దిశా సాలియన్ కేసులో వినిపిస్తున్న ప్రముఖులెవరు…? అసలు అనుమానాలేంటి..?
………………………………………………………………………………………………………………..
ఆ రాత్రి అక్కడ ఎవరెవరున్నారు..? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో లింక్ ఎలా ఏర్పడింది…? సీబీఐ ఇప్పుడేం తేల్చాలి..?
2020 జూన్ లో ఆరు రోజుల వ్యవధిలోనే దిశా సాలియన్, బాలీవుడ్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇద్దరి మరణం సంచలనంగా మారింది. రెండు ఘటనల మధ్య సంబంధమేంటన్న చర్చతోనే.. దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు వార్తల్లో నిల్చింది. ఇప్పుడు ముంబై హైకోర్ట్ ఆదేశాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో… దర్యాప్తెలా ఉండబోతోందన్న ఊహాగానాల్లో నాడు వినిపించిన పలువురి పేర్లు మళ్లీ తెరపైకొచ్చాయి.

ప్రధానంగా వినిపించిన పేర్లలో ఆదిత్య ఠాక్రేనే ఫస్ట్ టార్గెట్!
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖమైన పేరిది. మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పర్యావరణం, పర్యాటక, ప్రోటోకాల్ శాఖల మంత్రిగా పనిచేసిన నాయకుడు. నాటి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు కావడంతో… సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఏం జరుగుతుందానన్న ఒక క్యూరియాసిటీ నెలకంది. పైగా దిశ మరణంపై ఆమె తండ్రి సతీష్ సాలియన్ ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కూడా ఆదిత్య ఠాక్రే పేరుంది. ఈయనపై వచ్చిన ఆరోపణలను ఇప్పుడు దర్యాప్తులో భాగంగా సీబీఐ తిరిగి పరిశీలించాల్సి ఉంది. ఠాక్రే తరపున అడ్వకేట్స్ మాత్రం ఇప్పటివరకూ ఈ కేసుతో ఠాక్రేకు ఎలాంటి సంబంధం లేదనే వాదిస్తూ వస్తున్నారు. ఆరేళ్ల తర్వాత కూడా అనుమానాలు వీడకపోవడంతోనే తిరిగి ముంబై హైకోర్ట్ సీబీఐ విచారణకు ఆదేశించడంతో… ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
రెండో పేరు రియా చక్రవర్తి!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సన్నిహిత సంబంధాల కారణంగా 2020లోనే రియా పేరు దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. దిశా కేసులోనూ ఈమె పేరు వినిపించింది. ఇప్పుడు సీబీఐ ఎఫ్ఐఆర్ లోనూ ఈమె పేరు చేరింది. అయితే, దిశ మరణించిన కొద్దిరోజులకే సుశాంత్ మరణం కూడా మిస్టరీగా మారడంతో… వీరిమధ్యనున్న ఒక మ్యూచ్యువల్ ఫ్రెండ్ గా రియా చక్రవర్తి పేరు కూడా వినిపించింది. ఈ క్రమంలో మరి సీబీఐ ఏం తేల్చనుందన్నది ఆసక్తిగా మారింది.
ఇంకొన్ని పేర్లలో ఎవరెవరున్నారు..?
నటుడు డినో మోరియా పేరు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దిశ మరణానికి ముందు జరిగిన సమావేశం.. అక్కడున్న వ్యక్తులు.. ఆ రాత్రి జరిగిన పరిణామాలపై సమగ్ర దర్యాప్తు జరుగనున్న నేపథ్యంలో.. డినో మోరియా పేరు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, నటుడు సూరజ్ పంచోలి పేరు కూడా ఈ కేసులో వినిపిస్తోంది. ఆయన మాత్రం దిశానుగానీ, ఆదిత్యా ఠాక్రేను తానెప్పుడూ కలవలేదంటున్నాడు. తనకు ఈ కేసుతో సంబంధమే లేదని చెబుతున్నాడు. అవసరమైనప్పుడు దర్యాప్తుకు సహకరిస్తానంటున్నాడు.
మరి రోహన్ రాయ్ పాత్రేంటి..?
దిశా సాలియన్ కాబోయే భర్త, ప్రియుడైన రోహన్ రాయ్ దర్యాప్తు కూడా సీబీఐ కేసులో కీలకం కానుంది. దిశ మరణించిన రాత్రి ఆమె ఉన్న ఇంట్లో జరిగిన సమావేశంలో ఈయనే కీలక వ్యక్తి. ఆ రాత్రి అక్కడ ఎవరెవరున్నారు..? ఏం జరిగింది..? దిశ మరణించేకంటే ముందు చివరి గడియల్లో అసలేం జరిగిందన్న వివరాలన్నీ ఆయన వాంగ్మూలంతో ప్రాధాన్యం దక్కించుకోనున్నాయి. సీబీఐ దర్యాప్తులో దిశ చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగింది.. ఎవరెవరున్నారన్నదే కీలకం కానుంది.
మరికొందరి పేర్లు ఎవరెవరివి..?
మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, మరో కీలక పోలీస్ అధికారిగా నాటి దర్యాప్తులో ఉన్న సచిన్ వాజే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్లు కూడా ఫిర్యాదుల్లో, దర్యాప్తులో ప్రస్తావనకొచ్చాయి. మరి వీరందరి పేర్లకు సంబంధించిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నలల్లా ఇవే!
2020, జూన్ 8వ తేదీ రాత్రి దిశా సాలియన్ కు ఏం జరిగింది..? ఆమె ఎలా మరణించింది..? ఆ రాత్రి అక్కడ ఎవరెవరున్నారు..? వారందరి వాంగ్మూలాల్లో ఏమున్నాయి..? పాత దర్యాప్తులో లోపాలేంటి..? ఫోరెన్సిక్, కాల్ డేటా, అందుబాటులో ఉన్న ఇతర సాక్ష్యాలతో సీబీఐ ఎలా దర్యాప్తు చేయబోతోంది..? ఆరేళ్లుగా ఎన్నో పేర్లు వినికిడిలోకొచ్చాయి. చర్చల్లో నానాయి. ఇప్పుడు వాటిల్లో ఏవి ఆరోపణలు… ? వేటిని ఆధారాలతో నిరూపించగలరు..? అన్నది సీబీఐ దర్యాప్తు తేల్చాల్సి ఉంది.


