ఆకాశమే హద్దుగా సాగిన పాటది! మనిషి పోయినా.. మర్చిపోలేనిది!!

గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలేవో నిద్రేలేస్తున్నాయన్నట్టుగా.. గూగుల్ డూడుల్ తో కేకేకు ఘన నివాళినర్పించింది. ఈగాలిలో ఏ మాటలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయన్న ఆ అమర గాయకుణ్ని… మరోసారి గుర్తు చేసింది.

ఆకాశమే హద్దుగా సాగే ఆ పాట హఠాత్తుగా కలకత్తాలో ఓ స్టేజ్ షో అనంతరం హోటల్ లో ఆగిపోయి మూగబోవడం యావత్ కేకే అభిమానుల్ని కల్చివేసింది. కేకే పెద్ద పెద్ద స్టార్ సింగర్స్ లా పాప్యులారిటీ సంపాదించుకోలేకపోవచ్చు.. కానీ, ఆయన్నెరిగినవారికి మాత్రం ఆ ట్యాలెంట్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. 7/G బృందావన్ కాలనీలో తలచి తలచి చూశా పాట వింటే అర్థమైతుంది… ఆ గళం ఆర్ధ్రతలో స్యాక్సాఫోన్ తో ఎలా పోటీ పడిందో!

1999లో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో తడప్ తడప్ పాటతో కేకే పేరు మారుమ్రోగింది. అలాంటి హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, బెంగాలీ పాటలు పాడిన కేకే మరణం యావత్ భారత్ లోని ఆయన అభిమానులతో పాటు.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేపింది.

తాను ప్రేమించిన అమ్మాయి జ్యోతికృష్ణను పెళ్లి చేసుకోవడానికి ఓ సేల్స్ బాయ్ గా పనిచేశాడు కృష్ణకుమార్ కున్నత్. కానీ, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగం వద్దనుకున్నాడు. తన తండ్రి, భార్య జ్యోతికృష్ణ సహకారంతో సంగీతంపైనున్న మక్కువతో జింగిల్స్ చేయడం ప్రారంభించాడు. అలా 11 భాషల్లో 3 వేల 500 జింగిల్స్ చేసి క్లిక్ అయ్యాడు.

1968, ఆగష్టు 23 ఢిల్లీలో జన్మించిన కేకే.. మరో సింగర్ షాన్ కు మంచి మిత్రుడు. ఢిల్లీలో తన చదువు పూర్తయ్యాక, మార్కెటింగ్ లోకి ప్రవేశించిన కేకే.. ఆ తర్వాత పాటగాడిగా స్టేజ్ షోస్, ప్రైవేట్ ఆల్బమ్స్, సినిమాలవైపు మళ్లాడు. కేకే పల్ ఆల్బమ్ రికార్డ్స్ సృష్టించింది. అలాగే యారోన్ ఆల్బమ్ కూడా ఎందరికో ఓ నోస్టాల్జియాగా మారింది.

తన తల్లి నుంచి ప్రేరణ పొంది సంగీతం వైపు మళ్లాడు కేకే. తన తల్లి పాటలను ఓ టేప్ రికార్డర్ లో తన తండ్రి రికార్డ్ చేస్తున్నప్పుడు ఆసక్తిగా వింటూ, చూస్తూ పెరిగిన కేకేలోనూ ఆ లక్షణాలే పెరిగి పెద్దై.. ఆయన్నో ప్రొఫెషనల్ గాయకుణ్ని చేశాయి. అలా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న కేకే.. దేశంలో ఉన్న అత్యంత ప్రభావిత సినీ, లైట్ మ్యూజిక్ గాయకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.

అయితే, ఇంకెంతో మంచి భవిష్యత్తున్న ఒక వెర్సటైల్ సింగర్ గొంతు కేవలం 53 ఏళ్ల వయస్సులోనే ఆగిపోవడం జాతి చూసిన ఓ విషాదం. కేకే పాటలు కొన్ని హిందీ, తెలుగు వింటుంటే… వాట్ ఏ సింగర్ అనిపించకమానదు. నాభి నుంచి మొదలైన పాటను ఆకాశం అంచులవరకూ తీసుకెళ్లగల్గిన గొంతది. అందుకే, తక్కువ పాటలు పాడినా… తనున్నది తక్కువ కాలమే అయినా… ఎందరినో తన పాటతో కనెక్ట్ చేయగల్గిన శక్తివంతమైన సింగర్ గా కేకే పేరు చిరస్మరణీయం. కేకే మరణం తర్వాత అదే కలకత్తా నగరంలో ఓ విగ్రహాన్ని కూడా నెలకొల్పి.. ఆయన్నిప్పటికీ స్మరించుకుంటున్నారు.

గూగుల్ కూడా తన డూడుల్ తో కేకేకు ఈరోజు ఘనంగా ట్రిబ్యూట్ నందించింది. అందుకే కేకే భౌతికంగా లేకపోయినా… పాటరూపంలో నిల్చిపోయిన చిరంజీవి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles