ఓసారి ప్రయత్నించాం.. అనుకున్నది దక్కలేదు. రెండోసారీ అదే జరిగింది. మూడోసారీ చేదు అనుభవమే. నాల్గోసారీ చుక్కెదురైంది. ఐదోసారీ అంతే సంగతులు. ఇంక ఆరోసారి యత్నించేందుకు మనసొప్పకపోవచ్చు. కానీ, అలా ఒప్పకపోతే… విజయ్ వర్ధన్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకోం. ఎన్నో కథలున్నా.. థ్రిల్లింగ్ స్టోరీలా ఇలా చెప్పుకోకపోయేవాళ్లం. పైగా విజయమే తన చిరునామా అన్నట్టు.. విజయ్ వర్ధన్ అనే పేరు.. మరోవైపు ఎప్పటికప్పుడు వెక్కిరించే అపజయాలు.. చివరకు తన పేరును సార్థకం చేసుకున్నాడా విజయ్ వర్ధన్.. ? తెలుసుకుందాం పదండి!
ఒకటి కాదు.. రెండు కాదు… పది కూడా కాదు… ఏకంగా 35 సార్లు వివిధ పోటీ పరీక్షల్లో ఫెయిలవుతూనే ఉన్నాడు. ఎంత ప్రతిభావంతుడైనా… సక్సెస్ కోసం పరిగెడుతున్న ప్రతీసారీ ఓటమి వెటకారమై వెక్కిరిస్తే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఢీలా పడతాడు. కేవలం స్వశక్తిని నమ్ముకునే.. శాస్త్రీయ దృక్పథం కల్గి ఉండి కూడా… చివరకు తానో దురదృష్టవంతుణ్ననుకుంటూ ఈ జన్మకింతేననుకుంటాడు.

కానీ, విజయ్ వర్ధన్ అలా చేయలేదు. విజయ్ వర్ధన్ దృష్టిలో.. FAILURE IS NOT THE OPPOSITE OF SUCCESS! IT IS PART OF SUCCESS!! పరాజయమెప్పుడూ విజయానికి వ్యతిరేకం కాదు.. అది విజయంలో ఒక భాగమని నమ్మాడు. అందుకే పడిపోయినప్పుడల్లా ఉత్తుంగ తరంగమై లేచాడు. వైకుంఠపాళీలో పాములు మింగినప్పుడల్లా నిచ్చెనలెక్కుతూ… మొత్తంగా తానేర్పర్చుకున్న జీవిత లక్ష్యమైన ఐఏఎస్ ను 2021లో సాధించాడు.
విజయ్ వర్దన్ ది హర్యానా రాష్ట్రంలోని సిర్సా గ్రామం. చిన్నప్పట్నుంచే దేశ సేవ చేయాలనే కలలు కంటూ పెరిగాడు. స్వగ్రామంలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన విజయ్ వర్ధన్.. ఆ తర్వాత హిస్సార్ లో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
బీటెక్ పూర్తైన విజయ్ కి… చాలామందిలాగే పోటీ పరీక్షలపైకి వెళ్లింది మనసు. అలా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీపీఎస్సీ, ఎస్సెస్సీ, సీజీఎల్ వంటి ప్రతీ పరీక్షా రాస్తూ వచ్చాడు. పరీక్ష రాయడమేమోగానీ… తానే పరీక్షలో అనుకున్నది సాధించలేకపోవడంతో… ఓవైపు పట్టుదల, కసి, మరోవైపు తనకే ఎందుకిలా జరుగుతోంది.. తానో విధి వంచితుణ్నా అనే బాధ వేసేది. కానీ, ఆగిపోకుండా ప్రయత్నించడం… ప్రతీ ఎదురుదెబ్బనూ గుణపాఠంలా మార్చుకుని, నేర్చుకుని పొరపాట్లను పునరావృతం కాకుండా ముందుకెళ్లడమే విజయ్ ను విజయతీరాలకు చేర్చింది.
అలా 2018లో మొదట ఐపీఎస్ అధికారిగా విజయ్ విజయ ప్రస్థానం మొదలైంది. అదే తన జీవితంలో అప్పటివరకకూ ఎదురుచూస్తూ 30కి పైగా పోటీ పరీక్షలు రాసిన నిరీక్షణ నుంచి తనను ఒక మెట్టు పైకెక్కించిన ఓ వేడుకైంది. అలా ఆల్ ఇండియా 104 ర్యాంకుతో ఐపీఎస్ అయినా కూడా.. అప్పటివరకూ తనకు విజయం దక్కుతుందో, లేదో కూడా తెలియని దశలో పోరాటం చేస్తున్న విజయ్… సంతృప్తి మాత్రం చెందలేదు సరికదా… కొడితేగిడితే ఐఏఎస్సే కొట్టాలనే సంకల్పంతో ప్రయత్నించాడు. అలా 2021లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సాధించి సుదీర్ఘపోరాటంతో తన కల నెరవేర్చుకున్నాడు.
తనెప్పుడూ నిరాశ పడకుండా.. ఎంత కఠిన పరిస్థితుల్లోనూ మానసిక దృఢత్వాన్ని కోల్పోకుండా… ఆశాజీవిగా ప్రయాణించడం.. అందుకు తగ్గ నిరంతర శ్రమ, కృషితోనే తనకు ఐఏఎస్ దక్కిందని ఓ సారి మీడియా ఇంటరాక్షన్ లోనూ.. అలాగే, సివిల్స్ ప్రిపేరవుతున్న అభ్యర్థులకూను చెప్పుకొచ్చాడు విజయ్ వర్ధన్.
35 పోటీ పరీక్షలంటే మాటలా…? అంత ఓపిక… అంత పట్టుదల… పడిపోతున్న ప్రతీసారీ అదే ఎత్తున లేవడం… మొక్కవోని సంకల్పం, ఆత్మవిశ్వాసం… వెరసి విజయ్ వర్ధన్ అనే ఐఏఎస్ స్టోరీ. కల కంటే ఎప్పటికీ వదులుకోవద్దనే ప్రతిధ్వని విజయ్ వర్ధన్ కథలో ఘోషిస్తుంది. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్నవారితో పాటు.. పోటీ పరీక్షలవైపు చూసే ఎందరికో… ఓ ఆశాకిరణంలా కనిపించే కథ విజయ్ వర్ధన్.



