క్రిస్టోఫర్ నోలన్ నూ అబ్బురపర్చిన వెల్! అదో వండర్ ఫుల్ ఇండియన్ మార్వెల్!!

చాంద్ బవోరి.. ఇదో ఇండియన్ మార్వెల్!

చాంద్ బవోరి.. ఇదో ఇండియన్ మార్వెల్. అందుకే హాలీవుడ్ సినిమాను కూడా ఈ బావి ఆకట్టుకుంది. ఏకంగా ఓ షూటింగ్ స్పాటైపోయింది. 13 అంతస్తులు, 3500 మెట్లతో మన దేశంలోనే ఓ లోతైన ఈ బావి ఓ అద్భుతమైన ఆర్కిటెక్చరల్, అండ్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ పరాకాష్ఠ. ఓ కోనేరును తలపించే రాజస్థాన్ లోని ఈ బావి పర్యాటక ప్రాంతంగా ఇంతకాలం అంతగా ప్రసిద్ధికెక్కకపోయినా.. ఇప్పుడు మాత్రం ఓ చూడాల్సిన పర్యాటక ప్రదేశంగా మనన్నలందుకుంటోంది.

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2012లో వచ్చిన డార్క్ నైట్ రైజెస్ లో.. క్రిస్టియన్ బేల్ బావి నుంచి తప్పించుకునే టాప్ యాంగిల్ నుంచి చూపించే ఓ సన్నివేశం… వీక్షకులను ఆ సెట్ వైపే దృష్టినాకర్షించేలా చేస్తోంది. అయితే అది సెట్ కాదు.. రాజస్థాన్ లోని అభనేరి అనే గ్రామంలో చాంద్ బవోరి అనే అద్భుతమైన కళాకృతిలో నిర్మించిన బావి. అంతేకాదు.. 2005లో వచ్చిన బాలీవుడ్ సినిమా పహేలీ, ఆ తర్వాత 2007లో వచ్చిన భూల్ భులయ్యా వంటి సినిమాల్లోనూ ఈ బావి ఓ ప్రధాన షూటింగ్ స్పాట్.

సుమారు వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన బావి.. ఇప్పుడు సినిమా షూటింగుల్లోనూ భాగమై… కోట్ల మందినీ ఆకర్షిస్తున్నా… ఇది మనదేశంలో, అదీ రాజస్థాన్ లో ఉందనే విషయం ఇప్పటికీ చాలా తక్కువ మందికే తెలిసిన విషయమేమో బహుశా! దట్టమైన ఎడారిలో.. అద్భుతమైన కోటలకూ పెట్టింది పేరైన రాజస్థాన్ వంటి రాష్ట్రంలోనూ అంతగా తెలియని పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయిన ఈ బావి నిర్మాణం… నాటి ఆర్కెటెక్స్ నిర్మాణ కౌశల్యానికి ఓ తార్కాణం.

800 CE – 900 CE క్యాలెండర్ ఈరాలో.. నికుంభ రాజవంశానికి చెందిన చందా రాజు.. ఈ చాంద్ బవోరి అనే లోతైన 13 అంత్రాల బావిని నిర్మించాడు. ఆనందానికి సూచికగా ఆ రాజవంశం భావించే హషత్ మాతకు ఈ బావిని అంకితం చేశాడు చందారాజు. దీని నిర్మాణ కౌశలమంతా… ఒక స్మారక చిహ్నంలా కనిపించడంతో పాటు… సాంప్రదాయ నీటి సంరక్షణ వ్యవస్థలా తీర్చిదిద్దటం ఈ బావి ప్రత్యేకత. వేసవిలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో పొడిగా ఉండే వాతావరణంలోనూ.. ఈ బావిలో ఉపయోగించిన హార్వెస్టింగ్ టెక్నిక్.. గ్రామస్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా నీటికొరత లేకుండా చేస్తోంది. ఈ మెట్లను దిగి.. ఎక్కే సయమంలో యాత్రికులకు ఇదో అడ్వెంచరస్ ప్లస్ శ్రమతో కూడుకున్న ప్రయాణం. అందుకే కొందరు ఈ బావిలో రాత్రిళ్లు అక్కడే సేద తీరుతుంటారట.

ఈ బావిని బవోలి అని, బవోరి అని, వావ్ అని కూడా పిలుస్తుంటారు. సింధూ నాగరికతతో సహా.. అనేక నాగరికతలు విలసిల్లేందుకు ప్రధానాధారమే నీరు. చాణక్యుడి అర్థశాస్త్రమైనా.. గంగానది నీటిని నిలువ చేసేందుకు అలహాబాద్ సమీపంలో శృంగవేరాపురా వద్ద చేపట్టిన వాటర్ స్టోరేజ్ నిర్మాణల్లోనైనా… కావేరీని ఒడిసిపట్టడానికి చోళరాజు కరికాల ఉపయోగించిన నీటిపారుదల పద్ధతులైనా… భోపాల్ రాజు భోజా భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించడానికైనా… వాటన్నింటి ఉద్ధేశ్యమూ నీటిసంరక్షణే!

సుమారు అదే సమయంలో నీటి అవసరాలను గుర్తించిన చాంద్ కూడా రాజస్థాన్ అభనేరిలో 19.8 మీటర్ల లోతులో స్తంభాలు, వరండాలతో కూడిన ఈ అద్భుతమైన బావి నిర్మాణాన్ని చేపట్టాడు. తూర్పు, పడమర, దక్షిణం వైపులో కనిపించే ఈ 3,500 మెట్లు విలోమదిశలో పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. మొత్తంగా ఈ బావి నిర్మాణమే జిగ్ జాగ్ గా అబ్బురపరుస్తుంది. బావి ముఖద్వారం నుంచి ఒక్కొక్కటిగా ఓపికగా మెట్లు దిగితేనేగానీ… పాతాళంలో ఉన్న నీటిని మనం చేరుకోవచ్చు. భూగర్భజలాలను పెంచే విధంగా ప్రత్యేకమైన రాళ్లను ఈ బావి నిర్మాణంలో అడుగున వాడటంతో.. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ లో భానుడి చండప్రచండంలోనూ ఇందులో నీరు కనిపిస్తుందట. అంతేకాదు.. రాజస్థాన్ వంటి హాట్ హాట్ ప్రదేశంలో.. ఈ బావి దిగువకు వెళ్లితే మాత్రం ఉష్ణోగ్రత కనీసం ఐదు డిగ్రీల కన్నా తక్కువవ్వడం ఇక్కడికొచ్చిన పర్యాటకులకు కొంత ఊరటనిచ్చే అంశం.

కేవలం నీటి సంరక్షణ కోసమన్నట్టే కాకుండా… గాలి, సహజకాంతితో కూడిన వాస్తుశిల్పంతో నిర్మాణమే ఈ చాంద్ బవోరిని ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టింది. ఈ బావిలో మూడువైపులా మెట్లుంటే… ఒకవైపు మాత్రం ఓ హాల్.. అక్కడే గణేషుడి విగ్రహం, మహిషాసురమర్దిని విగ్రహాలతో పాటు.. రాయల్ గా ఉండే ఓ హాల్ దర్శనమిస్తుంది. దాన్నే అంధేరి ఉజాలా అని కూడా పిలుస్తుంటారు. గతంలో కమ్యూనిటీ సమావేశాలు, ప్రదర్శనల వంటివాటి కోసం స్థానికులు ఈ మెట్ల మీదే సమావేశమయ్యేవారనీ చెబుతుంటారు. అయితే నాటి బ్రిటిషర్స్ కాలం నుంచీ నిర్వహణ, సంరక్షణ ఈ రెండూ అంతగా పట్టించుకోకపోవడం.. ఈ బావి నిర్మాణశైలిపై అంత ప్రచారం కాకపోవడంతో ఈ ప్రాంతం అనుకున్న స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందలేకపోయింది.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 1955లో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోగా.. పూర్వ వైభవాన్ని ఈ బావికి తీసుకురావడానికీ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏటా రెండు రోజులపాటు అభనేరి ఉత్సవాలను కూడా ఇక్కడ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో రాజస్థానీ సంప్రదాయలైన కల్బెలియా, ఖయాల్ వంటి అనేక కళారూపాల్లో ఈ విలోమాకార పిరమిడ్ రూపంలో ఉన్న మెట్లను అందంగా ముస్తాబు చేస్తారు. పింక్ సిటీ జైపూర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్ బవోరి అనే అద్భుతమైన బావిని చూడాలనుకుంటే.. రాజస్థాన్ సర్కారీ బస్సులతో పాటు.. ప్రైవేట్ ట్రావెల్సూ, ట్యాక్సీలూ అందుబాటులో ఉంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles