అక్కడి విద్యలో.. విద్యార్థి సంఘాలదీ కీలకపాత్ర!

ఫిన్లాండ్ విద్యార్ధి సంఘాలు..

…………………………………………………………….

డా.పుల్లూరి సంపత్ రావు..✍🏻

ఇక్కడ అనేక రకాల విద్యార్థి సంఘాలు ఉంటాయి. కొన్ని విద్యార్థి సంఘాల సమాఖ్య సంఘాలు లేదా గొడుగు సంఘాలు కూడా ఉంటాయి. చట్ట ప్రకారం విద్యార్థి సంఘాలలో చేరడం తప్పని సరి. ఒక విశ్వవిద్యాలయం మరో విశ్వవిద్యాలయం విద్యార్థులకు కూడా సభ్యత్వం ఇవ్వవచ్చు. విజిటింగ్ విద్యార్థులకు సభ్యత్వం లేదు. Ph.D. విద్యార్థులకు, వృత్తివిద్య విద్యార్థులకు, అప్లయిడ్ సైన్స్ విద్యార్థులకు సభ్యత్వం ఐచ్చికం. అప్పర్ సెకండరీ స్కూళ్ళలో కూడా విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఇవి టీచర్లతో, ప్రిన్సిపాళ్లతో మాట్లాడటానికి పనికి వస్తాయి.

పార్లమెంటరి పద్ధతిలో వీటికి ఎన్నికలు జరుగుతాయి. 20 నుంచి 60 సభ్యుల విద్యార్థి సంఘ అసెంబ్లీ ఉంటుంది. దీని కాల పరిమితి ఒక సంవత్సరం. ప్రతి సంవత్సరం విద్యార్థులు సంవత్సర చందా విధిగా చెల్లించి స్టూడెంట్ కార్డ్ పొందాలి. దీన్ని ఫ్రాంక్ ఐడి కార్డ్ అంటారు. సభ్యత్వ రుసుము మన కరెన్సిలో సంఘాన్ని బట్టి రూ.4300 నుంచి రూ.13000 మధ్య ఉంటుంది. విద్యార్థి సంఘాలకు కార్యాలయాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో డిజిటల్ కార్డ్స్, స్టూడెంట్ ఐడి యాప్స్ కూడా వచ్చాయి. వీటిని చూపించి అనేక సేవలు పొందవచ్చు. అన్ని సంఘాలు తమ మ్యాగజైన్లను ప్రచురిస్తాయి.

ఇవి స్వతంత్రంగా పని చేస్తాయి. యునివర్సిటి బోర్డ్ సహా ప్రతివిభాగంలో విద్యార్ధి సంఘ ప్రతినిథి ఉంటారు. ఫిన్లాండ్ పరిపాలనలో ఈ సంఘాలు ఒక భాగం. యూనివర్సిటి వీటికి ఆర్థిక సహాయం చేస్తుంది. వివిధ రకాల పనులు చేయడం ద్వారా కూడా సంఘాలు డబ్బు సమకూర్చుకుంటాయి. సాదారణంగా పాత విద్యార్ధి సంఘాలు సంపన్నమైనవి. వాటికి స్వంత డార్మేటరిలు ఉన్నాయి. కొన్ని పెద్ద సంఘాలు నర్సింగ్ సేవలు అందిస్తున్నాయి. కొన్నింటికి కఫెటేరియాలు వాటి బ్రాంచీలు ఉన్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు, మల్టినేషనల్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా నడిపే విద్యార్ధి సంఘాలు ఉన్నాయి. సంఘాల ఆస్తులను కొన్నిటిని యూనివర్సిటికి అద్దెకు ఇస్తారు. స్టూడెంట్ యునియన్ ఆఫ్ ద యూనివర్సిటి ఆఫ్ హెల్సేంకి అనే సంఘానికి హెల్సేంకి నగరం మధ్యలో చాలా విలువైన భవనాలు ఉన్నాయి.

ఫిన్లాండ్ లో విద్యార్థి సంఘాలు విద్యార్థులకు అనేక సేవలు అందిస్తాయి. వారి భవిష్యత్తుకు అండగా ఉంటాయి. అయితే విద్యార్థుల చదువులో పురోగతి లేకపోతే రాయితీ సేవలు నిలిపేస్తారు. ఇవి ఈ క్రింది కార్యక్రమాలు, సేవలు అందిస్తాయి.

  1. ఎక్స్ట్రాకరికులర్ అక్టివిటీస్, క్రీడలు నిర్వహించడం.
  2. తక్కువ ధరలలో ఎక్కువ సౌకర్యాలు గల గృహ వసతి కల్పించడం.
  3. రాయితీ భోజన సదుపాయాలు.
  4. కొన్ని ఉచిత మరికొన్ని రాయితీ ఆరోగ్య సదుపాయాలు.
  5. బస్సు, ట్రైన్ వంటి రవాణా సౌకర్యాలలో రాయితీ.
  6. ఫీల్డ్ ట్రిప్స్, నేచర్ ట్రిప్స్, ఎక్స్కర్షన్ వంటి వాటిలో రాయితీ.
  7. గెట్ టుగెదర్, గెస్ట్ లెక్చర్స్, అకడెమిక్ డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేయడం.
  8. వ్యాయామ, జిమ్, బహుళ విశ్వాసాల ప్రార్థనా గదుల ఏర్పాటు.
  9. ఇన్సూరెన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు
  10. నైపుణ్యాలు, మోటివేషన్, టైం మేనేజ్మెంట్, థిసిస్ రాయడం మొదలైన వాటిలో విద్యార్థులకు సహాయం చేయడం.
  11. అకడెమిక్ సంప్రదాయాలు, స్టూడెంట్ ఈవెంట్స్, ఉత్సవాలు, స్వతంత్ర దినోత్సవం, పండుగలు నిర్వహించడం.
  12. గ్రంథాలయాలు, లాబోరేటరి, స్టడీ మెటీరియల్స్ వంటి వాటిలో సహకరించడం.
  13. ఫిన్నిష్ భాష నేర్పించడం కోసం కోర్సులు అందించడం.
  14. సినిమా హాళ్ళలో, హోటళ్ళలో, స్పాలలో రాయితీలు.
  15. షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్లలో రాయితీలు.
  16. కంప్యూటర్లు, స్కానర్స్ ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్స్ వినియోగంలో రాయితీ.
  17. మొబైల్ సేవలు, విద్యుత్ వినియోగం, పత్రికలకు చందా కట్టడం వంటి వాటిలో రాయితీ.
  18. ఆన్ లైన్ ప్రొడక్ట్స్ కొనేటపుడు, విమాన టికెట్లు కొనేటపుడు కూడా రాయితీలు ఇస్తారు.
  19. ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ఊరేగింపులు నిర్వహిస్తాయి.
  20. రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తాయి. మున్సిపల్ ప్రణాళిక మొదలుకొని జాతీయ చట్టాల వరకు ఏ విషయం పైన అయినా తమ అభిప్రాయాన్ని చెప్పగలవు.

రష్యన్ చక్రవర్తి రెండవ అలెగ్జాండర్ విద్యార్థి సంఘాల గురించి 1868 లోనే ప్రస్తావించారు. ఫిన్లాండ్ సంస్కృతి వికసించడంలో విద్యార్థి సంఘాల పాత్ర పెద్దది. ఫిన్లాండ్ జాతీయ గీతాన్ని మొదట యునివర్సిటి విద్యార్థులే పాడారు. 1990ల దశకంలో విద్యారంగం స్థాయి దిగజారిపోయింది. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతుల వలన పిల్లలు పనులకు వెళ్ళేవారు. ఈ కాలంలో విద్యార్థి సంఘాలు స్టూడెంట్ కార్డ్ అనేదాన్ని సాధించి కొన్ని సౌకర్యాలు పొందారు.

విద్యారంగ చట్టాలు చేసేటపుడు ప్రభుత్వం విద్యార్థి సంఘాలను పరిగణలోకి తీసుకుంటుంది. కొన్ని మంత్రిత్వ శాఖలు చట్టాలు చేసేటపుడు విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకుంటాయి. కొన్ని సంఘాలు విద్యార్థుల సమస్యలకు పరిమితం అవుతాయి. మరికొన్ని సంఘాలు స్థానిక సమస్యలు మొదలుకొని ప్రపంచ సమస్యల వరకు పట్టించుకుంటాయి. కొన్ని విద్యార్థి సంఘాలు ఐరోపా సమాఖ్య విద్యార్థి సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని సంఘాలకు బాల్టిక్ మరియు నోర్డిక్ దేశాల విద్యార్థి సంఘాలతో సంబంధాలు కూడా ఉన్నాయి.

విద్యార్థి సంఘ నాయకులు తర్వాత కాలంలో పెద్ద రాజకీయ నాయకులైన వారు, వ్యాపార రంగంలో ప్రముఖులైన వారూ ఉన్నారు. నోకియా కంపని మాజీ సి.ఇ.ఓ, మాజీ దేశాధ్యక్షుడు, కొందరు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు మాజీ విద్యార్థి సంఘ నేతలే.!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles