వచ్చే టీ 20 వరల్డ్ కప్ కూర్పెలా ఉండబోతోంది..?

నెక్స్ట్ టీ 20 వరల్డ్ కప్ కు భారత్ కొత్త ముఖచిత్రంతో వస్తే ఎలా ఉంటుంది..? రాబోయే టీ 20 వరల్డ్ కప్ పైన 2026 ఐపీఎల్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. భారీ మార్పులతో పాటు.. కెప్టెన్ సూర్యకుమార్ స్థానే రజత్ పటీదార్ ను కెప్టెన్ గా నియమించే అవకాశాలున్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి శషభిషలు లేకుండా తుది జట్టులో ఆడే అవకాశం ఈసారి కచ్చితంగా వైభవ్ సూర్యవంశీకి కూడా దక్కబోతున్నట్టు సమాచారం.

కచ్చితంగా ఈసారి జరిగిన ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక అనేది జరిగితే మాత్రం… గత టీ 20 వరల్డ్ కప్పుకు కొనసాగింపుగా కాకుండా పూర్తిగా కొత్త దిశలో జట్టు కూర్పు ఉండే అవకాశముండబోతోంది.

ప్రధానంగా ఈ ఎంపికలో అంతర్జాతీయ పేరు, అనుభవం, గత విజయాలు, సీనియారిటీ వంటివాటికి ప్రాధాన్యమివ్వకుండా… ఈసారి ఐపీఎల్ ప్రదర్శనే ప్రధానంగా చూడబోతున్నారన్నది ఓ వార్త.

మరి ఐపీఎల్ ప్రదర్శనతో వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో ఎవరెవరు స్థానం సంపాదించుకోబోతున్నారు..?

గత టీ 20 వరల్డ్ కప్ ఓసారి పరిశీలిస్తే.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్ ప్లేయర్స్ గా ఉన్నారు.

ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా ఈ ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మాత్రం… వచ్చే టీ 20లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి… కేవలం ఈ ఆరుగురు మాత్రమే స్థానాలను నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ టీ 20 ఆధారంగా భారత్ కొత్త టీం ఎలా ఉండబోతోంది..?

1) రజత్ పటీదార్ – కెప్టెన్
2) వైభవ్ సూర్యవంశీ
3) అభిషేక్ శర్మ
4)ఇషాన్ కిషన్
5)శ్రేయాస్ అయ్యర్
6)శుభ్ మన్ గిల్
7) ధృవ్ జురెల్
8) రింకూ సింగ్
9) నితీష్ కుమార్ రెడ్డి
10) కృనాల్ పాండ్యా
11) అక్షర్ పటేల్
12) మొహమ్మద్ సిరాజ్
13) భువనేశ్వర్ కుమార్
14) అన్షుల్ కాంబోజ్
15) వరుణ్ చక్రవర్తి

వీరు అవకాశాలు దక్కించుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

11 మంది తుది జట్టులో ఉండబోయేదెవరు..?

1) వైభవ్ సూర్యవంశీ
2) అభిషేక్ శర్మ
3) ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్)
4) రజత్ పటీదార్ (కెప్టెన్)
5) శ్రేయస్ అయ్యర్
6) రింకూ సింగ్
7) నితీష్ కుమార్ రెడ్డి
8) కృనాల్ పాండ్యా
9) భువనేశ్వర్ కుమార్
10) మొహమ్మద్ సిరాజ్
11) వరుణ్ చక్రవర్తి

ఇక బెంచుకు పరిమితమై పరిస్థితులను బట్టి తుది జట్టులోకి వచ్చేవారిలో..

1) శుభ్ మన్ గిల్
2) ధృవ్ జురెల్
3) అక్షర్ పటేల్
4) అన్షుల్ కాంబోజ్ పేర్లు వినిపిస్తున్నాయి.

నేరుగా తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!

వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో అత్యంత ధైర్యవంతమైన, ఎలాంటి శషభిషలకు ఆస్కారం లేని ఎంపిక ఎవరిదైనా ఉందంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశీ మాత్రమే. తన పెర్ఫార్మెన్స్ తో జట్టులోకి రావడమే కాదు.. 11 మెంబర్స్ తుది జట్టులోనూ సూర్యవంశీకి స్థానం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

ఎందుకంటే, ఐపీఎల్ 2026లో సూర్యవంశీ దుమ్మురేపాడు. 776 పరుగులు చేశాడు. 72 సిక్సర్స్ కొట్టాడు. దాదాపు 238 స్ట్రైక్ రేటుతో ఆడి సంచలనాలకు కేరాఫ్ అయ్యాడు. ట్రోఫీ తర్వాత ఎన్నో అవార్డులనుందుకున్నాడు. గ్రౌండ్ లో చిచ్చరపిడుగై ఎన్నో రికార్డులను చెరిపేసి.. అమాంతం ఎగబాకాడు. అందుకే, వైభవ్ భవిష్యత్తు కోసం ఎదురుచూడాల్సిన ప్రతిభావంతుడు కాదు.. ఏకంగా తుది జట్టులోకే తీసుకోవాలనేంత ఆట అతగాడిది.

విధ్వంసక ఆరంభాలకు మరో ఆయుధం అభిషేక్!

2026 ఐపీఎల్ లో 563 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. 204 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో.. 43 సిక్సర్స్ బాదాడు. అదనంగా పార్ట్ టైమ్ బౌలర్ గానూ ఉపయోగపడ్డాడు.

ఇషాన్ కిషన్ నంబర్ 3లో కీలక పాత్ర పోషించాడు. 602 పరుగులతో 182 స్ట్రైక్ రేటుతో చెలరేగిపోయాడు. వికెట్ కీపర్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు.

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ధృవ్ జురెల్ బ్యాకప్ వికెట్ కీపర్ గా స్థానాన్ని సంపాదించుకునే అవకాశముంది.

కెప్టెన్ గా పటీదార్ సక్సెస్!

వచ్చే టీ 20 వరల్డ్ కప్ ఎంపికలో అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయమే కెప్టెన్ ఎంపిక. శుభ్ మన్ గిల్ గొప్ప సీజన్ ఆడినా.. జట్టు సమతుల్యత దృష్ట్యా పటీదార్ కే ప్రాధాన్యాత దక్కుతోంది. పటీదార్ 193 స్ట్రైక్ రేటుతో 501 పరుగులు చేశాడు. 42 సిక్సర్స్ బాదాడు. తాను ఆడటమే కాకుండా ఆర్సీబీకి చారిత్రాత్మక విజయాన్నందించి వార్తల్లో నిల్చాడు. ఒకవైపు, బ్యాట్స్ మన్ గా.. ఇంకోవైపు, కెప్టెన్ గా రెండూ కలగలిసి సక్సెస్ గా నడిచిన, నడిపించిన పటీదార్ ను విస్మరించడం కష్టం. అందుకే, వచ్చే టీ 20 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ గా మనం పటీదార్ ను చూడబోతున్నామన్న చర్చ జరుగుతోంది.

గిల్ పై ఆధిక్యం సాధించిన శ్రేయస్ అయ్యర్!

గిల్ 732 పరుగులు సాధించినప్పటికీ అతడి ఉత్తమ స్థానం ఓపెనర్ గా మాత్రమే రాణించగలడు. కానీ, టాప్ ఆర్డర్ ఇప్పటికే వైభవ్, అభిషేక్, ఇషాన్ తో నిండిపోయింది. అందుకే, 498 పరుగులు సాధించి.. 170 స్ట్రైక్ రేటుతో మిడిల్ ఆర్డర్ లో రాణించిన శ్రేయస్ అయ్యర్ కే అవకాశాలెక్కువ.

ఇక ఫినిషర్ గా రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్ల అతడికి స్థానం ఖరారైనట్టుగానే తెలుస్తోంది.

ఈ ఎంపికలో అత్యంత ప్రతీకాత్మక మార్పేంటి..?

హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి చోటివ్వడమే ఆ మార్పు. 138 స్ట్రైక్ రేటుతో 206 పరుగులు చేసి, 4 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా కన్నా.. నితీష్ కుమార్ రెడ్డి 171 స్ట్రైక్ రేటుతో 302 పరుగులు సాధించి, 8 వికెట్లు పడగొట్టాడు.

ఇలాగే కృనాల్ పాండ్యా వర్సెస్ వాషింగ్టన్ సుందర్ విషయంలోనూ పోటీ ఎదురై బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన పాండ్యాకే ఓటేసినట్టుగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ రిజర్వ్ ఎంపికలో ఉండబోతున్నాడు. భువి బౌలింగ్ కు వెన్నెముక కానున్నాడు. ఐపీఎల్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టి మళ్లీ ముందుకు దూసుకొచ్చాడు. అన్షుల్ కాంబోజ్ ఎకానమీ కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ లో తను 21 వికెట్స్ తీయడంతో సెలెక్టర్స్ అతడిపై దృష్టి సారించారు.

ఇక గత జట్టులో ఉండి ఈసారి స్థానం దక్కదనే ప్రచారం జరుగుతున్న వారి గురించి!

ఒక సీజన్ లో పటీదార్, శ్రేయస్, ఇషాన్ కంటే వెనుకబడి సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశముంది. ఇక సంజూ శాంసన్ కు సంబంధించి చూస్తే ఇప్పటికే ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్ ఉన్నందున మూడో వికెట్ కీపర్ కు ఆస్కారం లేదు. మిడిల్ ఆర్డర్ బలంగా ఉండటం వల్ల తిలక్ వర్మకూ ఛాన్స్ కష్టమే. ఇక వీరితో పాటు ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ గా అందిరనీ ఆకట్టుకున్నప్పటికీ బూమ్రా ఈ ఐపీఎల్ సీజన్ లో కేవలం నాల్గు వికెట్లు మాత్రమే తీయడంతో అతడి ఉనికి కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఇక అర్షదీప్ వికెట్స్ తీసినప్పటికీ ఎకనామీ రేట్ ఎక్కువ ఉండటం మైనస్ గా మారింది. కుల్దీప్ కంటే వరుణ్ చక్రవర్తి బెటర్ ఫెర్ఫార్మెన్స్ అతడికి అవకాశం కల్పించొచ్చు. ఇక వాషింగ్టన్ సుందర్.. కృనాల్, అక్షర్ తో పోలిస్తే బెటర్ పెర్ఫార్మ్ చేయలేకపోవడం మైనస్.

ఈ జట్టు ఎందుకు ప్రత్యేకం..?

భావోద్వేగాలు, రాజకీయాలు, పేరు గొప్పకు, గత ఘనతలకు ప్రాధాన్యమివ్వని కూర్పు ఇది. ఐపీఎల్ 2026లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినవారినందరినీ ఒక్కచోటకు చేర్చే జట్టు. ఇదే టీం సెలక్టైతే మాత్రం భారత టీ 20 క్రికెట్ లో రజత్ పటీదార్ నాయకత్వంలో వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా.. శుభ్ మన్ గిల్ బెంచ్ పై నిరీక్షిస్తూ ఆరంభం కావడం మాత్రం ఖాయం. అదే జరిగితే ప్రతిష్ఠ కంటే ప్రదర్శనే గెల్చినట్టవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles