24 ఏళ్ల గ్రహణానికి తెరదించిన సోలార్ వెలుగు.. ఆ టీచర్!
ఉపాధ్యాయుడంటే.. బళ్లో పాఠాలు చెప్పేవాడు. కానీ, అంతకుమించి సమాజాన్నీ చైతన్యవంతం చేసేవాడనీ నిరూపించాడు ఓ ఉపాధ్యాయుడు. సమాజానికి ఏది అవసరమో గుర్తించి.. ఆ సమాజంలో అంధకారాన్ని పారద్రోలి వెలుగులు నింపాడు. 24 ఏళ్లు గుదిరి వ్యాళ్లైందంటే చాలు కారు చీకట్లు కమ్ముకునే ఓ ఊరి గతినే మార్చేశాడు ఈ ఉపాధ్యాయుడు.

అది భారత సరిహద్దు ప్రాంతం. మయన్మార్ బార్డర్. నాగాలాండ్ లోని షిన్నుయూ అనే ఓ మారుమూల గ్రామం. దేశమంతా ఏడాదికొక్కసారి దీపావళి కూడా జరుపుకుంటే.. అక్కడ మాత్రం ఏడాది పొడవునా విద్యుత్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వారికి ఫిబ్రవరి పదహారో తేదీన ముందస్తుగానే ఆ దీపావళి తెచ్చినవాడు ఈ టీచర్ జాన్ ఖెన్యూ.
2002లో అధికారికంగా గుర్తించబడింది షిన్నుయూ అనే గ్రామం. మోన్ జిల్లా కేంద్రం నుంచి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామానికి 12 గంటలపాటు ప్రయాణం చేస్తేనేగానీ చేరుకోలేరు. ఆరుగంటలు ప్రయాణం చేస్తేనేగానీ.. దగ్గరలో ఉన్న టోబు అనే మరో పట్టణానికి కనెక్ట్ కాలేరు. అక్కడంతా కొన్యాక్ నాగా కమ్యూనిటీకి చెందిన 60 కుటుంబాల జనం నివసిస్తుంటారు.

1977లో ఆ గ్రామం ఉనికిలోకి వచ్చిన్నాట్నుంచీ.. సాయంసంధ్య వేళ దాటిందంటే చాలు ఆ ఊరు చిమ్మచీకట్లు అలుముకునేది. 2002లో అధికారికంగా గుర్తించినా… రాత్రివేళ ఎలక్ట్రికల్ లైట్స్ కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఊరి జనం తమ కాలకృత్యాల వంటివన్నీ కూడా… వెలుగున్నంతలోనే ముగించుకోవాలి. ఎందుకంటే ఇదంతా అటవీప్రాంతం. లైట్లు లేవు. మోబైల్ సిగ్నల్సుండవు. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోరాదు. ఇక్కడో చర్చ్, ఓ ప్రాథమిక పాఠశాల, ఓ అతిథి గృహం, ఓ కమ్యూనిటీ హాల్ అవి మాత్రమే కనిపిస్తాయి. పిల్లలు ఈ ఊళ్లో చదువుకోలేక.. హాస్టళ్లలో ఉంటూ బయట పట్టణాల్లో చదువుకునేవారు. దానికి చెక్ పెట్టి ఆ ఊళ్ళో వెలుగులు నింపాలనుకున్నాడు.. అక్కడే ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే జాన్ ఖెన్యూ. తన సోషల్ మీడియా పోస్టులే ఆ తర్వాత ఆ ఊరికి వెలుగులు పంచాయి.
33 ఏళ్ల జాన్ ఖెన్యూ.. షిన్నుయూ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా బదిలీపై రావడం.. ఆ గ్రామం చీకట్లను పారద్రోలింది. ఒక్కోసారి షిన్నుయూకు సమీపంలోని టబు అనే పట్టణం నుంచి వాహనాల్లో రావడానికే 6 గంటలు పడితే.. కాలిబాటన చేరుకోవాలంటే.. జాన్ ఖెన్యూకు 12 గంటల సమయం పట్టేదట. తన ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కూడా వీల్లేకుండేది. అప్పుడు జాన్ .. ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ గ్రామాన్ని చూసి విచారించేవాడు. అసలు వాళ్లలా ఎలా బతుకుతున్నారా అన్న మథనం ఆయనలో మొదలైంది.
షిన్నుయూ జనం ఈతిబాధలను తన బాధలుగా ఫీలయ్యాడు. వెంటనే.. సోషల్ మీడియానెంచుకున్నాడు. కరెంట్ లేకపోవడం, మోబైల్ నెట్ వర్క్ లేకపోవడం, విద్యా, వైద్యం దుస్థితి, రోడ్లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలన్నీ ఏకరువు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులను జాన్ ఫేస్ బుక్ స్నేహితులు మరికొందరు చూసి షేర్ చేశారు. అవి కాస్తా.. 2019లో గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ (GHE) కంటబడ్డాయి. ఆ సంస్థ.. దేశంలోని మారుమూల గ్రామాలను విద్యుదీకరించడానికి మైక్రో సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేస్తుంటుంది.
GHE సూచనల ప్రకారం.. జాన్ తానే స్వయంగా షిన్నుయూ గ్రామంలోని విద్యుత్ అవసరాలపై సర్వే నిర్వహించాడు. మొత్తం 23 లక్షల ఖర్చుతో.. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి GHE ముందుకొచ్చింది. మోన్ జిల్లా యంత్రాంగంతో GHE ప్రతినిధుల బృందం సంప్రదించింది. ఎంతోకాలం నుంచి యత్నిస్తున్నా తమ మీంచి కాని పనికి అధికారులూ సరేనన్నారు. ఇంకేం.. గ్లోబల్ హిమాలయన్ ఎక్స్ పెడిషన్ సభ్యులు, ఇంజనీర్లు, జిల్లా అధికారిక బృందం 10 మంది సోలార్ ప్యానెల్స్‌తో 16 గంటల పాటు ప్రయాణించి… షిన్నయూ చేరుకున్నారు. ఎక్కడిక్కడ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడంతో.. ఆ ఊరికి వెలుగు వచ్చింది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో వెలుగులు నిండటంతో పాటే.. పాఠశాల, చర్చ్, కమ్యూనిటీ హాల్ ఇలా అన్నిచోట్లా లైట్లు వెలిగాయి.
ఇప్పుడిక్కడ ప్రతి ఇంట్లో 170 వాట్ల సోలార్ ప్యానెల్, బ్యాటరీ, రెండు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రెండు ట్యూబ్ లైట్లు, మూడు ఎల్ఈడీ బల్బులున్నాయి. 11 సోలార్ వీధి దీపాలనూ ఏర్పాటు చేశారు. ప్రతీనెలా వందరూపాయల చొప్పన నిర్వహణ కోసం ప్రతీ ఇంటినుంచి వసూల్ చేస్తుండటంతో పాటు.. వాటి నిర్వహణ బాధ్యత చూసేందుకు గ్రామానికే చెందిన కొందరు యువకులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.
ఒక ఉపాధ్యాయుడి చొరవ… వైరలైన ఓ సోషల్ మీడియా పోస్టులు… 44 ఏళ్లు అంధకారంలో మగ్గిన ఓ గ్రామ దుస్థితిని ఎలా మార్చాయి… సంకల్పసిద్ధి ఉంటే అధికారిక వ్యవస్థలు చేయలేని పనులను వ్యక్తిగతంగా కూడా ఎలా సాధించవచ్చో చెప్పిన జాన్ ఖెన్యూ స్ఫూర్తి కథనమిది.


