ముగ్గురు దేశాధినేతల మధ్య ఓ వ్యక్తి! ఎవరతను..? ఎందుకు సోషల్ మీడియా మాట్లాడుతోంది..?

మోడీ, పుతిన్, జిన్ పింగ్ మూడు దేశాల కీలక నేతల మధ్య…. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సదస్సులో కనిపిస్తున ఓ వ్యక్తి ఫోటో ఎవరిది..? ఇదిప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారిన టాపిక్.

దాన్ని ఓ వైరల్ ఫోటో కథలా చూడకుండా… ప్రపంచ నాయకుల మధ్య నిశ్శబ్దంగా పనిచేసే ఓ దౌత్యవేత్త కథలా చూడటమే సరి!

అతడే భారతీయ దౌత్యవేత్త సిద్ధార్థ్ బాబు!

ఓ ఫోటో… మూడు దేశాల అగ్రనేతలు.. వారి వెనుకున్న ఓ వ్యక్తి. ఇదే ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముగ్గురు నేతల మధ్య జరిగిన సంభాషణలను గమనిస్తూ.. మోడీకి సహకరిస్తున్న ఆ భారతీయ అధికారి కూడా కెమెరా కంటికి చిక్కడంతో ఇంత చర్చ.

ఒక్క ఫోటోతో పరిచయమైన ఈ పేరు వెనుక ఒక అసాధారణ ప్రయాణం కనిపిస్తుంది.

మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి దౌత్యవేత్తగా!

సిద్ధార్థ్ బాబుది కేరళలోని కొచ్చి. 2012లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత కొంతకాలం ఈ కామర్స్ రంగంలో పనిచేశారు. కానీ, ఈయన ప్రయాణం మాత్రం ఇంతటితో ఆగలేదు. అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తితో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో విజయాన్నందుకోలేకపోయాడు. రెండోసారీ యత్నించాడు. ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంచుకున్నాడు. 2017లో దౌత్యవేత్తగా ఈ సిద్ధార్థ్ బాబు ప్రయాణం మొదలైంది.

కీలకంగా మారిన చైనా నాల్గేళ్ల అనుభవం!

సిద్ధార్థ్ బాబు తొలి విదేశీ పోస్టింగే బీజింగ్ లో పడింది. 2018 నుంచి 2022 వరకూ థర్డ్ లెవల్ సెక్రటరీగా, ఆ తర్వాత సెకండ్ లెవల్ క్యాడర్ లో పనిచేశారు. ఈ నాల్గేళ్ల కాలంలో చైనా రాజకీయ, దౌత్య వాతావరణాన్ని మరింత క్రియాశీలకంగా, దగ్గరగా పరిశీలించడంతో పాటే.. మాండరిన్ భాషపై పట్టు సాధించారు సిద్ధార్థ్. అదే అనుభవం ఇప్పుడు రాజకీయ దౌత్య జీవితంలో పెద్ద బలంగా మారింది. ఎందుకంటే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భారత ప్రధాని మోడీ వంటి అగ్రనేతలు మాట్లాడే సందర్భాల్లో ఒక్కో పదాన్ని, ఆయా సందర్భాన్ని బట్టి ఇరువురికీ అర్థమయ్యేలా చేసే ట్రాన్స్ లేషన్ చేయడమంటే.. కేవలం, ఓ అనువాదకుడి పాత్ర కాదది… ఆయా మాటల వెనుక ఉద్ధేశం, దౌత్యపరమైన సున్నితత్వం ఇలా అన్ని అర్థం చేసుకుని చేరవేయాల్సిన బాధ్యత.

అమెరికా అనుభవం!

చైనా తర్వాత సిద్ధార్థ్ అమెరికా వెళ్లారు. 2022 నుంచి 2024 వరకు కాలిఫోర్నియా మాంటెరీ ప్రాంతంలో కాన్సుల్ గా పనిచేశారు. అదే సమయంలో మిడిల్ బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో భాషా వ్యాఖ్యానం, అనువాదంలో మాస్టర్స్ పూర్తి చేశారు. అంటే, దౌత్యసేవలో భాష ఎంత కీలకమో అర్థం చేసుకుని దాంట్లోనే మరింత నైపుణ్యం సంపాదించారన్న మాట.

ఇప్పుడు విదేశాంగ శాఖలో సిద్ధార్థ్ ది కీలక బాధ్యత!

అమెరికా నుంచి భారత్ తిరిగి వచ్చిన తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో చేరారు. 2025 జనవరిలో తూర్పు ఆసియా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్టర్నల్ అఫైర్స్ రికార్డుల్లో కూడా సిద్ధార్థ్ బాబు పేరు తూర్పు ఆసియా విభాగంతో అనుబంధంగా కనిపిస్తోంది.

ఒక్క వైరల్ ఫోటోతో చర్చగా మారిన సిద్ధార్థ్!

BRICS వేదికపై మోడీ, పుతిన్, జిన్ పింగ్ మాట్లాడుతున్నప్పుడు సిద్ధార్థ్ బాబు వెనుకే కనిపించడమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలో కనిపించడం కంటే.. ఆయన చేస్తున్న పని, బాధ్యత ఆ తర్వాత వివరాల్లోకి వెళ్లినవారిని మరింతగా ఆకట్టుకుంటోంది.

ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల నాయకులు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు వారి మాటలు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. అలాంటి సమయంలో భాషా అవరోధం లేకుండా, రాకుండా చూడటం.. సంభాషణల్లోని అర్థాన్ని సరిగ్గా చేరవేయడం.. దౌత్యపరమైన సున్నితాంశాలపై సరైన ప్రెజెంటేషన్ ఇవ్వడం.. ఇవన్నీ తెర వెనుక జరిగే కీలక ఘట్టాలు. సిద్ధార్థ్ బాబు గతంలోనూ మోడీతో కలిసి ఇలాంటి కీలకమైన సందర్భాల్లో కనిపించారు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైన ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తో సంభాషణల్లోనూ సిద్ధార్థే అనువాద సాయం అందించారు.

కెమెరా ముందు ముగ్గురే.. కానీ, కెమెరా వెనుక ఎందరో!

ప్రపంచ నేతల ఫోటోలు చూస్తే మనకు సాధారణంగా కనిపించేది ప్రధానంగా అధ్యక్షులు, ప్రధాన మంత్రులే. కానీ, ఒక్క సమావేశం సజావుగా, సమర్థవంతంగా సాగడానికి వారి వెనుక ఎందరో పనిచేస్తారు. దౌత్యవేత్తలు, అనువాదకులు, ప్రోటోకాల్ అధికారులు, విధాన నిర్ణయాలను అమలుపర్చే నిపుణులు.. ఇలా ఎందరో. కానీ, వీరి పేర్లు ఎప్పుడూ బయటకు రావు. వీరి ముఖాలు కూడా ఎక్కువగా వార్తల్లో కనిపించవు. కానీ, దేశాల మధ్య దౌత్యంలోనూ, సంభాషణల్లోనూ వీరి పాత్రే చాలా కీలకం.

బ్రిక్స్ ఫోటో మోదీ, పుతిన్, జిన్ పింగ్ వెనుక కనిపించి సిద్ధార్థ్ బాబు ఇప్పుడీ విషయాన్ని మరోసారి ప్రపంచం ఆలోచించేలా చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles