చిక్కుల ముడి విప్పిన రెక్కల మనసై.. ఓసారలా ఆ కాలయంత్రమెక్కేస్తే!

పేరుకు తగ్గట్టే ఎప్పటికీ రిలవెంటే.. ఆదిత్య 369!

గుండె గుబులుని గంగకు వదిలి.. ముందు వెనకలు ముంగిట వదిలి… ఊరి సంగతి ఊరికి వదిలి.. దారి సంగతి దారికి వదిలి… ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..? వేదం సినిమాలో పాట రూపంలోని ఆ కవి హృదయం.. అప్పుడో ఎప్పుడో ఓ సమయంలో ప్రతీ వ్యక్తిలో ఆవిష్కృతమవుతూనే ఉంటుంది బహుశా! అయ్యేదుందా… చేసేదుందా…? కానీ, కాస్సేపలా అనుకోవడానికేముందీ…? అందుకే 33 ఏళ్ల కాలం నాటి కాలయంత్రంలోకి అడుగెట్టి… గిర్రున ఓసారి అలా వెళ్లొద్దాం. ముచ్చట గొలిపే మూడు దశాబ్దాల కిందట 1991లో విడుదలైన ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి ఓసారి యాజ్జేసుకుందాం!

హాలీవుడ్ తో పోల్చినప్పుడు… సైన్స్ ఫిక్షన్ సినిమాల రూపకల్పనలో ఈనాటికీ మనమెక్కడో ఉంటాం. కానీ ఏనాడో అలాంటి సినిమాని మన నేటివిటీకి తగ్గట్టుగా రూపకల్పన చేసిన ఘనత సింగీతం శ్రీనివాసరావుది. పుష్పక విమానం వంటి పూర్తి స్థాయి మూకీ సినిమాతో ప్రయోగాలకు పెట్టింది పేరైన సింగీతపు మరో ఎక్స్పరిమెంటల్ వండర్.. ఆదిత్య 369. ఎన్టీఆర్ కొడుకైన బాలయ్య నటిస్తున్నందుకు ముందుగా ఆ సినిమాకు యుగపురుషుడనో, జగదేకవీరుడనో… లేక, టైం మిషన్ బేస్డ్ కాబట్టి, కాలయంత్రమనో.. పేరు పెట్టాలనుకున్నారట. కానీ, బాలయ్య.. నాన్న ఎన్టీఆర్ సినిమాల పేర్ల జోలికి వెళ్లొద్దంటే మళ్లీ నిర్మాత, దర్శకులు ఒకింత ఆలోచనలో పడ్డారు. దాంతో టైం మిషన్ బేస్డ్ మూవీ కాబట్టి.. కాలంతో ప్రయాణం చేసేవారెవన్నది ఆలోచించినప్పుడు సూర్యుడు కాబట్టి… అలా ఆదిత్య 369గా ఫిక్స్ అయింది. అలా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను మన కళ్ల ముందుంచాడు సింగీతం తన సినిమాతో.

ముందుగా చెప్పుకున్నట్టుగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందనుకున్న పాటకూ.. ఆదిత్య 369 సినిమా నేపథ్యానికీ.. ఏంటీ సంబంధమనే ఒకింత చిన్న చర్చ చేస్తే… ఏ వ్యక్తికైనా వందేళ్ల జీవితంలో యావరేజ్ గా యాభై, అరవై ఏళ్లనుకున్నా… ఒక్కోసారీ అదీ బోరే. అందుకే, విహారయాత్రలు, తీర్థయాత్రల పేరిట ఎవరికి తోచినంతలో వారు.. ఎవరి ఆర్థికస్థితిని బట్టి వారు అలా సరదా ప్రయాణాలు చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లో బస్సులెక్కి దిగడం, సుదూర ప్రయాణాలకు ట్రైన్ టిక్కెట్స్ దొరక్కపోవడం, వెయిటింగ్ లిస్ట్, ఫ్లైట్ ఛార్జీలూ మనమనుకున్న సమయాల్లో అందుబాటు ధరల్లో ఉండకపోవడం.. పోనీ, సొంత వెహికిల్స్ లో వెళ్దామంటే లాంగ్ జర్నీలకు వెళ్లడమెలా అనే ఆలోచనలు వెరసి… అలాంటి సమయంలో మనకు ఆదిత్య 369 టైం మిషన్ గుర్తుకు రావొచ్చుగా..? అంతేనా… రాయల చరిత్ర గురించి అక్కడో ఇక్కడో చదివినా.. ప్రత్యక్షంగా చూడాలంటే విజయనగరానికి వెళ్లాల్సిందే. వెళ్లినా, ఆనాటి ఆనవాళ్లు మాత్రమే చూసి.. ఓహో ఇలా ఉండేదా అనుకోవడం మినహా… నిజమైన రాయల కాలాన్నే చూడలేంగా…? అందుకే, అలాంటి సమయంలో సింగీతం ఐడియా ఎంత బాగుందనిపించదూ..? ఎప్పుడూ ఏ హైదరాబాదో, విశాఖపట్నమో… మరీ దూరమనుకుంటే ఏ షిమ్లానో, గోవానో.. ఇంకొంచెం ధనవంతులైతే ఏ అమెరికానో, ప్యారిస్ నో పోదామనుకునేవాళ్లంతా… బాలయ్య వెళ్లొచ్చినట్టుగా ఏ రాయల కాలానికో, ఏ శాలివాహనుల శకాన్నో, లేక కాకతీయ రాజుల కళావైభవాన్నో… లేక రాబోయే భవిష్యత్తెలాంటో ఉంటుందో తెలుసుకోవడానికో వెళ్లిరారూ!

అవును… పాతొక రోత… కొత్తొక వింత అన్నట్టుగా… మనిషి భూమ్మీదున్న పర్యాటక వనరులతో సంతృప్తి పడని కాలాన… ఇంకా ఏదో ఛేదించాలన్న తపనతోనో… సాధించాలన్న కసితోనో… కనీసం చూసైనా రావాలన్న తలంపుతోనో అంతరిక్షయానాలకు ఎగిరిపోతున్న వేళ… అదే ఆదిత్య 369లోని సింగీతపు మానస పుత్రికైన కాలయంత్రమే మన చేతిలో ఉంటే…? ఆహా ఆ మజానే వేరంటారా…? అందుకే ఆ అనుభూతులను నిజజీవితంలో పొందలేని వారంతా… ఆ సినిమాతో పొందారు కాబట్టే… ఇవాల్టికీ ఆదిత్య 369 అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పటికీ మనందరినీ రకరకాలుగా భిన్నకోణాల్లో అలరిస్తోంది. చర్చించుకునేలా చేస్తోంది. మళ్లీ మళ్లీ ఆ డిఫరెంట్ జానర్ ఫాంటసీ కాలయంత్రంలోకి చొరబడే ఆలోచనను రేకెత్తిస్తోంది.

గ్రాఫిక్స్ లేని కాలాన.. కేవలం కెమెరాలతో సృష్టించిన ఓ అద్భుతం కాబట్టే.. ఇప్పటికీ అంతే ఆసక్తితో ఆదిత్య 369 చర్చల్లో ఉంటోంది. కాలయంత్రంతో ముడిపడ్డ ఆదిత్య 369కు రూపకల్పన కూడా గాల్లోనే జరిగింది. అవునూ… ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు దర్శకులు సింగీతం.. దివంగత గాయకుడు బాలూకు చెప్పడం… ఆయన నిర్మాత కృష్ణప్రసాద్ తో చర్చించడం… బాలూ, కృష్ణప్రసాద్, సింగీతం ముగ్గురూ కలిసి బాలకృష్ణకు చెప్పడం… రాయల పాత్ర అనగానే, వినగానే సహజంగానే బాలయ్య ఎగిరి గంతేయడం… ఇలా ప్రీ ప్రొడక్షన్ వర్కంతా ఆదిత్య 369కు శరవేగంగా జరిగిపోయింది. ఆ ప్రొడక్షన్ సమయం మాటలకందని ఓ అనుభూతిగా సింగీతంతో పాటు.. పలుమార్లు బాలు, నిర్మాత కృష్ణప్రసాద్ చెప్పిన సందర్భాలూ ఎన్నో.

దర్శకుడు సింగీతం భావాలను ఒడిసిపట్టేలా సెట్టింగ్స్ వేసిన కళాదర్శకుడు పేకేటి రంగా నుంచి మొదలుకుంటే… వర్తమానపు ప్రతీ ఫ్రేమునూ పీ.సీ. శ్రీరాం.. భూతకాలపు దృశ్యకావ్యాలను వీ.ఎస్.ఆర్. స్వామి.. భవిష్యత్ ముఖచిత్రాలను కబీర్ లాల్ వంటి ఛాయాగ్రాహకుల మూడు రెండ్ల ఆరు కళ్లకు తోడు… ముగ్గురూ తమ థర్డ్ ఐ విజన్ ను దృశ్యరూపం చేసిన తీరు ఓ అద్భుత:

ఇక ఇళయరాజా సంగీతంలో జాణవులే అంటూ అలరించే జిక్కీ గానం.. సెంచరీలు కొట్టే వయస్సు మాది అన్న లేటెస్ట్ ట్రెండ్స్ నుంచీ.. నాటి రాయలకాలపు శైలిని ప్రతిబింబించేలా కూర్చిన సుందరం మాస్టారు, ఆయన తనయులు ప్రభూదేవా, రాజు సుందరపు నృత్యరీతులు.. ఇలా వేటికవే ఆదిత్య 369కు ప్రత్యే’కథల’య్యాయి. అంతేకాదు… సినిమాలో వాడిన క్యాస్టూమ్స్, నగలు, స్క్రీన్ ప్లే.. ఇలా ప్రతీది కాలయంత్రంతో పోటీపడి ఆదిత్య 369ను ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలబెట్టాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి నటించాల్సి ఉండగా.. ఆమె బిజీ షెడ్యూల్ తో.. సినిమాటోగ్రాఫర్ బంధువైన మోహినికి ఆ అవకాశం దక్కింది.

అందుకే ఆదిత్య 369 సినిమా ఇప్పటికీ… ఇంకెప్పటికీ రిలవెంట్. ఒక సినిమా తీసిన కాలం.. అది పాతదో, కొత్తదో చెప్పేస్తుంది. కానీ, సింగీతపు అద్భుత సృష్టైన ఆదిత్య 369.. మూడు దశాబ్దాల కింద తీసినా.. స్పీల్ బర్స్ తీసిన బ్యాక్ టూ ఫ్యూచర్ ను పోలి ఉన్నా.. మన నెటివిటీని ప్రతిబింబిస్తూ ఆబాలగోపాలన్నలరించింది. అందుకే.. ఆదిత్య 369 ఇప్పటికీ, ఇంకెప్పటికీ.. రిలవెంటే!

తన ఆలోచనలు వచ్చిందే తడవుగా వాటిని వ్యక్తీకరించి… ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగుతెరపై ఆవిష్కరించిన సింగీతం… ఇళయరాజా సంగీతం… గానమేగాదు సినిమాకు మరో మిత్రుడితో కలిసి డబ్బు పెట్టి ప్రాణమైన బాలు… దర్శకుడి ఆలోచనల ప్రతిరూపానికి అచ్చుగుద్దినట్టు అతికిన బాలయ్య… తమ కళావిశిష్ఠతలతో 24 ఫ్రేముల్లో ఓ సినిమా అంటే ఎలా ఉండాలో ఆదిత్య 369తో పట్టిచూపించి.. సినిమానే కాదు… చూసిన జనాన్నీ ట్రైమ్ ట్రావెలింగ్ చేయించిన సాంకేతిక బృందమంతా నిజంగా అభినందనీయులే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles