చదువుంటే తెలియని తెగ నుంచి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సాధించింది! చదివి తీరాల్సిన ఓ విజయగాధ ఆ ఒడిశా అమ్మాయి అకాడమిక్ జర్నీ!!
………………………………………………………………………………………………………………
రిషీకేశ్… ✍🏻
మనిషిలో తపన ఉండాలేగానీ.. తమ సాధనకు అడ్డుపడే శక్తులేముంటాయి..? అలాంటి సక్సెస్ స్టోరీస్ కొల్లలు. ఈ మధ్యే 12th ఫెయిల్ సినిమాలో మనోజ్ కుమార్ ఐపీఎస్ సక్సెస్ స్టోరీని ఇన్స్పైరింగ్ గా చూపించారు. అలాంటి మరో జీవి గురించే మనం చెప్పుకోబోతున్నాం. నాగరిక సమాజంలో కూడా అనాగరిక బతుకీడుస్తున్న గిరిజన తెగకు ఇప్పుడామె ప్రైడ్. అసలు ఆమె గురించి తెలుసుకునేకంటే ముందు.. ఆమె తెగ గురించి చెప్పుకోవాల్సిన అవసరమూ ఉంది.
అదే బోండా గిరిజన తెగ. అత్యంత వెనుకబడిన జాతి. నాగరిక సమాజంలో ఒకళ్లను మించి మరొకళ్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్న రోజుల్లో… ఆ నాగరిక సమాజ పోకడలే తెలియని దైన్యస్థితిననుభవిస్తున్న అనాగరిక, ఆటవిక జాతి బోండా గిరిజన తెగ. ఇదేదో మనం ఆ జాతి పరిస్థితిని అంచనా వేస్తూ జనరలైజ్డ్ గా చేసే కామెంట్ కాదు… కేంద్ర ప్రభుత్వ అధ్యయనం వెలిబుచ్చిన అభిప్రాయం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో.. నేటి నాగరిక సమాజానికి దూరంగా ప్రాథమిక జీవనానికీ బోండా జాతి తమ బతుకీడుస్తున్నట్టు ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి.

వీరిని PVTGగా గుర్తించారు. అంటే Particularly Vulnerable Tribal Groupsగా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రత్యేక ఉపవర్గంగా ఇలాంటి 75 జాతులను గుర్తించగా… వాటిలో బోండా తెగ ఒకటి.
వ్యవసాయం, లేదా అడవుల్లో దొరికే ఆకులు అలములు అమ్ముకుని బతకడం వంటి కార్యకలాపాలు మినహా… నాగరిక సమాజంలో ఎలాంటి పనులుంటాయి.. తామూ ఆ పనులెలా చేయొచ్చు… అసలు విద్య వల్ల ఒనగూరే ప్రయోజనాలేంటి… ఉద్యోగాలెలా సంపాదించొచ్చు వంటి కనీస అవసరాల గురించే తెలియని జాతిలో పుట్టి.. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ర్యాంకు సాధించింది కాబట్టే మనం ఇప్పుడు ఓ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం.
ఆమే ఒడిశాకు చెందిన బినీ ముడులీ. మాల్కాన్‌గిరి జిల్లా గోవిందపల్లి సమీపంలోని ఖేమగుడ గ్రామం బినీది. తండ్రి రామ్ ముడిలి ఒక పాఠశాలలో వంటవాడు. తల్లి సునామణి కిర్సాని ఓ అంగన్‌వాడీ వర్కర్.
బినీ ప్రాథమిక విద్యంతా ముడులిపాడా ప్రాథమిక పాఠశాలలో కొనసాగింది. అసలు చదివించడమే గొప్పైన వెనుకబడ్డ బోండా తెగలో పట్టువదలని విక్రమార్కురాలిగా మారి.. తల్లిదండ్రులను ఒప్పించి జవహర్ నవోదయ్ విద్యాలయం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడా సీటు సంపాదించింది. తన మాధ్యమిక విద్యను అక్కడ పూర్తి చేసిన ముడులీ… ఆ తర్వాత జేయ్ పూర్ లోని విక్రమ్ దేవ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తర్వాత ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర పనిచేసింది. అయితే, ఆమెలో మాత్రం ఏదో సాధించాలన్న కసి రగులుతూనే ఉండేది. అలా ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పేపర్ కు ప్రిపేరైంది. 2020కు ముందు ప్రయత్నాలను ప్రారంభించి… 2020 పరీక్షల్లో ఫెయిలైంది. కానీ, వెనుకడుగు వేయలేదు సరికదా… 2022లో 596వ ర్యాంక్ సాధించి వార్తల్లో వ్యక్తైంది. ఎందుకంటే, అసలు అత్యంత వెనుకబడ్డ 75 ఉప తెగల్లో ఒకటైన బోండా తెగ నుంచి మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం సాధించిన ఘనత బినీ ముడులీది. అలా 24 ఏళ్లకే ఆమె ఓ గ్రూప్ వన్ ఆఫీసర్ గా అవతరించిన కథ ఇప్పుడు సోషల్ మీడియా, మీడియాల్లో మారుమ్రోగిపోతోంది.
అయితే, ఆమె ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ, మెయిన్స్ లో మంచి ర్యాంకులో ఉత్తీర్ణులవ్వడం వెనుక ఎంతో కష్టం దాగుంది. తనకు చదువుకునేందుకు, కోచింగ్ తీసుకోవడానికి డబ్బుల్లేక.. యూట్యూబ్ పాఠాలు చూసి.. ఆన్లైన్ కోర్సుల ద్వారా చదివి.. మాక్ టెస్టుల్లో పాల్గొంటూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కు ప్రిపేరైంది. అలా తనకు తానే ఓ మోటివేటరై… తాననుకున్న లక్ష్యాన్ని సాధించింది బినీ ముడులీ.
బినీ కామెంట్స్..
నా కోచింగ్‌ను నా తల్లిదండ్రులు భరించలేరని నాకు తెలుసు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణురాలిని కావాలనే నా కలను సాధించడంలో మాత్రం.. ఆ సమస్యే నాకు ఆటంకంగా మారొద్దని నేను ముందే నిర్ణయించుకున్నా. అందుకే, సమస్యను ముందు గుర్తించి.. దానికి ప్రత్యామ్నాయ మార్గంగానే తక్కువ ఖర్చులో ఒడ్డెక్కే ఆన్లైన్ కోర్సులు, యూట్యూబ్ పాఠాలతో.. నా లక్ష్యాన్ని చేరుకున్నానంటోంది బినీ.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష అంటే ఆశామాషీ కాదనే విషయం నాకూ తెలుసు. అందుకే, ఎందరో టాపర్స్ కు సంబంధించిన వీడియో ఇంటర్వ్యూస్ ని బాగా చూసేదాన్నని… పత్రికల్లో వచ్చే ఇంటర్వ్యూస్ తో పాటు.. అకాడమిక్ స్టడీస్, పోటీ పరీక్షలకు సంబంధించిన ఆర్టికల్స్ నూ ఫాలో అయ్యేదాన్ననీ చెబుతోంది బినీ ముడులీ.
అయితే, తన ఎదుగుదలలో తన తల్లిదండ్రులు, గురువుల పాత్రనూ కొనియాడుతున్న బినీ విజయం ఇప్పుడా కుటుంబానికే పరిమితమైంది కాదు.. మొత్తంగా బోండా సామాజికవర్గానికే ఓ సెలబ్రేషన్. బినీ ముడులీ దారిలోనే ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో మంగళ ముడులీ కూడా నీట్ లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ చేస్తూ.. తన డాక్టర్ కలను చేరుకునే క్రమంలో ప్రయాణిస్తోంది.
ఇంటర్నెట్, సోషల్, డిజిటల్ మీడియా తెచ్చిన రెవల్యూషన్ తో.. ఏం సాధించవచ్చనడిగేవాళ్లకు ఇప్పుడు వెనుకబడ్డ జాతి నుంచి చదువుకోవాలన్న తపనతో ఒడిశా సివిల్ సర్వీసెస్ గా పిల్చుకునే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జయకేతనమెగురేసిన బినీ ముడులీని చూపొంచొచ్చు. అలాగే, చదువు జీవితాలను ఎలా సుసంపన్నం చేస్తుంది… చీకటి బతుకుచిత్రాల్ని కూడా ఎంత ప్రకాశవంతంగా మారుస్తుందో చెప్పే కథ బినీ ముడులీ సక్సెస్ స్టోరీ.



