1956, june 2nd పుట్టినరోజు సందర్భంగా... మాటలు తక్కువ… ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ .. జస్ట్ దృశ్యమే మాట్లాడే నైపుణ్యం.. ఆ దర్శకుడి నిర్మాణశైలి. సినిమా నిర్మాణంలో కెమెరా పాత్ర… ఆ థర్డ్ ఐ ఒకవేళ మనసుపెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన సినిమా ఓ చక్కటి ఉదాహరణ.
దక్షిణాదంటేనే ఉత్తరాదికి అలసుగా ఉన్న రోజుల్లో… ఆ ఉత్తరాది హేమాహేమీలే ఆ దర్శకుడి సినిమాలో చేయాలనుకునేంత స్థాయికెదిగిన విభిన్నతల కలబోత ఆ డైరెక్టర్. సినిమా అంటే కథ ఎంత ముఖ్యమో… కథనం నడిపించే తీరులో ఉట్టిపడే భావోద్వేగాలు… కట్టిపడేసే కెమెరా యాంగిల్స్ తో కొత్తపుంతలు తొక్కించిన నిర్మాణశైలది.
అందుకే ఈమధ్య జరిగిన కొన్ని ఆన్ లైన్ సర్వేల్లో కూడా ఆయన పేరే నెటిజనం వల్లించుకున్నారట. దృశ్యశ్రవణంలో దృశ్యానికెంత ప్రాధాన్యతనివ్వాలో… ఆ తర్వాత ధ్వనికీ అంతే ప్రాధాన్యతనిచ్చి… అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు… అజరామరమైన పాటలనందించిన కవిహృదయం ఆ దర్శకదిగ్గజం.

ఛయ్య ఛయ్య ఛయ్యా ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్యాను సంతోష్ శివన్ తో కలిసి వణికించే హిమచలిలో అప్పటివరకెవ్వరూ తీయని రీతిలో ట్రైన్ పై షూట్ చేసిన ఆ సీన్స్, ఆ చిత్రీకరణ.. భారతీయ సినిమా టేకింగ్ స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది. గుల్జార్ తో ఆ పాట రాయించుకున్న తీరుపైనా పెద్ద చర్చే జరిగింది. ఆ నిబద్ధత, క్రమశిక్షణ కూడా ఆయన్నుంచి ఇతర బృందమంతా నేర్చుకునే అంశాలంటారు.
భారతీయ చలనచిత్ర రంగాన్ని బిఫోర్ 80.. ఆఫ్టర్ 80గా చూస్తే పెనుమార్పులే కనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్ మన్ మీదుగా… ఇవాళ డిజిటల్ సినిమాగా సాంకేతికంగా రూపుదిద్దుకుంటున్న తరుణమిది. అయితే 1960, 70ల్లో తీసిన కొన్ని మాస్టర్ పీసులను చూసినప్పుడు… 90 తర్వాత.. ఇప్పటికీ కొన్ని సినిమాలతో పోలిస్తే నాటి సినిమాలే బాగున్నాయనేది చాలామంది వాదన. కథ, కథనం, మాటలు, పాటలు, సెట్టింగ్స్ మొదలుకుని నాటి దర్శకుల పకడ్బందీ వర్క్ కల్చర్ నేటి సినిమాల్లో అధికశాతం లోపించిందనే భావన కొంతవరకూ ఉంది. 1980-90 దశకం నుంచి ఊపందుకున్న దక్షిణ భారత సినిమా పరిశ్రమకు.. అంతర్జాతీయ స్థాయి సినిమాతో సరిసమానమైన స్థానాన్ని కల్పించిన దక్షిణ భారతీయ దర్శక దిగ్గజుల్లో మణిరత్నందీ ముందువరుసే.
ఎక్కువ మాట్లాడకపోయే ఆయన వెర్సటైల్ నేచరే… ఆయన సినిమాల్లోనూ గమనించవచ్చు. ఆయన మాట్లాడడు… ఆయనలాగే సినిమాలో తక్కువ డైలాగ్స్ తో దృశ్యాలు మాట్లాడతాయి. మనసులకత్తుకుపోయేలా సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా తెరపైకెక్కించే కళ ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కట్దబెట్టింది. అందుకే నేటి ఎందరో దిగ్దర్శకులకు ఆయనో మార్గదర్శి.
ఆయన సినిమాపై ఈమధ్య విమర్శలూ వినిపిస్తున్నాయి. గతి తప్పిందనే వాళ్లూ కనిపిస్తారు. ఆ అరవం సినిమాని తెలుగులో డబ్ చేసినప్పుడు పలికే డైలాగులు, పాటల విషయంలోనూ ఉన్న అభ్యంతరాలనూ తప్పుపట్టేవే. కానీ వాటిని మించిన అతీతమైన ఏదో శక్తి కల్గిన మాధ్యమమే ఆయన సినిమా! నాల్గు పాటలు, ఐదు ఫైట్లు, మధ్య మధ్యలో కల్పించి పెట్టే నాల్గు కామెడీ జానర్ ఎపిసోడ్లను చూడ్డానికి నేటి జనం అలవాటైన రోజుల్లో… ఆయన సినిమా నిజంగానే బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లా పడుతున్నా.. ఆయనకుండే స్పెషల్ కేటగిరీ ఆడియన్స్ లో మాత్రం ఆ క్రేజ్ తగ్గడం లేదు. ఆయన చెప్పాలనుకునే కోణాన్ని సాధారణ జనం పట్టుకోవడమూ ఒకింత క్లిష్టతరమైన విషయమే అయినా.. దాన్ని సరిగ్గా ఆయన కోణంలో అర్థం చేసుకునే హృదయముంటే… అదో నయనానుభూతి. ఆయన సినిమాలో ధ్వని శ్రవణానుభూతి.
భారతాన్ని స్ఫూర్తిగా చేసుకుని… సూర్య, దేవా, అర్జున్, సర్వారాయుడు వంటి పాత్రలతో తీసిన దళపతి ఓ మాస్టర్ పీస్. కర్ణుడు, దుర్యోధనుడి పాత్రలకు కాస్త విలనిజమద్ది చూపించిన హీరోయిజం… దుర్యోధనుడి పాత్రకు ఆపోనెంట్ విలన్ సర్వారాయుడిగా అమ్రిష్ పురతో సృష్టించిన ఆ పాత్ర ఆయన క్రియేటివిటీకి నిదర్శనం. దళపతైనా, ఘర్షణైనా, ఒక ఇద్దరైనా మైథాలజికల్, హిస్టారికల్ ఇన్సిపిరేషన్స్ తో ఆయన రూపొందించిన మాస్టర్ పీసులే ఆయన సృజనాత్మకతలో కనిపించే హైట్స్!
పల్లవి-అనుపల్లవి నుంచి మౌనరాగం, ఘర్షణ, గీతాంజలి, దళపతి, నాయకుడు, రోజా, దొంగాదొంగా, బొంబాయి, ఇద్దరు,, అమృత, సఖి, యువ, దిల్ సే, గురు, రావణ్, చెలియా, పొన్నియన్ సెల్వన్… ఇలా ఎన్నో మాస్టర్ పీసులందించిన దర్శక రత్నమది. కెమెరా పనితనంలో సాంకేతికంగా ఓ కొత్త ఒరవడిని కనబర్చేందుకు ఆద్యుల్లో ఒకరైన బాలూమహేంద్ర నుంచి… ఇవాళ టాప్ టెన్ సినిమాటోగ్రాఫర్సైన సంతోష్ శివన్, పీసీ. శ్రీరామ్, రాజీవ్ మీనన్, రవి. కే. చంద్రన్, రవివర్మన్ వరకు ఇలా అంతా ఆ మణితో పనిచేయడంతో మరింత తణుకులీనిన రత్నాలే. నాడు ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతంతో మిళితమైన ఆ సినిమాపాట ఎప్పటికీ అజరామరమే. ఓ చిన్న కీబోర్డ్ ప్లేయర్ ను… దేశం గర్వించే ఆస్కార్ అవార్డ్ విన్నర్ గా తీర్చిదిద్దడంలోనూ ఆయదే గురుపాత్ర!
నూతన దర్శకులకు ఓ హ్యాండ్ బుక్. సమకాలీనులకు ఒకింత అసూయ పుట్టించే పోటీదారు. భవిష్యత్ తరాలకు ఆయన సినిమా ఓ చరిత్ర. కెమెరా కన్ను హృదయంతో పనిచేస్తే ఎలా ఉంటుందో ఆయన షాట్ డివిజన్ చెబుతుంది.
పొన్నియన్ సెల్వన్ తో డివైడ్ టాక్ అందుకున్న మణి.. కమలహాసన్ తో నాయకుడు తర్వాత రెండు దశాబ్దాలనంతరం తీసిన థగ్ లైఫ్ పై పెద్ద ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు ఆయన అభిమానులు. కానీ, అది డిజాస్టర్ గా మారడం ఆయన అభిమానులకు కాస్త నిరాశే. భవిష్యత్తులో మణి నుంచి మరిన్ని అద్భుతమైన సినిమాలు రావాలని ఆశిస్తూ.. మణిరత్నానికి జన్మదిన శుభాకాంక్షలు.



