే డ్యూటీకే వెళ్తున్నట్టుగా ఓ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని పోవడం.. సాయంత్రానికి తిరిగి రావడం ఈ జాలీ పని.

పైన కనిపించే జాలి వేరు.. ముసుగు వేసుకున్న జాలి వేరు. కానీ, గుర్తించేదెవరు..? చివరకు తన ఫేక్ అర్హతలతో కుటుంబాన్ని కూడా నమ్మించింది. నకిలీ ఐడెంటిటీ కార్డులను సృష్టించింది. అసలు ఉద్యోగమే లేకుండా ఎన్నో ఏళ్లు చుట్టుపక్కలవాళ్లనూ, కుటుంబాన్నీ నమ్మిస్తూ బతికింది.

చూపులో జాలి.. బ్యాగులో సైనెడ్!

చూపుల్లో జాలి, దయ, కరుణ.. చేతల్లో ఇంకొంత సాయం.. పైగా నిట్ వంటి సంస్థలో ఉద్యోగం పేరిట దక్కుతున్న గౌరవం. కానీ, హ్యాండ్ బ్యాగులో మాత్రం సైనెడ్ విషం. అసలు పైకి కనిపించే జాలి, కరుణ వెనుక.. లోపలంతా విషమే. అందుకే, 2002 నుంచి 2016 వరకు తన కుటుంబంలోని ఆరుగురిని సైనెడ్ కలిపి కిరాతకంగా చంపేసింది జాలి ఏ కోశానా లేని సైకో జాలి.

2002లో తన అత్త అన్నమ్మ థామస్ ను అకారణంగా చంపేసింది జాలీ అనే సైకో. ఉద్యోగం చూసుకోరాదని మందలించినందుకే.. అది భరించలేక, మటన్ సూప్ లో విషం కలిపి ఇచ్చింది. కానీ, అన్నమ్మ మరణం మాత్రం గుండెపోటుగానే నమోదైంది. పోస్ట్ మార్టం కూడా జరగలేదు. ఇక 2011లో భర్త రాయ్ థామన్ కూడా భోజనం చేశాడో, లేదో.. అలా కన్నుమూశాడు. ఆ ఘటనా గుండెపోటుగానే నమోదు చేశారు తప్ప.. పోస్ట్ మార్టం జరగలేదు. రాయ్ మరణంపై ఆయన మామ మ్యాథ్యూకు మాత్రం అనుమానాలు ముసురుకున్నాయి. దాంతో రాయ్ మరణంపైన విచారణ చేపట్టాలని మ్యాథ్యూ పట్టుబట్టాడు. అందుకు, మ్యాథ్యూనూ పగబట్టింది పేరులో జాలి అని పెట్టుకున్న రాక్షసి. కానీ, ఆ కేసులో కూడా పోస్ట్ మార్టం జరక్కపోగా.. సహజ మరణంగానే చిత్రీకరించారు.

ఆ తర్వాత తన బంధువైన షాజు సఖారియస్ తో ప్రేమలో పడింది జాలి. కానీ, షాజుకు అప్పటికే పెళ్లైంది. అతడి భార్య అడ్డుపడటంతో.. 2014లో సిలీకి విషమిచ్చి చంపేసింది. ఆ తర్వాత సిలీ రెండేళ్ల కూతురిని కూడా ఏమాత్రం జాలి లేకుండా రొట్టెముక్కపై సైనెడ్ రాసి ఇచ్చి చంపింది. ఆ చిన్నారి రెండురోజుల పాటు ఆసుపత్రిలో ఉండి మరణించింది. కానీ, షాజుతో పెళ్లికి అడ్డంకి ఉన్న మృతురాలు సిలీ తండ్రైన.. టామ్ థామస్ ను కూడా సైనెడ్ పెట్టి చంపింది. దాంతో షాజుతో తన పెళ్లికి అడ్డంకులను తొలగించుకుంది. ఈ మర్డర్స్ ఈవిధంగా జరుగుతున్నట్టు ఎక్కడా అనుమానాలు రాకుండా.. షాజుకు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ తర్వాత షాజుతో జాలికి పెళ్లైంది.

జాలి చేతిలో మరణించిన రాయ్ సోదరుడు 2019లో పోలీసులకు వరుస మరణాల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. దాంతో సీరియల్ కిల్లర్ జాలి కథ వెలుగులోకొచ్చింది. పోలీసులు ఆరు మృతదేహాలను వెలికితీశారు. పరీక్షలు చేశారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో రెండు మృతదేహాల్లో సైనెడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి.

2019లో జాలీ జోసెఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చారు. కోర్ట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 2023లో కోర్టులో ఆమె ఆ ఆరు హత్యలు తానే చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే, ఈ కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి. కర్రీ అండ్ సైనెడ్ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఏకంగా ఈ రియల్ క్రైమ్ థ్లిల్లర్ ను డాక్యుమెంటరీగా రూపొందించింది.

ప్రతీ ఆదివారం చర్చుకు వెళ్లుతూ.. సమాజంలో సంఘ సేవకురాలిగా జీవిస్తూనే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని మట్టుబెట్టి.. పద్నాలగేళ్లు సీరియల్ కిల్లర్ గా తెరవెనుక ఒక భయంకర సినిమాను చూపించిన జాలి వంటివారి కేసులు వినడానికే భయం పుట్టించేవి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles