ఆ రాత్రి ఏం జరిగింది? ఆరేళ్ల తర్వాత సీబీఐ ఎంట్రీ.. మళ్లీ తెరపైకి దిశ కేసు!

ముగిసిందనుకున్న కేసు మళ్లీ మొదటికి!

ముంబై మలాడ్… బహుళ అంతస్థుల భవనం… అక్కడి ఓ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె పేరు అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. దిశా సాలియన్. వయస్సు జస్ట్ 28 ఏళ్లు. సెలబ్రిటీ మేనేజర్ గా పనిచేసిన ఆమె.. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కూడా కొంతకాలం మేనేజర్ గా పనిచేశారు.

2020 జూన్ 8వ తేదీన భవనం పైనుంచి పడి దిశ మరణించింది. ఆ ఘటన మరవకముందే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ముంబైలోని తన నివాసంలో మరణించాడు. దాంతో రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధముండి ఉంటుందా అనే ఊహాగానాలు బయల్దేరాయి. కానీ, సంబంధం ఉందనే ఆధారాలు మాత్రం ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ అధికారికంగా మాత్రం బయటపడలేదు.

ఆ రాత్రి ఏం జరిగింది?

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. దిశ తన కాబోయే భర్త రోహన్ రాయ్ నివాసంలో కొందరు స్నేహితులతో సమావేశమైంది. తర్వాత ఆమె అదే భవనం పైనుంచి కింద పడి అసువులు బాసింది. మొదట్లో మల్వాణీ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదు చేశారు. విచారణ చేశారు. ఆ తర్వాత అది ఆత్మహత్యగా పేర్కొన్నారు. అలాగే, తమ విచారణలో హత్యగా నిర్ధారణ చేసే ఆధారాలేవీ లేవని వెల్లడించారు.

మరి వివాదమెక్కడ మొదలైంది..?

దిశ తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణమపై అనుమానాలు వ్యక్తం చేశాడు. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆరోపించాడు. అత్యాచారం, హత్య వంటి తీవ్ర ఆరోపణలు ఆయన్నుంచి వెల్లువెత్తాయి. పోలసులు మాత్రం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో లైంగిక, శారీరక దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టుకు తెలిపారు. ఓవైపు పోలీసులు… ఇంకోవైపు, మృతురాలు దిశ తండ్రి సతీష్ సాలియన్.. ఇలా వీరిద్దరి రెండు భిన్న వాదనలే కేసును ఆరేళ్లుగా వార్తల్లో ఉంచుతున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో సంబంధముందా..?

దిశ మరణానికి ఆరు రోజుల తర్వాత 2020, జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించాడు. సమీప కాలవ్యవధిలోనే సుశాంత్ మరణించడంతో.. సోషల్ మీడియాలో రెండు మరణాలను కలిపే కథనాలు, సిద్ధాంతాలు ప్రచారంలోకొచ్చాయి. ముంబై పోలీసులు దర్యాప్తు సమయంలో దిశ మరణానికి, సుశాంత్ మరణానికి సంబంధమున్నట్టు నిర్ధారించే ఆధారాలు లభించలేదని చెప్పారు.

మరి ఆరేళ్ల తర్వాత కేసు మళ్లీ ఎందుకు తెరపైకొచ్చినట్టు..?

ఇదే ఇప్పుడు అసలైన ఆసక్తికర పరిణామం. 2026, సెప్టెంబర్ 2వ తేదీన ముంబై హైకోర్ట్ దిశా సాలియన్ మరణంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో.. ఇప్పుడీ కేసు మరోసారి వెలుగులోకొచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఇంతకాలం విచారణ కొనసాగించడంపై హైకోర్ట్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలీసులు జరిపిన దర్యాప్తు తీరు.. మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ఈ క్రమంలో అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి విచారణ చేపట్టాలని కోర్ట్ సీబీఐని ఆదేశించడంతో ఇప్పుడు మళ్లీ దిశా సాలియన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో కూడా కొత్త విషయాలేమైనా బయటకొస్తాయా అనే ఒక ఉత్కంఠకు తెరలేచింది.

ఇదే సమయంలో ఎవ్వరినీ ముందే నిందితులుగా పరిగణించకూడదనీ హైకోర్ట్ స్పష్టం చేసింది. దర్యాప్తులో లభించే ఆధారాల ప్రకారమే తదుపరి చర్యలుండాలనీ పేర్కొంది.

మరి ఇప్పుడేం జరుగుతోంది..?

సరిగ్గా రెండు రోజుల క్రితం 2026, సెప్టెంబర్ 14వ తేదీన సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దిశ తండ్రి సతీష్ సాలియన్ స్టేట్ మెంట్ ను కూడా సీబీఐ అధికారులు నమోదు చేశారు. తిరిగి సీబీఐ పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. గతంలో జరిగిన విచారణ, సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ పరిశోధనలు, సంఘటనా స్థలాన్ని, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి దర్యాప్తు మొదలెట్టింది.

ఆరేళ్ల నిరీక్షణా..?

అంటే ఆరేళ్లుగా చర్చల్లో ఉన్న ప్రశ్నలకు ఇప్పటికీ న్యాయపరంగా సమాధానం రాలేదు. గతంలో చేసిన ఆరోపణలు నిజమని కూడా ఇప్పుడే చెప్పలేం. అవన్నీ నిరాధారమనో, ఆధార సహితమనో కూడా తిరిగి సీబీఐ చేపట్టిన దర్యాప్తు ముగిసేవరకూ తేల్చలేం. కానీ, దిశా సాలియన్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడానికి మాత్రం అసలు కారణం.. ఒక మరణం చుట్టూ పుట్టిన అనుమానాలే కాదు.. ఆ అనుమానాలకు న్యాయపరంగా, ఆధారాలతో సహా సరైన సమాధానం లభించకపోవడమే.

అసలు ఈ కేసులో వినిపించిన ప్రముఖుల పేర్లేంటి.. ఈ కేసుతో వారికేం ఏం సంబంధం..? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీసేంటి..? నెపోటిజంపై ఎందుకంత చర్చ జరిగింది…? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్స్ లో కూలంకషంగా తెలుసుకుందాం!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles