సుప్రీం న్యాయమూర్తుల నుంచి మీడియా వరకూ అధికారపార్టీల అడుగుల మడుగులొత్తుతున్న వేళ… యువత నిరసనలను పాలపొంగులాంటి భావోద్వోగాలతో పోలుస్తూ పరిహసిస్తున్న కాలాన…. అదే సుప్రీం కోర్టులో కొందరు బార్ అసిసోసియేషన్ సభ్యులు విద్యార్థుల ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం స్వాగతించదగ్గది. ఆ దారిలో ఆలోచించలేని వాళ్లు నేర్చుకోవాల్సింది.
సేవ్ డెమోక్రసీ, సేవ్ కానిస్టిట్యూషన్ ప్రచారంలో భాగంగా పలువురు న్యాయవాదులు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలోని లాన్ లోకొచ్చి రాజ్యాంగ పీఠికను బహిరంగంగా సామూహికంగా చదివి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం విశేషం. సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికత, ప్రజాస్వామ్యం ,గణతంత్రం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ముందు మాటలను, రాజ్యాంగ నియమాలను గుర్తు చేసి… పరీక్షా పత్రాల లీకులపైనా, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీపైనా పోలీస్ చర్యలకు వ్యతిరేకంగా నినదించింది బార్ అసోసియేషన్. పరోక్షంగా, మిగిలిన వ్యవస్థలకు ఇదో చెంపపెట్టు లాంటి పాఠం.

కాక్రోచ్ జనతాపార్టీ నిరసనలు ఇప్పుడు ఢిల్లీకే పరిమితం కాలేదు. అంటుకున్న నిప్పు ఇప్పుడు రావణకాష్టమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఆ మంటలంటుకుని ఫలానా ప్రాంతమన్న తేడా లేకుడా సెగ పుట్టిస్తున్నాయి.
లీకులకు, నిర్లక్ష్యానికి కేరాఫ్ గా మారిన విద్యావ్యవస్థకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన ఉద్యమం ఇప్పుడు ఉధృతమవుతోంది. ముందు సోషల్ మీడియా వేదికగా బిలియన్లలో నెటిజన్స్ ను ఆకర్షించినప్పుడు ఉద్యమాన్ని కొట్టిపారేసినోళ్లకు.. చాపకింద నీరులా మొదలైన ప్రత్యక్ష ఉద్యమం.. ఇప్పుడు దావానంలా వ్యాపించడం మింగుడుపడటం లేదు.
నిరసనలో పాల్గొంటున్న నీట్ అభ్యర్థులు ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఇప్పటివరకు బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలకు సమాధానాల్లేకుండా పోయాయి. ప్రధాన్ రాజీనామాపై స్పందించకుండా నాన్చి కడుపు మాడితే వాళ్లే నిరాహారదీక్షలు మానేస్తారనుకున్న ప్రభుత్వ పెద్దలు దిగివచ్చేలా చేసింది సీజేపీ నిరశన. ప్రధాన్ రాజీనామాపై దేశమంతా గగ్గోలు పెడుతున్నా పెదవి విప్పని ప్రధాని కూడా ఏకంగా పెదవి విప్పక తప్పని పరిస్థితి తీసుకువచ్చిందీ ముందు అంతా తేలికగా కొట్టిపారేసిన సీజేపీనే.
ప్రజాస్వామికంగా నిరశనకు దిగిన వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నా కనీసం మానవత్వం చూపకుండా ఎలాంటి స్పందన లేకపోగా.. సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ప్రచారాలు చేస్తూ.. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించిన పాలకులకు ఇప్పుడు ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలిసొస్తోంది.
ఏది అనుకూలమో, ఎవరు ప్రతికూలమో తెలుసుకోలేని నాల్గు స్థంభాలైన డెమోక్రాటిక్ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లిన సమయంలో… తమకు చివరకు న్యాయం దక్కుతుందనే చోట కూర్చునే న్యాయమూర్తులే పని లేని పనుల కోసం తమ టైం వేస్ట్ చేసుకోమంటూ ఓ పెద్ద ఉద్యమాన్ని పరిహసించడంపై యువత భగ్గుమంది. విద్యార్థులపై పోలీస్ చర్యలను అడ్డుకోవాలని కోర్టుకెక్కితే… న్యాయమూర్తి నుంచి పరిహాసమెదురైన చోటే.. ఢిల్లీ న్యాయవాదుల బృందం అదే సుప్రీం పరిసరాల్లో ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగ స్ఫూర్తిని, దాని సారాంశాన్ని తెలియజెప్పేలా బిగ్గరగా చదివిన రాజ్యాంగ పీఠిక.. ఉద్యమాన్ని పలుచన చేసేవారందిరికీ ఓ తోడపాశం.
తామెన్నుకున్న ప్రభుత్వాలు సరైన దారిలో నడవకపోతే ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తామంటే ఎలా అని యువత గొంతెత్తి అడుగుతుంటే.. వెకిలి నవ్వులు, లాఠీఛార్జీలు, దుష్ప్రచారాలు… ఎంత విషాదం..???
సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అమోదించిన తీర్మానంలో పోలీస్ చర్యలను తీవ్రంగా ఖంచిండింది. అసమాన బలప్రయోగాన్ని ప్రజాస్వామ్యంలో తీవ్రమైన ఆందోళనగా, ఎంతమేరకూ ఆమోదయోగ్యత లేనిదిగా బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. కాలపరిమితితో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. రాజ్యాంగ హక్కులు, పరస్పర గౌరవం, న్యాయపాలన పరిరక్షణలో తమ నిబద్ధత ఇలాగే కొనసాగిస్తామనీ బార్ అసోసియేషన్ పేర్కొని.. విద్యార్థుల ఉద్యమానికి దన్నుగా, మిగిలిన వ్యవస్థలకు ఆదర్శంగా నిల్చింది.
అయితే, పోలీస్ నిరంకుశత్వానికి పరాకాష్ఠలా మారిన చర్యలతో హస్తినలోని సన్నివేశాలు దుఖపెడితే.. ఆ దృశ్యాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా నాయకులను, విద్యావంతులను, న్యాయవాదులను, సోషల్ మీడియాను ఏకతాటిపైకి తెచ్చేందుకు కారణమయ్యాయి. మరి మఖలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న సీజేపీ సాధించిన ఈ విజయం.. భారతదేశ రాజకీయ పోరాటం చరిత్రలో ఓ మైల్ స్టోన్. తమకెదురులేదనుకునే పాలకుల మెడవంచిన ప్రజాస్వామ్యానికి ఓ నిలువెత్తు ఉదాహరణ.



