హైదరాబాద్ నగరాన్ని నడుపుతున్న కాలం కథ!

ఎంత విస్తరించినా… శివార్లలోని కొత్త ప్రాంతాల అభివృద్ధితో సింగపూర్, దుబాయ్ ని తలపించినా… ఆకాశహర్మ్యాలు తలదించుకోకుండా చేస్తున్నా… హైదరాబాద్ అంటే గుర్తొచ్చే ఐకానిక్ సింబల్ మాత్రం చార్మినారే. అలాంటి చార్మినార్ గత హైదరాబాద్ చరిత్రకు.. నడుస్తున్న కాలానికీ ప్రతీక. మరి చార్మినార్ మీద ఆ కాలాన్ని కొలిచే గడియారాన్ని సజీవంగా ఉంచుతోందెవరు..?

అందుకు మనం వహీద్ వాచ్ కంపెనీ గురించి తెలుసుకోవాలి. శతాబ్దానికి పైగా లాడ్ బజార్ లోని వహీద్ వాచ్ కంపెనీ చార్మినార్ పైన నాల్గు పక్కల ఏర్పాటు చేసిన నాల్గు గడియారాల నిర్వహణా బాధ్యతను చూస్తోంది. చార్మినార్ పై నాల్గుబాదులా ఏర్పాటు చేసినా నాల్గు గడియారాలను.. 1889లో లండన్ నుంచి తీసుకొచ్చారు. ప్రతీ రెండు రోజులకొకసారీ కీ ఇస్తేనే ఈ గడియారాలు నడుస్తాయి. అయితే అవెంత ఆక్యురేట్ గా కాలాన్ని చూపిస్తాయో.. అంతే యాక్యురసీతో దాన్ని నిర్వహించే గడియారం మెకానిక్స్ మూడు తరాల నుంచీ అంతే సమయపాలనను పాటిస్తూ హైదరాబాద్ నగరం సమయం తప్పకుండా చూసుకుంటున్నారు.

ఎందుకంటే, ఇప్పుడంటే మోబైల్స్ లో, చేతి గడియారాల్లో చూసుకుంటున్నామేమోగానీ… దాదాపు పదిన్నర దశాబ్దాలుగా వేలాది మంది చార్మినార్ నాల్గువైపులా అమర్చిన గడియారాల్లోనే టైం చూసుకుంటూ సమయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నాల్గు గడియారాలను లాడ్ బజార్ లోని ఓ పాత గడియారాల దుకాణం ఇప్పటికీ నిర్వహిస్తోంది.

ఆరో నిజాం పాలనలో ఈ గడియారాలు చార్మినార్ పెకెక్కాయి.

ఆరోజుల్లో వైస్రాయ్, ఆయన భార్య హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికేందుకు ఈ గడియారాలను లండన్ నుంచి తెప్పించారు. చార్మినార్ పైన నాల్గు దిక్కులా నాల్గింటిని అమర్చారు. ఆ రోజుల్లో ఎవరైనా విశిష్ఠ అతిథులు .. చార్మినార్ సమీపంలోని చౌమహల్లా ప్యాలెస్ కు వచ్చేవారు. అలాగే హైదరాబాదీలకు యాంత్రికమైన గడియారాలను పరిచయం చేయాలన్న ఒక కోరిక కూడా ఆరో నిజాం ఈ గడియారాలను చార్మినార్ పై బిగించడానికి మరో ప్రధాన కారణమట. చార్మినార్ పై గుల్జార్ హౌజ్ వైపు ఫేసింగ్ ఉన్న గడియారం ప్రతీ అరగంటకోసారి మోగుతుంటుంది.

ఈ నాల్గు గడియారాలకు కూడా ప్రతీ రెండు రోజులకొకసారి తప్పకుండా కీ ఇవ్వాల్సిందే. గంటల ముల్లు, నిమిషాల ముల్లుల కోసం రెండు వేర్వేరు బరువులను అమర్చారు. సమయం గడిచేకొద్దీ ఆ బరువు కిందకు దిగుతుంటుంది. 48 గంటల తర్వాత వాటిని మళ్లీ పైకి తిప్పి కీ ఇవ్వకపోతే గడియారం ఆగిపోతుంది. ఈ గడియారం నిర్వహణను వహీద్ వాచ్ కంపెనీ మూడు తరాలుగా నిర్వహిస్తోంది.

నిజాం పాలన ముగిసిన తర్వాత 1947 అనంతరం బ్రిటీష్ కాలం నాటి ఈ గడియారాల పలు భాగాలను దొంగిలించారు. 1962లో గడియారాలు పూర్తిగా పనిచేయకపోవడంతో విషయం వెలుగులోకొచ్చింది. దాంతో మిగిలిన భాగాలనుపయోగించి.. కావల్సిన ఇతర భాగాలను తెప్పించి ఈ నాల్గు గడియారాలూ పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాల్గు వాచులను బాగుచేసినప్పుడు.. నిజాం వ్యక్తిగత గడియారాల మరమత్తుదారుడైన వహీద్ ఖాన్ కుమారుడైన రసూల్ ఖాన్ కు సవాల్ తో కూడిన ఈ పనినప్పగించారు.

చార్మినార్ పై తిరిగి గడియారాలు కాలాన్ని చూపుతూ హైదరాబాద్ నగరాన్ని కాలానికనుగుణంగా నడిపే ఒక సవాల్ ను రసూల్ ఖాన్ స్వీకరించారు. దొంగతనానికి గురైన భాగాలను స్వయంగా ఆయన స్వహస్తాలతో తయారుచేసి.. కొద్దిరోజులు తిరక్కుండానే ఆ నల్గు గడియారాలూ పనిచేసేలా రిపేర్ చేశారు. అప్పట్నుంచీ కాలమన్నది ఎక్కడా ఆగకుండా ఈ గడియారాలూ నడుస్తున్నాయి.. సమయపాలన పాటిస్తూ వాటికి ప్రతీ 48 గంటలకోసారి కీ ఇస్తూ వహీద్ వాచ్ కంపెనీ ప్రతినిధులూ నిర్వహణనూ చూసుకుంటున్నారు.

వహీద్ ఖాన్ తర్వాత రసూల్ ఖాన్ చేతికొచ్చిన ఈ చార్మినార్ గడియారాల నిర్వహణ.. ఆ తర్వాత సికందర్ ఖాన్ చేతికొచ్చింది. గత ఏడాది సికందర్ ఖాన్ కూడా మరణించగా.. ఆయన కుమారుడు విదేశాల్లో ఉండటంతో… వహీద్ వాచ్ కంపెనీ నిర్వహణను సికందర్ ఖాన్ కుటుంబ సభ్యుడైన గులాం రబ్బానీ ప్రస్తుతం చూస్తున్నారు.

అయితే గత రెండేళ్ల క్రితం 2024లో చార్మినార్ మరమత్తుల సందర్భంగా తూర్పువైపున ఉన్న వాచ్ పగిలిపోవడం వివాదాస్పదంగా మారింది. 135 ఏళ్ల చరిత్ర కల్గిన యాంటిక్విటీ విషయంలో అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చరిత్రకారులు మండిపడ్డారు. ఇనుప పైపులు తీసే క్రమంలో డయల్ బోర్డ్ పగిలిపోవడం ఆ వివాదానికి కారణమైంది. గడియారం డయల్ బోర్డ్ మాత్రమే పగిలిపోయి పాక్షికంగా దెబ్బతింది. వాచ్ మాత్రం యథావిధిగా నడుస్తుండటంతో దానికే కాసింత రిపేర్ చేసిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ పాత గడియారంతోనే నడిపిస్తున్నారు.

నాల్గు మినార్లే కాదు.. నాల్గు గడియారాలతోనూ హైదరాబాద్ రాజసానికి ప్రతీకలా నిలుస్తోంది చార్మినార్. అందుకే దీన్ని షహర్ కా షాన్ అని పిల్చుకుంటారు. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదో పాలకుడైన కులీ కుతుబ్ షా ఈ 1591లో ఈ కట్టడాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles