గోవా పర్యాటకానికి దిక్సూచైన.. ఓ ఆఫ్రికన్ బతుకుదెరువు కథ!
గోవా అంటే ఓ కలల ప్రపంచం. ల్యాండ్ ఆఫ్ సన్.. స్యాండ్ ఆఫ్ బీచెస్. భారతదేశ యువతకే కాదు.. విదేశీయులకూ ఓ టూరిస్ట్ హబ్. ఒక్కసారైనా గోవా చూడాలనుకోకపోతే… ఆ యువకుల్లో ఏదో లోపమున్నట్టేనన్నంత క్రేజీ టూర్. ఒక్క యువతేంటి..? 60లో పడ్డవారినీ 20ల్లోకి తీసుకురాగల్గే విహారయాత్ర. ఫ్యామిలీస్ తో కూడా వెళ్లి గోవా టూరిజాన్ని అనుభూతి చెందేవారి సంఖ్యా తక్కువేమీ కాదు. అలాంటి గోవా టూరిజం వెనుక ఉందెవ్వరు..? తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ కథనంతో.. ఆ గోవా వరకూ వెళ్లొద్దాం రండి.
గోవా టూరిజం గురించి మాట్లాడుకోవాలంటే… బీజం వేసిన వారి గురించి చెప్పుకోవాలి. అదే సమయంలో గోవాలో పాప్యులరైన టిటోస్ నైట్ క్లబ్ గురించి మాట్లాడుకోవాలి.

టిటోస్ క్లబ్ వ్యవస్థాపకుడు హెన్రీ డిసౌజా. ఈయనే ఇవాల్టి గోవా టూరిజంకు ఆద్యుడు. హెన్రీ డిసౌజా ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ వలసవాది. 1971లో ప్రస్తుతం మనం బాగా బీచ్ గా పిల్చుకునే సముద్రతీరంలో.. షాక్ అని పిల్చుకునే.. ఓ గుడిసె తరహా చూడముచ్చటగా ఉండే ఓ షెల్టర్ ను ఏర్పాటు చేశాడు. దానికే టిటోస్ అని నామకరణం చేసి.. ఓ చిన్న హోటల్ తో నాడే హాస్పిటాలిటీ రంగంలోకి అడుగుపెట్టాడు.

తండ్రి మరణం తర్వాత ఆయన కుమారులైన రికార్డో డిసౌజా… తన సోదరుడైన డేవిడ్ డిసౌజాతో కలిసి కేవలం పద్నాలగేళ్ల వయస్సులోనే ఈ హోటల్ ను టేకప్ చేయాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు రికార్డో, డేవిడ్ డిసౌజాల బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 45 రూపాయలు మాత్రమే. ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు ఊరు కాని ఊరు.. ఆ చిన్న హోటలే ఆధారం.. అలాంటి సమయంలో ఎన్నో సవాళ్లనెదుర్కొని.. తమ హోటల్ కు ఓ గుర్తింపు తీసుకొచ్చి ఇప్పుడు 350 కోట్ల రూపాయల టర్నోవర్ తో టిటోస్ ను హాస్పిటాలిటీ రంగంలో అప్రతిహతంగా నడిపిస్తున్నారు డిసౌజా సోదరులు. ఇవాళ గోవా టూరిజం పేరిట అక్కడ వెలిసిన హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, నైట్ క్లబ్స్, క్యాసినోస్.. ఇలా అన్నింటికీ ఈ టిటోసే మూలం. అందుకు ఆద్యులు తండ్రి హెన్రీ డిసౌజా ఐతే… వాటిని అభివృద్ధి చేసి.. గోవాను భారతావనిలోనే మిగిలిన స్టేట్స్ తో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది రికార్డో అండ్ డేవిడ్ డిసౌజా.
టిటోస్ లో ఆ కాలంలో కరెంట్ లేకపోయేది. కరెంట్ బిల్లు చెల్లించే డబ్బుల్లేక.. క్యాండిల్ లైట్.. మూన్ లైట్ రెస్టారెంట్ గా మల్చి.. తమ రెస్టారెంట్ ను ప్రత్యేకంగా నిలబెట్టి జనాన్ని ఆకర్షించడం మొదలెట్టారు డిసౌజాలు. ఇప్పటికీ గోవాలో ఆ చంద్రకాంతిలో స్వేచ్చగా ఆడిపాడే క్యాసినోలు.. సముద్రతీరాల్లో, సముద్ర నడిబొడ్డున కనిపిస్తాయంటే.. తమకున్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడమే డిసౌజా బ్రదర్స్ చేసిన తెలివైన పని. ఆ ట్రెండ్ సెట్ చేసిన ఘనత కూడా టిటోస్ నైట్ క్లబ్ దే. ఓ చిన్న హోటల్ గా ఆరంభమై.. రెస్టారెంట్ గా మారి.. ఇప్పుడేకంగా క్లబ్స్, రిసార్ట్స్, క్యాసినోస్.. వాట్ నాట్.. ఆతిథ్యరంగంలో టిటోస్ ఓ బడా బ్రాండ్.
గోవాలో దాదాపు ప్రతీ బీచ్ లోనూ ఇప్పుడు టిటోస్ నైట్ క్లబ్స్, టిటోస్ ఏరీనాస్, మ్యాంబోస్, కేఫ్స్, రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా విస్తరించింది. లక్షల మంది పర్యాటకులు ఈ టిటోస్ ను సందర్శిస్తున్నారు. ఏకంగా ఒక లేన్ పేరే.. టిటోస్ లేన్ గా గుర్తింపు పొందిందంటే.. నార్తర్న్ గోవాలో ఒక చిన్న హట్ తో ప్రారంభమైన ఈ బిజినెస్ ఇంతింతై.. ఎంతలా ఎదిగింది.. మొత్తంగా గోవా పర్యాటకాన్నే ఎలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.
షారుఖ్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ వంటి బాలీవుడ్ తారల నుంచీ.. రిచర్డ్ గేర్, కేట్ మాస్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ వరకూ.. గ్లోబల్ సెలబ్రిటీస్ అంతా టిటోస్ కు క్యూ కడుతుంటారు. ఇక్కడ సెలబ్రిటీలకు ప్రత్యేకమంటూ ఏమీ ఉండదు. మిగిలినవారితో కలిసి వారూ గంతులేసే స్వేచ్ఛ.. ఎంజాయ్మెంటే.. టిటోస్ ప్రత్యేకత. అందుకే సెలబ్రిటీస్ కూ.. సామాన్యులతో కలిసి ఎంజాయ్ చేసే అవకాశాలను కల్పిస్తుండటమే.. టిటోస్ ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఆదరించడానికి కారణం.
ఇవాళ గోవా బేస్డ్ గా సినిమాల రూపకల్పనకూ ఎంతో డిమాండుంది. దిల్ చాహతా హై, గో గోవా గాన్ వంటి ఎన్నో బాలీవుడ్ సినిమాలు ఎంత పెద్ద హిట్సో తెలిసిందే. ఆపాత మధురాల్లోనూ గోవా పర్యాటకానికి ఓ ప్రత్యేక స్థానముంది. అందుకే, గోవా సమ్థింగ్ స్పెషల్.
గోవా అంటే పడమటి కనుమలు… అరేబియన్ సముద్రం.. పోర్చుగీస్ వారి జ్ఞాపకాలను కళ్లకు కట్టే ఇళ్ల నమూనా.. అద్భుతమైన శిల్పంతో కట్టిన పురాతన చర్చులు… నహీ నహీ కభీ నహీ, భారత్ గోవా అలగ్ నహీ.. లాఠీ, గోళీ ఖాయేంగే, ఫిర్బీ గోవా జాయేంగే అంటూ సోషలిస్ట్ నాయకుడు మధు దండావతే వంటివారు పోర్చుగీస్ వారిని తరమికొట్టేందుకు చేసిన ఉద్యమ చరిత్ర… ఇలా ఇవన్నీ నాణానికి ఒకవైపు గోవా వింటేజ్ జ్ఞాపకాలను కళ్లకు కడితే.. నాణానికి మరోవైపు, గోవా అంటే సరసమైన ధరలకు లభించే మద్యం, జూదం.. గోవా అంటే నైట్ క్లబ్ డ్యాన్స్ కల్చర్… గోవా అంటే మకావు.. ఇలా ఓవైపు పురాతన సంప్రదాం.. మరోవైపు ప్రాశ్చాత్య సంస్కృతి.. మిళితమైన ఓ వైవిధ్యం. సంప్రదాయ భారతాన.. ఓ వైవిధ్యమైన వెస్టర్న్ కల్చర్ కోసం ఇంకేదో దేశం వెళ్లాల్సిన పని లేకుండా.. ఇటు స్వదేశీయులకూ, అటు విదేశీయులకూ ఆతిథ్యమిచ్చే ఓ స్వర్గసీమ. ఇంతలా గోవాను టూరిజంకు కేరాఫ్ గా మార్చిన డిసౌజా బ్రదర్స్.. ఇప్పుడు నాన్ ఆల్కాహాలిక్ కాఫీ షాపులను కూడా దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీస్ స్థాపించేందుకు అడుగులు వేస్తున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో కూడా తమ ఆతిథ్య రంగాన్ని మరింత విప్లవాత్మకంగా మార్చేందుకు యత్నం జరుగుతోందంటున్నారు డిసౌజా బ్రదర్స్.
గోవా అంటే ఎందరికో ఓ కలల సామ్రాజ్యమనుకునే తరుణంలోనే.. సనాతన, సంప్రదాయాలను ఆచరించేవారికి గోవా వంటి పర్యాటకమన్నా.. డిసౌజా లాంటివారన్నా ఇష్టముండకపోవచ్చు. అయితే, డిసౌజాస్… ఇవాళ గోవాను ప్రాశ్చాత్య నాగరికతకు కేరాఫ్ లా తమ టిటోస్ తో బీజం వేసి ఎంతలా ప్రభావితం చేశారో.. వారిలోనే మరో మానవీయ కోణమూ కనిపించడం విశేషం.
కోవిడ్ 19 సమయంలో డిసౌజాస్ చేసిన సేవలు గోవా మరువలేనివి. చిన్నపిల్లలు, వృద్ధుల కోసం అనాథ శరణాలయాల నిర్వహణ.. జంతు సంరక్షణ కేంద్రాల నిర్వహణ వంటివెన్నో వారిలోని మానవత్వాన్ని చాటిచెప్పే స్వచ్ఛంద కార్యక్రమాలు.
మొత్తంగా టిటోస్ అంటే భారతదేశంలో 19 శతాబ్దపు చైతన్యానికి ఓ ప్రతీక. ఓ విప్లవం. అందుకే, గోవా టూరిజం గురించి తెలుసుకునే క్రమంలో.. గోవాకు అంత ప్రత్యేకత దక్కడానికి కారకుడైన డిసౌజాల పేర్లూ గోవా చరిత్రలో తప్పకుండా కనిపిస్తాయి.


