ఏ పాత్రలోనైనా.. ఆమె రాణీనే!

పలు కోణాల్ని స్పృశించే.. ‘Hichki’

There are no bad student, only bad teachers… ఇదిగో ఈ వాక్యమే Hichki మూవీ మోటో! 2018లోనే వచ్చింది. కానీ ఓటీటీల పుణ్యమా అని ఓ లుక్కేస్తే.. తక్కువ నిడివిలో ఎక్కడా బోర్ లేకుండా… ఎన్నో అంశాల్ని సున్నితంగా స్పృశించే సినిమా. హీరోలను కూడా డ్యామినేట్ చేయగల సత్తా ఉన్న రాణీముఖర్జీ Hichkiకి ఎస్సెట్.

టారెట్ సిండ్రోమ్ అనే న్యూరాలోజికల్ డిజార్డర్ తో చిన్ననాటి నుంచే ఇంటా, బయటా అవమానాలకు గురయ్యే పాత్రలో… నైనామాథూర్ గా రాణీ చేసిన పాత్ర… నిజంగా ఆమె ఏ పాత్ర ఇచ్చినా రాణి అంత స్థాయిలోనే చేయగలదనిపిస్తుంది. మధ్యమధ్యలో ఒక రకమైన యూనిక్ సౌండ్స్ చేస్తూ.. పబ్లిక్ మూడ్ ను తనవైపు తిప్పుకునే విడ్డూరమైన పాత్రలో.. నెర్వస్ గా ఫీలయ్యేకొద్దీ డిజార్డర్ మరింతెక్కువ కనిపించే పాత్రలో… చిన్ననాట విద్యార్థి దశ నుంచి… పెద్దగయ్యాక గురువు పాత్ర వరకూ అపహాస్యాలను, అవమానాలను, సవాళ్ళను ఎదిరించి… తాననుకున్న లక్ష్యాన్ని సాధించే పాత్ర నైనామాథూర్ గా రాణీముఖర్జీది.

చిన్ననాట స్కూల్ లో తన సిండ్రోమ్ తో అంతా ఎగతాళి చేసినా… వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయుడి స్ఫూర్తే.. రాణీని టీచర్ వృత్తినెంచుకునేలా చేస్తుంది. తను సరిగ్గా మాట్లాడలేదని… టీచింగ్ ప్రొఫెషన్ తనకు ఏమాత్రం సరికాదని తండ్రి నుంచే ఆమెను నిరుత్సాహపర్చడం.. ఆమెలో ఒకింత ఆవేదనకు కారణమైనా.. తాను మాత్రం అనుకున్నది సాధించే ప్రయత్నం.. ఆమెలోని మానసిక బలాన్ని టార్చ్ వేసి మరీ చూపిస్తుంది. తను టీచర్ కావాలన్న యత్నంలో సుమారు 18 స్కూళ్లలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు కాళ్ళకు చెప్పులరిగేలా తిరుగుతుంది. చివరకు ముంబైలోని ఓ స్కూల్ లో ఆమె డిజార్డర్ ను తోసిరాజని.. ఆమె పట్టుదలకు ప్రిన్సిపాల్ పట్టం కట్టడంతో.. టీచర్ కావాలన్న కలైతే నెరవేరుతుంది. కానీ మళ్ళీ అక్కడ సవాళ్లు మొదలైతాయి. మురికివాడల వద్ద ఆ స్కూల్ నిర్మాణం చేసే క్రమంలోనే జరిగే ఒప్పందం ప్రకారం… హైఫై కుటుంబాలకు చెందిన వారితో పాటు… ఆ మురికివీధుల్లో పిల్లలకూ కోటా ఉంటుంది. ఏ టీచరూ బాగు చేయలేని వారికి క్లాసులు చెబుతానంటేనే.. నీకు టీచర్ జాజ్ అనే కండిషన్ మీద రాణీ ఆ స్కూల్ లో జాయిన్ అవుతుంది. క్రమశిక్షణంటే తెలియని.. దురలవాట్లకు పరాకాష్ఠైనవారిని టాపర్స్ గా నిలపడం… అదే సమయంలో అప్పటికే మంచి హోల్డ్ తో ప్రిన్సిపాల్ నమ్మకాన్ని చూరగొని.. కాస్త డబ్బులున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెప్పే మరో ఒకింత కన్నింగ్ మాష్టార్ నీరజ్ కబీతో నెలకొనే పోటీ… చివరగా సాధించే విజయం… ఇలా సాగుతుంది Hichki.

అయితే సినిమా మొత్తం రాణీముఖర్జీ పాత్ర.. దానికి తోడు సింప్లీసిటీతో కూడిన ఆమె నటనే సినిమాలో ఫోకస్డ్ గా కనిపిస్తుంది. మరోవైపు దర్శకుడు సిద్ధార్థ్ . పి. మల్హోత్రా… ఒక వ్యాధితో బాధపడే మహిళ తాననుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగల్గిందనే అంశంతో పాటు… స్కూళ్లలోనూ, ఇంకెక్కడైనా ధనిక, పేద అంతరాలెలా ఉంటాయనే కోణాన్నీ.. అలాగే, నైనాలాంటి కూతుళ్లను అవమానంగా భావించే పేరెంట్స్ ఉంటే.. బంధాల.మధ్య నెలకొనే మానసిక సంఘర్షణ వంటివాటిని స్పృశించే యత్నమే Hichki.

అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ మూవీ.. వర్తమాన విద్యార్థినీ, విద్యార్థులకూ ఓ స్ఫూర్తినిచ్చే సినిమా. ఇప్పుడు మళ్లీ స్కూల్స్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఓ లుక్కెయొచ్చు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles